ఏపీ నుంచి 20 బాక్స్‌లలో 400 రేసింగ్ కపోతాలు
ప్రతి పావురం కాలికి కోడ్ నంబర్, చిప్
పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు అప్పగింత
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్‌లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.
పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్‌కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.
పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్‌లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్‌లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ
సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్‌లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్‌లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment