‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం అమలు కావాల్సిందే
స్వార్థ, నిగూఢ ప్రయోజనాల కోసం పథకాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు
సంక్షేమ రాజ్యంలో పేదలకు గృహ వసతి కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉంది
ఒకసారి పరిహారం చెల్లించి భూమి తీసుకున్న తర్వాత అది ప్రభుత్వానిదే
ఆ భూమిపై పరిహారం తీసుకున్న వారు యాజమాన్య హక్కులు కోరజాలరు.. ఆ భూమిని ప్రభుత్వం ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించవచ్చు
కర్నూలు జిల్లాలో ఎస్‌ఆర్‌బీసీ వద్ద 130.86 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరైనదే
హైకోర్టు జడ్జి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ 89 పేజీల తీర్పు
సాక్షి, అమరావతి: పేదలకు ఓ గూడు కల్పించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ సంక్షేమ పథకం అమలు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వార్థ, నిగూఢ ప్రయోజనాలు, ఇతర కారణాలతో ఈ పథకం అమలు కాకుండా నిరోధించడం, అడ్డుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సంక్షేమ రాజ్యంలో భాగంగా నిజమైన పేద లబ్ధిదారులను గుర్తించి గృహ వసతి కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
తద్వారా రాజ్యాంగం పేదలకు కల్పించిన హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది. ఒకసారి పరిహారం చెల్లించి భూమిని సేకరించిన తరువాత ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులుంటాయంది. పరిహారం అందుకున్న వారు ఆ భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులను, ప్రయోజనాలను కోరలేరని పేర్కొంది. పరిహారం చెల్లించి సేకరించిన భూమిని ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించవచ్చని హైకోర్టు తెలిపింది.
ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయమైనప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం భానుముక్కాల, బాతులూరుపాడు, యనకండ్ల, బనగానపల్లె గ్రామాల పరిధిలో 130.86 ఎకరాల భూమిని నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
భూ పంపిణీ విషయంలో అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్ అన్నీ సక్రమమేనని ప్రకటించింది. శ్రీశైలం కుడి కాలువ (ఎస్‌ఆర్‌బీసీ) రక్షణ నిమిత్తం మిగిలిన భూమికి ఫెన్సింగ్ వేసి అక్రమణల నుంచి, అక్రమ సాగు నుంచి పరిరక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలువ నిర్వహణ, భద్రత, మరమ్మతుల కోసం తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయదలచిన స్థలాల్లో నిర్మించే ఇళ్లను నిబంధనలకు అనుగుణంగా పటిష్టంగా నిర్మించాలని ఆదేశించింది. ఎస్‌ఆర్‌బీసీ కాలువ సమీపంలో ఉన్న భూములను నవరత్నాల కింద ఇళ్ల పట్టాల నిమిత్తం సేకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం 89 పేజీల కీలక తీర్పు వెలువరించారు.
ఆ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరికాదు..
కర్నూలు జిల్లాలో పలు సర్వే నెంబర్లలో 130.86 ఎకరాల భూమిని ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఎస్‌ఆర్‌బీసీ చుట్టు పక్కల ఇళ్ల నిర్మాణం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. నీటిపారుదల కోసం ఉద్దేశించిన భూముల్లో ఇళ్ల నిర్మాణం వల్ల భవిష్యత్తులో వరదలు సంభవిస్తే పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలువ భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూమిని నిరుపయోగంగా ఉందన్న కారణంతో తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు.
అన్యాక్రాంతం చేసేందుకే ఆ వ్యాజ్యాలు..
అయితే ఈ వాదనలను అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. పిటిషనర్లు సదరు భూములను ఆక్రమించుకుని అక్రమంగా సాగు చేస్తున్నారని, అందుకే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. కాలువ, బఫర్ జోన్‌లోని భూమి జోలికి వెళ్లలేదని తెలిపారు. 130 ఎకరాలను తీసుకోవడం వల్ల ఎస్‌ఆర్‌బీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పిటిషనర్లు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఆందోళనతోనే వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు.
ఆ భూములు నివాసయోగ్యమైనవేనని అధికారులు నివేదిక ఇచ్చిన తరువాతనే ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదించారు. ఆ భూములు జీవో 510 పరిధిలోకి రావని తెలిపారు. ఇప్పటికే ఆ భూముల్లో లేఔట్లు సిద్ధం చేశారని, అంతర్గత రోడ్లు కూడా వేశారని, హద్దు రాళ్లు నాటడం పూర్తయిందని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. కాలువకు ఇరువైపులా 30 మీటర్ల బఫర్ జోన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకే ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు.
ఎస్‌ఆర్‌బీసీ రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది...
‘ఏ ప్రయోజనం కోసం గతంలో భూములను తీసుకున్నారో అందుకోసం ఉపయోగించనందున అలాంటి భూములను వెనక్కి తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఎస్‌ఆర్‌బీసీ రక్షణకు ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంది. నిబంధనలు నిర్దేశించిన దూరాన్ని పాటించారు. ఎస్‌ఆర్‌బీసీ నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 800 నుంచి 1,000 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైంది.
అది కూడా ఆగస్టు – మార్చి నెలల మధ్యలోనే. మిగిలిన సమయంలో కాలువలో ఎలాంటి నీరు ఉండదు. మిగిలిన సమయంలో కాలువను తనిఖీ చేసి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టానికి తావు లేకుండా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాలు చేయలేదు. స్వార్థ, నిగూఢ ప్రయోజనాల కోసం, ఇతర ఏ కారణాలతోనూ సంక్షేమ పథకాలు అమలు కాకుండా నిరోధించడం, ఆటంకపరిచేందుకు వీల్లేదు’ అని జస్టిస్ కృష్ణమోహన్ తన 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment