గుంటూరు జిల్లా కంటెపూడిలోని వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తుది దశకు చేరిన ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి చెందిన తేనె గంగాధర్ కౌలు రైతు. ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు. ఇప్పటి దాకా వారికి సొంత ఇల్లు లేదు. వారు పుట్టినప్పటి నుంచి అద్దె ఇంట్లోనే పెరిగారు. వారి అమ్మానాన్నలు కూలి పనులు చేసి, ఇంటి అద్దెలు కట్టుకుంటూ వారిని పెంచి, పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. వివాహం అనంతరం ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా మూడు దశాబ్దాలుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. గంగాధర్‌కు ఇద్దరు పిల్లలు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో వారిని చదివించుకుంటూ ఇంటి అద్దె కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం సొంత ఇల్లు లేని వారికి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తోందని తెలిసి అతని భార్య తేనె మణి, అతని సోదరుడి భార్యతో దరఖాస్తు చేయించారు.
ఇద్దరికీ ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. లేఅవుట్–1లో ఇంటికి పునాది వేసుకున్నారు. వారి దశాబ్దాల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నందుకు చాలా సంతోష పడ్డారు. కొద్ది రోజుల్లో సొంతింట్లో ఉంటామనుకున్నారు. అయితే ఇళ్ల నిర్మాణ పనులన్నీ ఆపేయాలని కోర్టు చెప్పిందని శనివారం ఉదయం టీవీలో వార్తలు చూపినప్పుటి నుంచి గంగాధర్ చాలా దిగాలుగా ఉన్నాడు. ఎందుకలా దిగులుగా ఉన్నావని ఎవరైనా అడిగితే.. ‘ఇది సరికాదయ్యా.. ఇళ్ల నిర్మాణం ఆపడమేంటయ్యా.. ఇలా ఎప్పుడైనా జరిగిందా.. దుర్మార్గమయ్యా.. పేదల కడుపు కొట్టడం బాగోదయ్యా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఒక్క గంగాధర్ మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
బిడ్డలకు మేమిచ్చే ఆస్తి ఈ ఇల్లే
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల నిర్మాణం నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలోని పేద వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని 13.5 ఎకరాల లేఅవుట్–1లో 621 మంది పేదలకు ప్రభుత్వం ప్లాట్‌లు కేటాయించింది. చాలా వరకు ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి. ఈ లేఅవుట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు స్థలం రూ.4 లక్షల పై మాటే. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి, నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు ఇస్తుండటంతో పేదలందరు సంతోషంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అయితే వీరందరిలోనూ రెండు రోజులుగా తీవ్ర ఆందోళన కనిపిస్తోంది.
ఇక్కడి లబ్ధిదారురాలైన సారమ్మ, ఆమె భర్త దువ్వనపూడి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మేము వ్యవసాయ కూలీలం. ఇద్దరం పనికి వెళ్తే నెలకు రూ.15 వేలు సంపాదిస్తాం. ఇంటి అద్దె రూ.6వేలు. పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు వచ్చిందంతా సరిపోతుంది. ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఇల్లు మంజూరైంది. ఖర్చు తగ్గించుకోవడం కోసం మేము కూడా కూలీగా పని చేస్తూ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు ఆపేస్తే.. మా సంగతేం కావాలి?’ అని ప్రశ్నించారు. ‘నాకు ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తెకు పెళ్లి అయింది. త్వరగా ఇంటి నిర్మాణం పూర్తయితే రెండో కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఇల్లు కట్టుకోలేనని నిర్మాణం ప్రారంభించాను. నా తదనంతం ఈ ఇంటిని ఇద్దరు కుమార్తెలకు ఇచ్చేద్దామనుకున్నా. ఇదే మా పిల్లలకు ఇచ్చే ఆస్తి అనుకున్నా. కానీ ఇప్పుడిలా..’ అని ఇదే లేఅవుట్‌లోని లక్ష్మి వాపోయింది.
పేదోళ్ల జీవితాలతో ఆటలొద్దు
ఇప్పుడు మా ఇంటి నిర్మాణం శ్లాబు దశలో ఉంది. ఇప్పటికే చాలా మెటీరియల్ తెచ్చుకున్నా. ఎక్కడి పనులు అక్కడే నిలిపి వేయాలంటే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకుంటున్నా. ఇసుక, ఇటుక, సిమెంటు వచ్చాయి. మళ్లీ పనులు మొదలు పెట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు అనుమతి ఇస్తారా? ఇవ్వరా? పేదోళ్ల జీవితాలతో ఆటలాడటం బాగోదు. దయచేసి పనులు ఆగకుండా చూడాలి.
– ఉప్పలపాటి నాగలక్ష్మి, కొంకేపూడి, పెడన మండలం, కృష్ణా జిల్లా
సారోళ్లు ఇలా చేయడం మంచిది కాదు
నా భర్త నాగమల్లేశ్వర రావు కూలి పని చేస్తుంటాడు. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అద్దె కట్టలేక నా తల్లిదండ్రుల వద్ద రేకుల షెడ్డులో ఉంటున్నాం. అక్కడ 9 మందిమి చిన్న రేకుల షెడ్డులో నివసిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మాకు ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసింది. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో మాకంటూ ఓ సొంత చిరునామా ఏర్పడుతుందని అనుకుంటున్న సమయంలో నిర్మాణాలు ఆపినారని చెబుతున్నారు. సారోళ్లు ఇలా చేయడం మంచిది కాదు.
– కె.సునీత, కంటెపూడి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా
మాకు సెంటున్నరే చాలు
పదేళ్లుగా మేము ఇరుకుగా ఉండే చిన్న గదుల్లో నివాసం ఉంటున్నాం. వైఎస్ జగన్ మాకు సెంటున్నర స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో సొంత ఇల్లు కట్టుకునేందుకు పునాదులు వేసుకున్నాం. ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఈ దశలో ఇళ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోర్టు చెప్పడం సబబు కాదు. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగించింది.ఈ తీర్పు పట్ల చాలా విచారిస్తున్నాం. ఎక్కువ స్థలం కావాలని ఎవరం కోరలేదు. మాకు ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర చాలు.
– రెడ్డి వరలక్ష్మి, పెదపాడు, పశ్చిమగోదావరి జిల్లా
ఇది న్యాయం కాదయ్యా..
మేము కడప శివారులోని రామాంజనేయపురం వరద కాలనీలో ఉంటున్నాం. జగనన్న ప్రభుత్వం మాకు సెంట్రల్ జైలు వెనుక ఉన్న టిడ్కో–2 లే ఔట్‌లో ఇంటి స్థలం మంజూరు చేసింది. బేస్‌మట్టం నిర్మించుకొని, గోడలు కూడా పూర్తి చేసుకున్నాం. బేస్‌మట్టం బిల్లు కూడా వచ్చింది. ఇంత పని జరిగాక ఇంటి నిర్మాణం ఆపమని చెప్పడం న్యాయం కాదయ్యా. ఆలోచించి కోర్టు వారు ఈ నిర్ణయాన్ని మార్పు చేయాలి.
– జె.అమ్ములు, రామాంజనేయపురం, వైఎస్సార్ జిల్లా
నోటికాడి కూడు తీస్తున్నారు
ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్న నాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమా అని స్థలం వచ్చింది. భగత్‌సింగ్‌కాలనీ వద్ద జగనన్న స్థలం మంజూరు చేశారు. జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించవద్దంటూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో ఇళ్ల నిర్మాణం నిలిపేయాలని తీర్పు ఇచ్చిందని చెబుతున్నారు. రూ.లక్షలు విలువ చేసే స్థలాన్ని, ఇంటిని మాలాంటి పేదలకు ఇస్తే వారికి వచ్చే ఇబ్బంది ఏమిటో తెలియడం లేదు. పేదల నోటికాడ కూడు తీస్తున్నారు. ఇది భావ్యం కాదు.
– ఎస్‌కే ముంతాజ్‌బేగం, వెంకటేశ్వరపురం, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment