వికారాబాద్ ఆస్పత్రిలో పసికందు మృతి
డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతోనేనని బాధితుల ఆందోళన
కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతగిరి: వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల పసికందు మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన స్వప్న, భిక్షపతి దంపతులకు ఈనెల 4న వికారాబాద్ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. స్వప్నకు సిజేరియన్ కావడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు.
బాబు పుట్టిన తర్వాత తల్లీబిడ్డను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు చిన్నారికి ఒక్కసారిగా ఎక్కిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు నర్సుకు తెలియజేశారు. వెంటనే వారు విషయాన్ని డాక్టర్‌కు చేరవేశారు. కానీ డ్యూటీ డాక్టర్ ఎంతకూ రాలేదు. వెక్కిళ్లు అధికమై.. శ్వాస ఆడని స్థితిలో చిన్నారి మృతిచెందాడు.
బాధితుల ఆందోళన..
ఆస్పత్రిలో చిన్నారి మరణించడంతో కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతిచెందాడని తండ్రి భిక్షపతి ఆరోపించారు. సకాలంలో వచ్చి చూసిఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని బోరుమన్నాడు. చిన్నారికి వెక్కిళ్లు తగ్గడం లేదనే విషయాన్ని నర్సులు ఫోన్ చేసి చెప్పినా, డాక్టర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో డాక్టర్ వచ్చి చూడగా ఎలాంటి కదలికలు లేకపోవడంతో సీపీఆర్ చేసి, చనిపోయాడని చెప్పారన్నారు.
సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు. భిక్షఫతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సీఐ భీంకుమార్ తెలిపారు. ఈఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ వేశామని, ప్రాథమిక విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ రాంచంద్రయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment