డబ్బుల కోసం కొడుకు ఘాతుకం
తండ్రి ఫిర్యాదు.. ఖమ్మంలో ఘటన
ఖమ్మంఅర్బన్: ప్రేమికురాలికి ఫోన్ కొనివ్వడానికి అవసరమైన డబ్బు కోసం కన్నతల్లినే కడతేర్చాడో కొడుకు. హత్యానంతరం ఆమె ఒంటిపై ఆభరణాలు లాక్కొని పరారయ్యాడు. తమ చిన్న కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి లక్ష్మీనారాయణ, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం 7వ డివిజన్ ఖానాపురానికి చెందిన కొప్పెర లక్ష్మీనారాయణ– వాణి(45) దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గోపి మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం తల్లి మాత్రమే ఉన్న సమయాన డబ్బు కావాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది.
ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఒంటిపై ఆభరణాలైనా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనికి ఆమె ససేమిరా అనగా ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా, గోపి తన తల్లి గొంతునులిమి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఆపై తల్లి ఒంటిపై ఉన్న బంగారు చెవిదిద్దులు, నాన్ తాడు తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి ఇంటి పక్కనవారు వచ్చే చూసేసరికి వాణి విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులు, ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు పోలీసులు చేరుకొని డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా, ఓ కర్చీప్ వద్ద ఆగిపోయింది. దీనిపై ఆరా తీయగా, గోపీదని తేలినట్టు సమాచారం. దీంతో ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా వైరాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment