
అనంతపురం: ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని అలజడి.. గుండెను ఎవరో మెలిక పెడుతున్నట్లుగా బాధ... అయినా మనువరాలి పరీక్ష కోసం అన్నీ ఓర్చుకున్నాడు. ఆటోలో పిలుచుకొచ్చి ‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’ అంటూ పరీక్ష కేంద్రం వద్ద వదిలాడు. లోపల మనవరాలు పరీక్ష రాస్తుండగా బయట ఆటోలో గుండెపోటుతో మృతిచెందాడు. హృదయ విదారకమైన ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు...
కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ బొజ్జన్న (65) శుక్రవారం ఉదయం తన మనవరాలు చంద్రకళను పిలుచుకుని ఏపీఆర్‌జేసీ పరీక్షలు రాయించేందుకు అద్దె ఆటోలో అనంతపురానికి చేరుకున్నారు. మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్ద కాస్త నలతగా ఉండడం గమనించిన చంద్రకళ ‘తాతా ఏమైంది’ అంటూ అడగడంతో తనకేమీ కాలేదని నవ్వుతూ పరీక్ష రాసి వచ్చేంత వరకూ తాను అక్కడే ఉంటానని, బాగా రాయాలంటూ చెప్పి కేంద్రంలోకి పంపాడు. అనంతరం ఆటోలోనే సేదదీరుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు.
పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చంద్రకళ నేరుగా ఆటో వద్దకు చేరుకుంది. తాత నిద్రిస్తున్నాడనుకుని లేపేందుకు ప్రయత్నించడంతో ఆయన సీటులోనే జారిపోయాడు. దీంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని బోరున విలపించింది. ‘నేను వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటానని.. ఎక్కడికెళ్లావ్ తాతా..’ అంటూ ఆమె రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. స్థానికుడి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అనంతపురానికి చేరుకుని సాయంత్రానికి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు.