PMAY
-
తెలంగాణలో 80% పట్టణీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం ప్రాంతం పట్టణీకరణ చెందిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలోని 28 పట్టణాభివృద్ధి సంస్థల జాబితాతోపాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాల వివరాలను అందజేసింది. గతంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలే ఉండగా, పట్టణీకరణ నేపథ్యంలో వాటిని 28కి పెంచిన ఉత్తర్వుల ప్రతులను కూడా జత చేసింది. పట్టణ ప్రాంతాల సంఖ్య, పరిధి బాగా పెరిగినందున ఈసారి ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) పథకం కింద రాష్ట్రానికి ఇళ్ల యూనిట్ల సంఖ్యను పెంచాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి భారీగా నిధులు పొందే ఉద్దేశంతో ఈ వివరాలను అందజేసింది. రూ.6 వేల కోట్లు అందేలా..ఇందిరమ్మ పథకం కింద తొలుత 4.20 లక్షల ఇళ్లను పేదలకు ప్రభుత్వం ఇవ్వబోతోంది. వీటి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారంగానే ఉండనుంది. దీంతో కేంద్రం నుంచి ఎన్ని ఎక్కువ నిధులు అందితే అంత భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా, గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్‌ను రూ.72 వేలుగా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం ఇచ్చే పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.లక్షన్నర అందితే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. మొదటి విడతలో కేంద్రం నుంచి రూ.6 వేల కోట్ల నిధులు అందుతాయని అంచనా వేస్తోంది. రాష్ట్ర వినతిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముందు ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను అందజేయాలని కోరింది. సంక్రాంతి నాటికి జాబితా..ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం అర్హుల గుర్తింపు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌లో సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నారు. గతంలో ప్రజా పాలన పథకం కింద అందిన 80.54 లక్షల దరఖాస్తుల వివరాలను దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి నమోదు చేస్తు న్నారు. దీంతో ఆటోమేటిక్‌గా అర్హుల జాబితా ను యాప్ సిద్ధం చేస్తుంది. ఈ ప్రక్రియ సంక్రాంతి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే వివరాలను కేంద్రం రూపొందించిన పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ వివరాలను కేంద్రప్రభుత్వం సరిచూసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యూనిట్లను మంజూరు చేసి నిధులు విడుదల చేస్తుంది. సమగ్రంగా వివరాల సేకరణదరఖాస్తు పత్రాల్లో నమోదు చేసిన వివరాలు కాకుండా, దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు రాబట్టి యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఏడు ప్రశ్నలకు జవాబులుగా వాటిని సేకరిస్తున్నా.. గతంలో వారి కుటుంబాల్లో ఎవరికైనా పక్కా ఇంటి పథకం కింద లబ్ధి చేకూరిందేమో నన్న అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇల్లు వచ్చినవారు ఆ కుటుంబాల్లో ఉంటే ఆ దరఖాస్తును అనర్హమైందిగా తేలుస్తారు. ఇక ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు రేషన్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్‌కార్డు నంబర్ ద్వారా ఇతర ఆర్థికపరమైన లావాదేవీలతో సరిపోల్చుకునే కసరత్తు కూడా జరుగుతోంది. వెరసి అనర్హులు ఎవరికీ పొరపాటున కూడా జాబితాలో చోటు దక్కుకుండా చూస్తున్నారు. అనర్హులను గుర్తిస్తే నిధుల మంజూరులో కేంద్రం కొర్రీలు విధించే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. పేదల్లో అతి పేదలను గుర్తించేందుకు కొన్ని మార్కులు కేటాయిస్తున్నారు. ఆ మార్కులు ఎక్కువగా వచ్చిన దరఖాస్తులకు ర్యాంకులు ఇచ్చి మొదటి 4.20 లక్షల ర్యాంకులను ఎంపిక చేయనున్నారు. వారినే లబ్ధిదారులుగా గ్రామ సభల ముందు ఉంచి చర్చించి ఖరారు చేయనున్నారు. -
పేదింటికి కేంద్రం చేయూత రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి సంస్థల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచటంతో చాలా గ్రామాలు ‘పట్టణ పరిధి’లోకి చేరటంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపు కానుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలుగా ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మూడొంతులకు పైగా గ్రామ పంచాయతీలు పట్టణాభివృద్ధి సంస్థల జాబితాలోకి వెళ్లాయి. గతంలో 9 పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా, వాటి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 28కు పెంచింది. ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు ‘పట్టణ’ పరిధిలోకి చేరనున్నాయి. దీంతో వీటికి పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందుతాయి. రెండో దశలోనూ పాత యూనిట్ కాస్ట్లే..చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలుగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు ఇస్తుంటే, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోయేది. కానీ తెలంగాణ ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర ఖజానాపై అతిపెద్ద భారం మోపనుంది. పీఎంఏవై పథకం మొదటి దశ కాలపరిమితి తీరిపోవటంతో, కేంద్రం రెండో దశకు శ్రీకారం చుడుతోంది.ఇందులో పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.2.25 లక్షలకు పెంచుతారనే ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్లో 45 శాతం కేంద్రమే భరించినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్‌ను పెంచకుండా, గతంలో ఉన్న రూ.1.5 లక్షలే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ కూడా రూ.72 వేలుగానే ఉంది. గ్రామీణ యూనిట్లకు పట్టణ కాస్ట్ దక్కేలా..కేంద్రం నుంచి గ్రామీణ యూనిట్ కాస్ట్ రూ.72 వేలు మాత్రమే అందితే, ఆ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కొంతైనా ఊరట దక్కేలా వ్యూహరచన చేసిన ప్రభుత్వం.. సింహ భాగం గ్రామాలకు పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ (రూ.1.5 లక్షలు) దక్కేలా పట్ణణాభివృద్ధి సంస్థల సంఖ్యను పెంచేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు ‘పట్టణ’ పరిధిలోకి రానున్నాయి. తద్వారా వాటికి ‘పట్టణ’ యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కేవలం గృహనిర్మాణ పథకానికే పరిమితం కాకుండా, కొన్ని ఇతర పథకాలకు కూడా లబ్ధి చేకూర్చనుండటం గమనార్హం.సాయంపై స్పష్టతకు మరింత సమయంరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికే రాష్ట్రంలో పథకాల ప్రకటన జరిగిపోయింది. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం పథకాలను సమీక్షించుకుంటూ మార్పు చేర్పులు చేసేసరికి మరింత ఆలస్యం అయింది. ఫలితంగా కేంద్రం నుంచి ఎంత సాయం అందుతుందో రాష్ట్రానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా పట్టణాభివృద్ధి సంస్థల పెంపు నేపథ్యంలో, ఎన్ని పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.అంటే తాజా నిర్ణయం మేరకు పట్టణ ప్రాంత ఇళ్ల సంఖ్యను తేల్చాల్సి ఉంది. ఆ మేరకు త్వరలో క్షేత్రస్థాయి సర్వే చేసి వివరాలు క్రోడీకరించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఎన్ని యూనిట్లను మంజూరు చేస్తుందో ఆ తర్వాతే తేలుతుంది. అప్పుడే కేంద్రం నుంచి వచ్చే సాయంపై స్పష్టత వస్తుంది. కానీ గతంతో పోలిస్తే ఆ సాయం భారీగా పెరుగుతుందని మాత్రం తేలిపోయింది. -
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో ఆశలు ‘డబుల్’!
సాక్షి, సిటీబ్యూరో: ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పీఎంఏవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయాలని సోమవారం జరిగిన కేంద్ర నూతన మంత్రిమండలి సమావేశం తీసుకున్న నిర్ణయంతో నగర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలోని ప్రజల కోసం రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలనుకున్నా, లక్ష ఇళ్ల పనులను ప్రారంభించి దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.దరఖాస్తులు ఎక్కువ , పూర్తయిన ఇళ్లు తక్కువ కావడంతో లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఆ సందర్భంగా ఇళ్లురాని పలువురు కన్నీళ్ల పర్యంతమయ్యారు.లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాల్లో పాల్గొన్న అప్పటి మంత్రులు కేటీఆర్, తలసాని, తదితరులు ఇప్పుడు ఇళ్లు రాని వారు దుఃఖించవద్దని, దశలవారీగా పేదలందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు దాదాపు 7లక్షల మందికి పైగా ఉండగా,పంపిణీ చేసిన ఇళ్లు 70వేలే. దీంతో తమకెప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారెందరో ఉన్నారు.ఈ నేపథ్యంలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు మంత్రిమండలి నిర్ణయించడంతో వాటికోసం ఎదురు చూస్తున్న వారికి ప్రయోజనం చేకూరగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇళ్లులేని వారికి ఇంటి సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట తాము పేదలకు గృహ సదుపాయం కల్పిస్తామని, స్థలమున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ నేతలు హామీలిచ్చారు.పేరేదైనా కేంద్రప్రభుత్వం సహాయం అందజేయనున్న మూడు కోట్ల ఇళ్లలో నగరానికి కూడా గణనీయమైన సాయం అందగలదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పేరేదైనా, పథకమేదైనా నగరంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి తగిన నిధులందగలవనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీ కేబినెట్ తొలి నిర్ణయం: పేద ప్రజలకు శుభవార్త
నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు (జూన్ 10) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కొత్త మంత్రుల శాఖలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.నరేంద్ర మోదీ.. ఇతర కేంద్ర మంత్రుల మంత్రివర్గ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన కింద ఏకంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నిజం చేసుకునే వారికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఓ గొప్ప వరం అనే చెప్పాలి.పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశ్యంతో.. 2015-16 బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రకటించారు. అర్హత కలిగిన పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 4.21 కోట్ల ఇల్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, కుళాయి (నల్లా) కనెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేయడం జరిగింది. -
PM Modi Emotional Video: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగం
సోలాపూర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇళ్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 90 వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్(అర్బన్) కింద ఇళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూసినపుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండనిపించింది. అయితే ఇప్పుడు ఇంత మంది లబ్ధిదారుల ఇంటి కల నిజమయినందుకు సంతృప్తిగా ఉంది. వాళ్ల ఆశీర్వాదాలే నాకు పెద్ద ఆస్తి’ అని చెమర్చిన కళ్లతో మోదీ చెప్పారు. అణగారిన వర్గాల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెపపడానికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే ఒక ఉదాహరణ అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేయడమే అని చెప్పారు. పీఎం అర్బన్ స్కీమ్ కింద సోలాపూర్‌లో చేపట్టిన రాయ్ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టని మోదీ తెలిపారు. 90 వేల ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో శానిటరీ సిబ్బంది, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం గమనార్హం. #WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others. PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5 — ANI (@ANI) January 19, 2024 ఇదీచదవండి.. దశాబ్దాల కల నెరవేరుతోంది.. మోదీ -
ఏడాది చివరికి పూర్తి ‘ఆవాస్’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాని మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలిచ్చింది. పీఎంఏవై(అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.2 లక్షల కోట్లతో 1.18 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇందులో ఇప్పటికే 76 లక్షల గృహాలు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 42 లక్షల గృహాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గణాంకాల లెక్కల ప్రకారం తెలంగాణలో 2.50 లక్షల గృహాలకు మంజూరులివ్వగా, ఇందులో 2.23 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికే కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.4,475 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.3,314 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 21.32 లక్షల గృహాలకు మంజూరునివ్వగా, ఇందులో 7.95 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికై కేంద్రం తన వాటాగా రూ.32,499 కోట్లకు గాను రూ.20,045 కోట్లు విడుదల చేసింది. ఇక పీఎంఏవై(గ్రామీణ్) కింద కేంద్రం మొత్తంగా 2.93 కోట్ల గృహాల నిర్మాణాలను మంజూరులివ్వగా, అందులో 2.40 కోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 53 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. -
మతం చూడం.. కులం చూడం..: ప్రధాని మోదీ
గాంధీనగర్: అసలైన లౌకికవాదం అంటే.. తన దృష్టిలో వివక్ష లేకపోవడమేనని గుజరాత్ పర్యటనలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వారికి నేను చెప్పదల్చుకుంది ఒక్కటే. ప్రజల సంతోషం, వాళ్ల సౌలభ్యం.. పూర్తిస్థాయి హక్కుల కోసం పని చేయడం కన్నా గొప్ప సామాజిక న్యాయం మరొకటి లేదని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం కూడా అదే తోవలో పయనిస్తోందని అన్నారాయన శనివారం గాంధీనగర్(గుజరాత్) మహాత్మా మందిర్‌లో సుమారు 4 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. సంక్షేమం అందించడంలో తన ప్రభుత్వం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుదందని చెప్పారు. నా దృష్టిలో సెక్యులరిజం అంటే.. వివక్ష లేకపోవడమే. అందుకే కులం, మతం అనే పట్టింపు లేకుండా వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను మా ప్రభుత్వం అందిస్తోంది. ఇలా అందరి సంతోషం, సౌలభ్యం కోసం పని చేసినప్పుడు.. అంతకు మించిన సామాజిక న్యాయం మరొకటి ఉండబోదని చెప్పారాయన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. గుజరాత్లో నిర్మిస్తున్న నివాస సముదాయాలకు శంకుస్థాపన చేశారాయన. ఈ పథకం కింద.. పేదల కోసం నాలుగు కోట్ల నివాసాలు నిర్మించామని, అందులో 70 శాతం నివాసాలను మహిళలకు అందజేయడం ద్వారా మహిళా సాధికారికతను చాటామని తెలిపారాయన. -
భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం డబ్బులు తీసుకున్న నలుగురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన ఊహించని ఘనకార్యం తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతైంది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం.. దీని ద్వారా దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి మూడు నుంచి 18 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే పీఎంఏవై కింద ఇచ్చే రుణాలను కేంద్రం మహిళల పేరు మీదనే అందిస్తుంది. అంటే ఇంటి యజమాని తప్పనిసరిగా మహిళనే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.50,000 చొప్పున నగదును జమచేశారు. అయితే ఈ పథకం కింద రుణాలు పొందిన వారిలో నలుగురు మహిళలు తమ అకౌంట్లకు చేరిన 50 వేల రుపాయలతో కనిపించకుండా పోయారు. భర్తలు వారి కోసం ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పరారైనట్లు తెలింది. ఇలా పారిపోయిన వాళ్లలో జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్పూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా భార్యలు పారిపోవడం భర్తల పాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వింత ఉదంతం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా అధికారులు బాధిత భర్తలను హెచ్చరించారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న భర్తలకు ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు ప్రేమించిన వారితో వెళ్లిపోయారని.. వారి బ్యాంక్ ఖాతాలలోకి పీఎంఏవై రెండో విడత రుణాలను జమచేయవద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు పారపోయిన లబ్ధిదారుల నుంచి సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు. చదవండి: పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్.. -
లబ్ధిదారులకే ఫ్లాట్ల నిర్వహణ పగ్గాలు
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇళ్లులేని పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (పీఎంఏవై–యు) పథకంలో నిర్మించిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. అక్కడ అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మనకు ఇక్కడ అనువైన నిబంధనావళిని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో 88 యూఎల్బీల్లో 2.62 లక్షల టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో జీ+3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రాంతాన్ని బట్టి 1000 నుంచి 12 వేల వరకు ఉన్నాయి. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక సంక్షేమ సంఘం చొప్పున ఫ్లాట్ల యజమానులతోనే కమిటీ ఏర్పాటుచేసి వీటి అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కమిటీల ఏర్పాటు తర్వాత ఒక్కో ఫ్లాట్‌కు రూ.100 నుంచి రూ.150 మధ్య నిర్వహణ రుసుం వసూలు చేసి, వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు.. పీఎంఏవై–యు కింద భోపాల్‌లో తొమ్మిది అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించగా, రాజ్‌కోట్‌లో అంతకుమించి అంతస్తుల్లో అపార్ట్మెంట్లను నిర్మించి, దిగువ, మధ్యాదాయ వర్గాలకు కేటాయించారు. వాటి నిర్వహణను సైతం వాటి యజమానులకే కేటాయించినప్పటికీ, నిర్వహణ రుసుం భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భోపాల్‌లో రూ.850, రాజ్‌కోట్‌లో రూ.200 ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్మించిన పీఎంఏవై–యూ అపార్ట్మెంట్లలో ఫ్లాట్‌కు రూ.850 చొప్పున సంక్షేమ సంఘం వసూలుచేస్తుండగా, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రతి ఫ్లాట్ యజమాని రూ.30 వేల డిపాజిట్‌తో పాటు ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నారు. ఈ నగదుతో ఆయా సంఘాలు అపార్ట్మెంట్ ప్రాంగణంలోని అంతర్గత పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి మోటార్ల నిర్వహణ, రక్షణ వంటి అంశాలకు ఖర్చుచేస్తున్నారు. రెండ్రోజులుగా భోపాల్‌లోని నివాసాలను టిడ్కో చైర్మన్ జమాన్న ప్రసన్నకుమార్, గృహనిర్మాణ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. గృహాల నిర్మాణం, సౌకర్యాల విషయంలో మన రాష్ట్రమే మెరుగ్గా ఉన్నట్లు వారు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ పట్టణ పేదల కోసం మధ్యప్రదేశ్, గుజరాత్ చేపట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా మన రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడి నివాసితులతో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటుచేసిన తరువాత లబ్ధిదారులు భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, అంతర్గత రోడ్ల శుభ్రత వంటి వాటికోసం భోపాల్‌లో ప్రతి ఇంటి నుంచి రూ.850 వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అవి నామమాత్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – జమాన్న ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్ -
‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి
సాత్నా: దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో శనివారం గృహప్రవేశాలను ఆయన రిమోట్ నొక్కి ప్రారంభించారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్‌పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఎంతోమంది పన్ను చెల్లింపుదార్లు తనకు లేఖలు రాశారని, ఉచితాలకు అడ్డుకట్ట పడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉచిత పథకాల నుంచి దేశం విముక్తి పొందాలని సమాజంలోని ఒక పెద్ద వర్గం ఆశిస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. పీఎంఏవై కింద దేశంలో గత ఎనిమిదేళ్లలో పేదలకు అన్ని వసతులతో కూడిన 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వివరించారు. పేదలకు ఇచ్చిన ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. -
గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది. సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
గుడ్‌న్యూస్: 2024 డిసెంబర్ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)–అర్బన్ పథకాన్ని 2024 డిసెంబర్ 31వ తేదీ వరకూ కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి దేశంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని 2015 జూన్‌లో ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మంజూరు చేసిన 122.69 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థన మేరకు పథకాన్ని 2024 డిసెంబర్ 31 కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు) -
గ్రామీణ నిరుపేదల పక్కాఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
ఏజీవర్సిటీ: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నాణ్యమైన పక్కాఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్లోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో నిర్మించిన మోడల్‌హౌస్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూరల్ పార్క్ వద్ద ఉన్న కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించి ఉత్పత్తి చేసే ప్రక్రియ, నాణ్యత గురించి ఆరా తీశారు. మంత్రి సమక్షంలో ఎన్ఐఆర్డీపీఆర్, నేషనల్ స్మాల్ ఇండ్లస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
పట్టణాల్లో పీఎంఏవై ఇళ్ల పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. 2015లో పథకం ఆరంభ సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అయితే పక్కా ఇళ్ల కోసం రాష్ట్రాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వాటికి అనుమతులివ్వడం, నిర్మాణాలు జరపడం సకాలంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గడువును మార్చి 2024 వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పథకం కింద మొత్తంగా 1.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ.2.01 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా, ఇందులో 99 లక్షల ఇళ్ల పనులు మొదలవ్వగా, 59 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే..తెలంగాణలో 2.47లక్షల ఇళ్లకు గానూ 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమో లేక లబ్ధిదారులకు అందించడమో చేసినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 20.71 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 17.88 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వగా, ఇందులోనూ 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12,559 కోట్లను విడుదల చేసింది. -
మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే వీరి మధ్య మాటల తూటలు, భౌతిక దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల కింద పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బెంగాల్ కూలీలకు 100 రోజుల పనికి వేతనాలను తర్వగా విడుదల చేసేలా ఆయా సంబంధిత మంత్రిత్వశాఖలను ఆదేశించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో బెంగాల్ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మమత ఆవేదన వ్యక్తపరిచారు. మరోవైపు.. పీఎం ఆవాస్ యోజన నిధుల విషయంపై కూడా మోదీని మమత నిలదీశారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామీణాభివృద్ధి జరగడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వీటికి సంబంధించిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని మమత కోరారు. -
PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇల్లు కొనే మధ్య తరగతి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.48,000 కోట్లు కేటాయించింది. 2023 నాటికి దేశంలో సుమారు 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 3 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రాల్లో సుమారు 114.02 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. వీటిలో ఇప్పటి వరకు 53.42 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇల్లు కొంటే మీరు భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద మీకు ఏకంగా రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. మార్చి 31, 2022 నాటికి అర్హులైన కుటుంబాలు లేదా లబ్ధిదారులకు ఇళ్లు అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నందున ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం వేగంగా అమలవుతోంది. మరోవైపు రూ.60,000 కోట్లతో 3.8 కోట్ల ఇళ్లకు ట్యాప్ వాటర్ ద్వారా మంచినీటిని అందించనుంది ప్రభుత్వం. పట్టణ సామర్థ్యం పెంపుదల, ప్రణాళిక అమలు, పాలన కోసం అర్బన్ ప్లానర్స్, ఎకనమిస్ట్‌లతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనుంది. (చదవండి: 5జీ టెక్నాలజీతో కేంద్రానికి భారీగా ఆదాయం..!) -
వచ్చే ఏడాది చివరికల్లా పీఎంఏవై ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట కాల పరిమితిని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల నిర్మాణంపై టీడీపీ నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) పరిష్కరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తాను నిర్దేశించిన కాలపరిమితి మేరకు నడుచుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 84వేల ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త జాలా బాలాజీ గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. 45వేల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. 2022 మార్చి నాటికి 75వేలు ఇళ్లు, జూలై 22 నాటికి 70వేలు, డిసెంబర్ 22 నాటికి 72 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరంలేదంటూ ఉత్తర్వులు జారీచేసింది. -
ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి కేంద్రం
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. సింగిల్ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసి పూర్తివివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వాలని కోరారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన తరువాత అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామంది. తదుపరి విచారణను గురువారానికి (ఈ నెల 28వ తేదీకి) వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ గురించి మంగళవారం అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యవహారం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించినదని తెలిపారు. ఇప్పటికే కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీని కోర్టు ముందుంచామని, అత్యవసరం దృష్ట్యా ఈ వ్యాజ్యంపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఇది పీఎంఏవైతో ముడిపడి ఉన్నందున తమ అప్పీల్లో కేంద్రం ప్రతివాదిగా ఉండటం తప్పనిసరి అని తెలిపారు. ఈ సమయంలో ఏఎస్జీ హరినాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయని చెప్పారు. -
ఇళ్ల విస్తీర్ణంలోనూ రికార్డే
సాక్షి, అమరావతి : ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు విస్తీర్ణంలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా, ఇదివరకెన్నడూ ఇంత విస్తీర్ణంలో పేదల ఇళ్లు నిర్మించలేదని స్పష్టం అవుతోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే.. వారు సూచించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో ఇళ్ల నిర్మాణం సాగుతోంది. బెడ్రూమ్, హాలు, వంట గది, బాత్ రూమ్, వరండాతో ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రూ.10 వేల కోట్లు వ్యయం చేసింది. -
గతం కన్నా మిన్నగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను అనుసరిస్తోందని, నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్లను కడుతోందని వారు పేర్కొంటున్నారు. అలాగే గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం చేపడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులను న్యాయస్థానం తీర్పు ఎంతో నిరాశపరిచింది. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే.. ఎన్బీసీ నిబంధనల ప్రకారం ఇంటిలో పడక గది, హాల్ విస్తీర్ణం 167 చ.అ ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో ఆ విస్తీర్ణం 169.54 చ.అ ఉంటోంది. అంటే పడక గది విస్తీర్ణం 97 చదరపు అడుగులకు గాను 97.07 చ.అడుగుల లోనూ, హాల్ విస్తీర్ణం 70 చ.అ గాను 72.47 చ.అడుగుల విస్తీర్ణంలోను ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. అదే విధంగా వంట గది 35.5 చ.అ లకు గాను 35.75 చ.అ ల్లో నిర్మిస్తున్నారు. బాత్రూమ్ విస్తీర్ణం 19.4 చ.అ లకు గాను 20.52 చ.అ ఉండేలా ఇళ్లకు ప్రణాళికను రూపొందించారని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల ప్లింత్ ఏరియా 215 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 144 చదరపు అడుగులుగా ఉండేది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ రూరల్ ఇళ్ల ప్లింత్ ఏరియా 224 చ.అ, కార్పెట్ ఏరియా 180 చ.అవిస్తీర్ణం. ప్రస్తుతం ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల ప్లింత్ ఏరియా 340చ.అ, కార్పెట్ ఏరియా 218.65 చ.అ విస్తీర్ణం ఉంటోంది. (సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా ఇంటిలో ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని ప్లింత్ ఏరియాగా పరిగణిస్తారు. -
గ్రీన్ ఫీల్డ్ కాలనీల నిర్మాణానికి సహకరించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణాలను కూడా చేపట్టిన నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసేలా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) కింద గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని నిబంధన విధించారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారీగా ఖర్చవుతుందని.. అంత వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం సాధ్యం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వాటిలో లబ్ధిదారులు నివాసం ఉండలేరని వివరించారు. అప్పుడు ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణానికి చేసిన వ్యయం నిరర్ధకమవుతుందని, పీఎంఏవై పథకం ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధించలేమన్నారు. గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాల్లో కీలకమైన లక్ష్యాన్ని (ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు జీవించేలా పట్టణాలు, గ్రామాలను తీర్చిదిద్దడం) దేశం అధిగమిస్తుందని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ.. మహత్తర లక్ష్యం... ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2022 నాటికి మురికివాడల్లో నివసిస్తున్న వారితోపాటూ అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యం మహత్తరమైనది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు పీఎంఏవై పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అమలవుతోన్న మహత్తర సంక్షేమ పథకాల్లో పీఎంఏవై పథకం ఒకటి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం వల్ల ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఎస్డీజీలను దేశం అధిగమిస్తుంది. పీఎంఏవై లక్ష్యం సాధించాలంటే.. ► సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరికీ ఇళ్లు పథకాన్ని కేంద్రం చేపట్టింది. గత ఏడేళ్లగా 308.2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. భారీ ఎత్తున కాలనీల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి కేంద్ర వాటా కింద రూ.2.99 లక్షల కోట్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం మూడు అంశాలపై ఆధారపడింది. అవేమిటంటే.. 1. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలను మంజూరు చేయడం 2.ఆ స్థలంలో పక్కా ఇంటిని నిర్మించుకోవడానికి సహాయం అందించడం 3.ఆ ఇంటిని నిర్మించుకున్న కాలనీ, లేఅవుట్లలో రహదారులు, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, మురుగునీటి కాలువలు లాంటి కనీస సదుపాయాలను కల్పించడం. మిషన్ పూర్తయ్యేలోగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం.. ► ప్రజాసాధికారతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం తరహాలోనే రాష్ట్రంలో 68,381 ఎకరాలను 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీకే రూ.23,535 కోట్లను ఖర్చు చేశాం. ఇందులో 28.30 లక్షల ఇళ్లను 17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో రూ.50,944 కోట్లతో చేపట్టాం. ► ఇళ్లను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయడానికి అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ర్యాంకులో అన్ని జిల్లాల్లోనూ ‘జాయింట్ కలెక్టర్, హౌసింగ్’ పేరుతో ప్రత్యేక పోస్టును ఏర్పాటు చేశాం. ఈ పోస్టుల్లో యువ ఐఏఎస్ అధికారులను నియమించాం. మిషన్ గడువు ముగిసేలోగా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే విశ్వాసం ఉంది. కనీస సదుపాయాలు కల్పిస్తేనే లక్ష్యం సాకారం.. ► గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే పీఎంఏవై పథకం లక్ష్యం సాకారం కాదు. రాష్ట్రంలో 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.34,109 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► పీఎంఏవై పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికే రూ.23,535 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి అయ్యే భారీ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు. ► పీఎంఏవై పథకం సాకారం కావాలంటే గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ అంశంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడానికి నిధులు ఇచ్చేలా కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని కోరుతున్నా. -
PMAY: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి’ అని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. చదవండి: 9.05 లక్షల మందికి జగనన్న తోడు -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
‘త్వరలో లక్ష ఇళ్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్: త్వరలో 1.03 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 52 వేల ఇళ్లు పూర్తి చేశామని, వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నాయని, మరో 1.03 లక్షల ఇళ్లు 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని సభకు తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలా ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా ఇళ్లను కట్టించి ఇచ్చే పథకం లేదన్నారు. ఇప్పటివరకు ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.10,054 కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో రూ.8,743 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులని, కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.1,311 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బిల్లులు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 9,650 కోట్లు అందించామని, రూ. 400 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటినీ త్వరలో ఇస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనలో ఉందని చెప్పారు. రాంపల్లిలో టన్నెల్ ఫామ్ టెక్నాలజీ, దుండిగల్‌లో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీలను వినియోగించి ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించి పీఎంఏవై గ్రామీణ్ కింద రూ. 385 కోట్లకుగాను రూ. 190 కోట్లే విడుదల చేసిందని, ఇదే పథకం అర్బన్ విభాగంలో రూ. 2,305 కోట్లకుగాను రూ. 1,120 కోట్లే ఇచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల మొత్తం వైశాల్యం 12 కోట్ల చదరపు అడుగులన్నారు. 75 వేల మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి, అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధమైన వారు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే ఈ పథకం కింద సాయం చేస్తామన్నారు.