
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్‌లో ఇంప్లీడ్ అవుతామని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు.
సింగిల్ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసి పూర్తివివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వాలని కోరారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన తరువాత అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామంది. తదుపరి విచారణను గురువారానికి (ఈ నెల 28వ తేదీకి) వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ గురించి మంగళవారం అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యవహారం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించినదని తెలిపారు. ఇప్పటికే కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీని కోర్టు ముందుంచామని, అత్యవసరం దృష్ట్యా ఈ వ్యాజ్యంపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఇది పీఎంఏవైతో ముడిపడి ఉన్నందున తమ అప్పీల్‌లో కేంద్రం ప్రతివాదిగా ఉండటం తప్పనిసరి అని తెలిపారు. ఈ సమయంలో ఏఎస్‌జీ హరినాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌లో ఇంప్లీడ్ అవుతామని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment