‘ఉచిత బస్’తో నిత్యం తంటాలు
బస్సుల సంఖ్య పెంచాలని వేడుకోలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
ప్రయాణికులు పట్టించుకోని అధికారులు
బొంరాస్‌పేట: ప్రభుత్వం మహిళలకు కల్పించిన ‘ఉచిత బస్ ప్రయాణం’తో నిత్యం ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులు మాత్రం సీట్లకోసం కుస్తి పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొడంగల్ ప్రాంతానికి నిత్యం సరిపడ ఆర్డినరి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని పట్టించుకునే అధికారులు కరువయ్యారు. అన్ని చోట్ల ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీరో టికెట్ పట్ల కొందరు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేక్రమంలో పరిగి, కోస్గి, తాండూరు, నారాయణపేట డిపోల మేనేజర్లు చేపట్టిన ప్రయోగాత్మక డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలు ఆశాజనకంగా లేవని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.
కొందరు ప్రయాణికులు డీలక్స్ బస్సులో డబ్బులు పెట్టలేకపోతున్నారు. మరికొంతమంది ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ బస్సులు ఫుల్‌గా ఉండడంతో తంటాలు పడి అదే బస్సును ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దీంతో డీలక్స్‌లు నిల్.. ఎక్స్‌ప్రెస్ ఫుల్ అని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment