
నరసరావుపేట, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో ఘటనలు
అనుమానాస్పద మరణాలుగా కేసులు నమోదు
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్‌ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ములకలచెరువులో వ్యక్తి మృతి
శ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.
నెల్లూరు జిల్లాలో ఇద్దరు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్‌షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్‌పై పామూరుకు చెందిన పవన్ మెన్స్‌వేర్ లేబుల్‌ను గుర్తించారు.

శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.