కొడంగల్(వికారాబాద్ జిల్లా): ప్రధాన మంత్రి అవస్ యోజన కింద ఇల్లు లేని పేదల కోసమ్ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని,. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna). అమృత్ 2 పథకం ద్వారా నిధులు కేటాయింపుపై కొడంగల్ లో మాట్లాడిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
నిరుపేదలు ఇళ్లు లేకుండా ఉండకూడదనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని డీకే అరుణ స్పష్టం చేశారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలానే చేశారని ఆమె మండిపడ్డారు.
పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలి..
గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేశారని, అందులో కేవలం కాంగ్రెస్ పార్టీ వారినే పరిమితం చేయొద్దన్నారు. ఈ కమిటీల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎవరైతే నీడలేని పేద ప్రజలు ఉంటారో అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద ప్రజలు ఉండకూడదని, పార్టీలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు డీకే అరుణ.
జనాభా ఆధారంగానే అమృత్ 2 పథకం నిధులు
అమృత్ 2 పథకం(amrut 2 scheme) కింద దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు డీకే అరుణ. ఈ పథకం ద్వారా మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ నిధులు వాడుకోవచ్చన్నారు. కొడంగల్ మున్సిపాలిటీకి కూడా రూ. 4.50 కోట్లు మంజూర చేయడం జరిగిందని, మున్సిపాలిటీలో ఉన్న జనాభా ఆధారంగా చేసుకొనే నిధులను విడుదల చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పంచాయతీ, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని, అందులో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్(NREGS) పథకం ద్వారా సీసీ రోడ్డు, రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇవ్వడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment