![Sensational Details In Remand Report Of The Rama Rajyam Army Case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Sensational-Details-In-Rema.jpg.webp?itok=goQhIp3H)
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. రామరాజ్యం ఆర్మీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో పలు అంశాలను పోలీసులు మెన్షన్ చేశారు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటైంది. రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు పేరుతో మొదటి స్లాట్‌లో 5000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయల డొనేషన్లు వచ్చాయి. 20 నుంచి 50 సంవత్సరాలలోపు వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో సభ్యత్వం ఇస్తున్నారు. ప్రతి నెల 20 వేల రూపాయల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన రామరాజ్యం ఆర్మీ.. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసింది. రిజిస్ట్రేషన్‌కు రూ.350 రుసుము వసూలు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు.
ఆర్‌పీసీ 340ను న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని రామరాజ్యం ఆర్మీ వాదన. దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని.. న్యాయవ్యవస్థ కేవలం క్రిమినల్స్‌కే తప్ప సామాన్యులకు కాదంటూ రామరాజ్యం ఆర్మీ వాదన వివినిస్తోంది. ఐదు కిలోమీటర్ల నడవగల శక్తి ఉన్నవారికి మాత్రమే ఆర్‌ఆర్ ఆర్మీలో చేరేందుకు అర్హతగా నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఇప్పటికే ప్రధాన నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు సోమవారం మరో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. రామరాజ్యం సైన్యం ఏర్పాటు, చేపడుతున్న కార్యాకలాపాలను పూర్తి స్థాయిలో గుర్తించారు. కేసుకు సంబంధించిన విషయాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పురుకు చెందిన కొవ్వురి వీర రాఘవరెడ్డి 2022లో ఫేస్‌బుక్ వేదికగా రామరాజ్యం సంస్థను ప్రారంభించాడు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి రామరాజ్యం సైన్యంలో చేరేలా ప్రజలను ప్రేరేపించాడు. రిజిస్టర్ చేసుకున్నవారికి రూ.20 వేలు వేతనం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటనకు 25 మంది స్పందించి రామరాజ్యం సైన్యంలో చేరారు.
ఈ నెల 7న మూడు వాహనాల్లో, 25 మంది సభ్యులతో కలిసి వీర రాఘవరెడ్డి చిలుకూరు దేవాలయం వద్దకు వచ్చాడు. అర్చకుడు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి రామరాజ్యం సైన్యానికి వ్యక్తులను పంపాలని, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. దీనిపై రంగరాజన్ ఈ నెల 8న మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనికి కోర్డు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో సోమవారం ఖమ్మం జిల్లాకు చెందిన రామరాజ్యం సైన్యంలోని సభ్యులు శిరీష, రాణి, గోపాల్, శ్రీను, నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment