Krishna Mohan
-
జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాపై కౌంటర్లు వేయండి
సాక్షి, అమరావతి : శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు మరింత గడువునిచ్చింది. గతంలో కౌంటర్ల దాఖలుకు మూడు వారాల గడువునిచ్చిన హైకోర్టు, ఇప్పుడు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానస సభాపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. శాసన సభ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని శాసన సభ కార్యదర్శి తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు కోరారు. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని, ఆ వివరాలను కూడా కౌంటర్లో పొందుపరుస్తామని చెప్పారు. దీనికి జగన్ తరపు న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసిందని చెప్పారు.చిరునామా సరిగా లేదంటూ స్పీకర్ కార్యదర్శి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. పోస్టుమేన్ స్పీకర్ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లగలిగినప్పుడు చిరునామా సరిగా లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని, అది అనవసరమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కౌంటర్ల దాఖలుకు అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు మరో నాలుగు వారాల గడువునిస్తూ విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. -
కూల్చివేతలపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి : తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతల నిమిత్తం ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనలతో వైఎస్సార్ సీపీ, ఆ పార్టీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం అనుబంధ వ్యాజ్యాలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలంటూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులను నిర్ణయం వెలువరించేంత వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.కూల్చివేతలపై అధికారులను నియంత్రించాలంటూ పిటిషన్లు..అన్ని జిల్లాల్లోని తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతలకు పురపాలక శాఖాధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసులను, ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ, ఆ పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కూల్చివేతకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. అలాగే, కూల్చివే తలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అలాగే, గురువారం మరిన్ని వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, పి. వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్ఎన్ ప్రశాంత్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వీఆర్ రెడ్డి, వి. సురేందర్‌రెడ్డి, ఉగ్రనరసింహ, రాసినేని హరీష్, వివేకానంద విరూపాక్ష తదితరులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.డీమ్డ్ నిబంధన కింద నిర్మాణాలు చేపట్టాం..ఇక అనుమతుల కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులపై అధికారులు నిర్ణీత కాల వ్యవధిలోపు నిర్ణయం వెలువరించలేదని, దీంతో చట్టంలో ఉన్న విధంగా తమకు అనుమతి వచ్చినట్లుగానే భావించి (డీమ్డ్ నిబంధన) నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని ఒకవైపు కోర్టుకు చెబుతూ, మరోవైపు కూల్చివేతలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇందుకే జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల విషయంలో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. అడ్వొకేట్ కమిషన్‌ను నియమించి రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యాలయాలకు అనుమతులు తీసుకున్నాయో లేదో తేల్చాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేయలేదని, అందువల్ల కూల్చేస్తామంటూ కూడా నోటీసులు ఇచ్చారని, వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాలకే అగ్నిమాపక పరికరాల ఏర్పాటు నిబంధన వర్తిస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదు..అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. రాజకీయ పార్టీ అయినంత మాత్రాన ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదన్నారు. అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయాలను నిర్మించారని, అనుమతులు ఉంటే చూపాలన్నారు. తుది ఉత్తర్వులు జారీ చేయకముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవన్నారు. డీమ్డ్ నిబంధన సంగతి ఏంటి?ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. డీమ్డ్ నిబంధన సంగతి ఏమిటని ప్రశ్నించారు. డీమ్డ్ నిబంధన కింద అనుమతి వచ్చినట్లు భావించి నిర్మాణాలు చేసే ముందు ఆ విషయాన్ని నోటీసు ద్వారా సంబంధిత అధికారికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుత కేసులో వైఎస్సార్సీపీ అలాంటి నోటీసు ఇవ్వలేదని దమ్మాలపాటి తెలిపారు. ఈ దశలో సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. తాము నోటీసు ద్వారా తెలియజేశామన్నారు.తిరిగి దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ, షోకాజ్ నోటీసులకు ఇచ్చే వివరణను పరిగణనలోకి తీసుకుని తుది ఉత్తర్వులు జారీచేస్తామని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరంలేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిర్ణయం వెలువరించేంత వరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఉల్లంఘనలంటారు.. అవేంటో చెప్పరు..ఇన్నేళ్లుగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేస్తుంటే మౌనంగా ఉన్న పురపాలక శాఖాధికారులు ఒక్కసారిగా మేల్కొన్నారని వైఎస్సార్సీపీ న్యాయవాదులు తెలిపారు. ఈనెల 22న అన్నీ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులిచ్చారన్నారు. నిజానికి.. అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులు వారి వద్ద ఉన్నప్పటికీ, వాటి గురించి ప్రస్తావించకుండా నోటీసులిచ్చారని తెలిపారు. ఉల్లంఘనలు ఉన్నాయన్న అధికారులు అవి ఏ రకమైన ఉల్లంఘనలో చెప్పడంలేదన్నారు. అలాంటప్పుడు వారిచ్చిన నోటీసులకు తాము వివరణ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటున్నార అన్నారు. వాస్తవాలేంటో తేల్చకుండా భవనాలను కూల్చేస్తే తమకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. రేపు అధికారుల చర్యలు సరికాదని తేలితే, కూల్చివేసిన భవనాలు తిరిగి రావని తెలిపారు. కూల్చివేతల విషయంలో యథాతథస్థితి కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదని వారు వివరించారు. -
ఇళ్లు.. ఇవ్వాల్సిందే: హైకోర్టు
సాక్షి, అమరావతి: పేదలకు ఓ గూడు కల్పించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ సంక్షేమ పథకం అమలు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వార్థ, నిగూఢ ప్రయోజనాలు, ఇతర కారణాలతో ఈ పథకం అమలు కాకుండా నిరోధించడం, అడ్డుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సంక్షేమ రాజ్యంలో భాగంగా నిజమైన పేద లబ్ధిదారులను గుర్తించి గృహ వసతి కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. తద్వారా రాజ్యాంగం పేదలకు కల్పించిన హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది. ఒకసారి పరిహారం చెల్లించి భూమిని సేకరించిన తరువాత ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులుంటాయంది. పరిహారం అందుకున్న వారు ఆ భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులను, ప్రయోజనాలను కోరలేరని పేర్కొంది. పరిహారం చెల్లించి సేకరించిన భూమిని ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించవచ్చని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయమైనప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం భానుముక్కాల, బాతులూరుపాడు, యనకండ్ల, బనగానపల్లె గ్రామాల పరిధిలో 130.86 ఎకరాల భూమిని నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. భూ పంపిణీ విషయంలో అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్ అన్నీ సక్రమమేనని ప్రకటించింది. శ్రీశైలం కుడి కాలువ (ఎస్ఆర్బీసీ) రక్షణ నిమిత్తం మిగిలిన భూమికి ఫెన్సింగ్ వేసి అక్రమణల నుంచి, అక్రమ సాగు నుంచి పరిరక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలువ నిర్వహణ, భద్రత, మరమ్మతుల కోసం తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయదలచిన స్థలాల్లో నిర్మించే ఇళ్లను నిబంధనలకు అనుగుణంగా పటిష్టంగా నిర్మించాలని ఆదేశించింది. ఎస్ఆర్బీసీ కాలువ సమీపంలో ఉన్న భూములను నవరత్నాల కింద ఇళ్ల పట్టాల నిమిత్తం సేకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం 89 పేజీల కీలక తీర్పు వెలువరించారు. ఆ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరికాదు.. కర్నూలు జిల్లాలో పలు సర్వే నెంబర్లలో 130.86 ఎకరాల భూమిని ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్ఆర్బీసీ చుట్టు పక్కల ఇళ్ల నిర్మాణం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. నీటిపారుదల కోసం ఉద్దేశించిన భూముల్లో ఇళ్ల నిర్మాణం వల్ల భవిష్యత్తులో వరదలు సంభవిస్తే పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలువ భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూమిని నిరుపయోగంగా ఉందన్న కారణంతో తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు. అన్యాక్రాంతం చేసేందుకే ఆ వ్యాజ్యాలు.. అయితే ఈ వాదనలను అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. పిటిషనర్లు సదరు భూములను ఆక్రమించుకుని అక్రమంగా సాగు చేస్తున్నారని, అందుకే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. కాలువ, బఫర్ జోన్‌లోని భూమి జోలికి వెళ్లలేదని తెలిపారు. 130 ఎకరాలను తీసుకోవడం వల్ల ఎస్ఆర్బీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పిటిషనర్లు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఆందోళనతోనే వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. ఆ భూములు నివాసయోగ్యమైనవేనని అధికారులు నివేదిక ఇచ్చిన తరువాతనే ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదించారు. ఆ భూములు జీవో 510 పరిధిలోకి రావని తెలిపారు. ఇప్పటికే ఆ భూముల్లో లేఔట్లు సిద్ధం చేశారని, అంతర్గత రోడ్లు కూడా వేశారని, హద్దు రాళ్లు నాటడం పూర్తయిందని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. కాలువకు ఇరువైపులా 30 మీటర్ల బఫర్ జోన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకే ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. ఎస్ఆర్బీసీ రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది... ‘ఏ ప్రయోజనం కోసం గతంలో భూములను తీసుకున్నారో అందుకోసం ఉపయోగించనందున అలాంటి భూములను వెనక్కి తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఎస్ఆర్బీసీ రక్షణకు ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంది. నిబంధనలు నిర్దేశించిన దూరాన్ని పాటించారు. ఎస్ఆర్బీసీ నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 800 నుంచి 1,000 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైంది. అది కూడా ఆగస్టు – మార్చి నెలల మధ్యలోనే. మిగిలిన సమయంలో కాలువలో ఎలాంటి నీరు ఉండదు. మిగిలిన సమయంలో కాలువను తనిఖీ చేసి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టానికి తావు లేకుండా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాలు చేయలేదు. స్వార్థ, నిగూఢ ప్రయోజనాల కోసం, ఇతర ఏ కారణాలతోనూ సంక్షేమ పథకాలు అమలు కాకుండా నిరోధించడం, ఆటంకపరిచేందుకు వీల్లేదు’ అని జస్టిస్ కృష్ణమోహన్ తన 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. -
బ్యాలెట్ పద్దతిలోనే ‘మా’ ఎన్నికలు: ఎన్నికల అధికారి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్‌ను బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని తాజాగా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికల పోలింగ్‌పై ఆయన వివరణ ఇచ్చారు. ‘పేపర్ బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు జరపాలని మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపాలని ప్రకాశ్ రాజ్ కోరారు. వీరిద్దరి ప్రతి పాదనలను క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణం రాజు దృష్టికి తీసుకెళ్లాం. చదవండి: ‘మా’ ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ కూడా బ్యాలెట్ పోలింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ నిర్వహిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానిక ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే జరిగాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ విధానంలోనే నిర్వహించారు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చదవండి: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు -
‘మా’ ఎన్నికలు: అభ్యర్థుల తుది జాబితా వెల్లడి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. బరిలో దిగుతున్న అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు ముగిసిన రెండు రోజుల తర్వాత నిన్న(శుక్రవారం) నటుడు బండ్ల గణేశ్, నేడు సీవీఎల్ నరసింహారావులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న సంగతివ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ఖరారు చేశారు. తుది అభ్యర్థుల జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ తాజాగా విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబూ మోహన్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రాకాంత్ పోటీ చేస్తున్నారు. ఇక అసోసియేషన్‌లో రెండు వైస్ ప్రెసిండెంట్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బెనర్జీ, హేమలు, విష్ణు ప్యానల్ నుంచి మాదాల రవి, పృథ్వీ రాజ్ పోటీ పడుతున్నారు. జనరల్ సెక్రటరీకి పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు; కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు; రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు. కాగా అక్టోబర్ 10 ‘మా’ ఎన్నికలు జరగునున్న సంగతి తెలిసిందే. -
13న వైఎస్సార్ పురస్కారాల ప్రదానోత్సవం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 13న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జి.వి.డి.కృష్ణమోహన్ కృష్ణా జిల్లా అధికారులతో కలిసి సభ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. వేదిక, ప్రత్యేక ర్యాంపు, పురస్కార గ్రహీతలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు.. తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక.. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తారన్నారు. ఆరు కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో టూరిజం సీఈఓ విజయకృష్ణన్, కలెక్టర్ జె.నివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జేసీ కె.మోహన్‌కుమార్, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు
సాక్షి, నెల్లూరు : గ్రావెల్ అక్రమాలు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఈ కృష్ణమోహన్ తెలిపారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలపై కేసుపెట్టామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు. గ్రావెల్ తవ్వకాలు ఆపాలని ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాగుంట శ్రీనివాసులురెడ్డి లేఖ ఇచ్చినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. రిజర్వాయర్ కెపాసిటీ పెంచే ఉద్దేశంతోనే మట్టితవ్వకాలు అనుమతిస్తాం. భవిష్యత్తులో ఫొటో ఐడీతో పాటు పూర్తి వివరాలతో అనుమతిస్తాం’’ అని అన్నారు. -
సామాన్యుల్లో అసామాన్యులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులను 2021 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు (కమ్యునికేషన్స్), వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడీ కృష్ణమోహన్ మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఈ అవార్డులను ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు రంగాల్లో వివిధ సంస్థలు, వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ అవార్డులకు ఎంపిక చేశామని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు.. వివిధ శాఖాధికారులు, పలు సంస్థలు, పలువురు వ్యక్తుల భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. సుదీర్ఘ కసరత్తుతో ఎంపిక తెలుగు వారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని కృష్ణమోహన్ తెలిపారు. వైఎస్సార్, సీఎం జగన్‌లది పేదవాడికి మేలు చేయాలనే ఫిలాసిఫీ అన్నారు. తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు తగిన అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తు చేసిందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ కింద 50 అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, 62 అవార్డులను ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు 14 లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని అయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి(రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులను ఇస్తున్నారని తెలిపారు. 6 కేటగీరీల కింద మొత్తం 62 అవార్డులను ప్రదానం చేయనున్నారని చెప్పారు. సంస్థలు (అన్నింటికీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు) 1) ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ – కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 2) సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైఎస్సార్ జిల్లా 3) సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం, ప్రకాశం జిల్లా 4) శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – అనంతపురం జిల్లా 5) ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైఎస్సార్ జిల్లా 6) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – అనంతపురం 7) గౌతమి రీజినల్ లైబ్రరీ – రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా 8) మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ – మ్యూజిక్ – విజయనగరం రైతులు 1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్ టైమ్) – కడియం నర్సరీల వ్యవస్థాపకుడు 2) మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం 3) «ఎం.సి.రామకృష్ణారెడ్డి – అనంతపురం 4) కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 5) విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా 6) ఎం.బలరామిరెడ్డి – వైఎస్సార్ జిల్లా 7) ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు 8) సెగ్గె కొండల్రావు – విశాఖపట్నం 9) ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ – విశాఖపట్నం 10) వల్లూరు రవికుమార్ – కృష్ణా 11) శివ అభిరామరెడ్డి – నెల్లూరు కళాకారులు 1) పొందూరు వస్త్రాలు – ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం – శ్రీకాకుళం – లైఫ్ టైం 2) జానపద గేయం – దివంగత వంగపండు ప్రసాదరావు– విజయనగరం – లైఫ్ టైం 3) బొబ్బిలి వీణ – బొబ్బిలి వీణ కేంద్రం (అచ్చుత నారాయణ)– విజయనగరం – లైఫ్ టైం 4) రంగస్థలం – పొన్నాల రామసుబ్బారెడ్డి – నెల్లూరు – లైఫ్ టైం 5) సురభి నాటకం – (శ్రీ వినాయక నాట్య మండలి) – సురభి డ్రామా – వైఎస్సార్ జిల్లా – లైఫ్ టైం 6) లెదర్ పప్పెట్రీ – దాలవాయి చలపతి –అనంతపురం – లైఫ్ టైం 7) కూచిపూడి నాట్యం – సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం – కూచిపూడి, కృష్ణా జిల్లా – లైఫ్ టైం 8) «ధింసా నృత్యం– కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం – విశాఖపట్నం 9) సవర పెయింటింగ్స్ – సవర రాజు – శ్రీకాకుళం 10) వీధి నాటకం – మజ్జి శ్రీనివాసరావు – విశాఖపట్నం 11) డిజాస్టర్ మేనేజ్మెంట్ – ధర్మాడి సత్యం– తూర్పు గోదావరి 12) హరికథ– సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) – తూర్పు గోదావరి 13) బుర్రకథ– మిరియాల అప్పారావు – పశ్చిమ గోదావరి 14) కొండపల్లి బొమ్మలు – కూరెళ్ల వెంకటాచారి– కృష్ణా 15) డప్పు కళాకారుడు – గోచిపాత గాలేబు–కృష్ణా 16) వెంకటగిరి జమదానీ చీరలు – జి.రమణయ్య– నెల్లూరు 17) కలంకారీ పెయింటింగ్స్– శివప్రసాదరెడ్డి– కర్నూలు 18) ఉడ్ కార్వింగ్స్ – బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్జిజాన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ – చిత్తూరు 19) నాదస్వరం – డాక్టర్ వి.సత్యనారాయణ – చిత్తూరు 20) కేలిగ్రఫీ – పూసపాటి పరమేశ్వరరాజు – విజయనగరం రచయితలు (అందరికీ లైఫ్ టైం) 1) స్వర్గీయ కాళిపట్నం రామారావు (కారా మాస్టర్)– శ్రీకాకుళం 2) కత్తి పద్మారావు – అభ్యుదయ సాహిత్యం – గుంటూరు 3) రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి– సాహిత్యం – వైఎస్సార్ జిల్లా 4) బండి నారాయణస్వామి – సాహిత్యం– అనంతపురం 5) కేతు విశ్వనాథరెడ్డి – సాహిత్యం – వైఎస్సార్ జిల్లా 6) కొనకలూరి ఇనాక్ – సాహిత్యం, గుంటూరు 7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) – సాహిత్యం– గుంటూరు పాత్రికేయులు (అందరికీ లైఫ్ టైం) 1) పాలగుమ్మి సాయినాథ్ – చెన్నై 2) ఏబీకే ప్రసాద్ – కృష్ణా 3) దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 4) దివంగత షేక్ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు 5) దివంగత కె.అమర్నాథ్ – పశ్చిమ గోదావరి 6) సురేంద్ర – కార్టూనిస్ట్ – కడప 7) తెలకపల్లి రవి – కర్నూలు 8) ఇమామ్ – అనంతపురం కోవిడ్ వారియర్స్ 1) డాక్టర్ నీతిచంద్ర – ప్రొఫెసర్ పల్మనాలజీ – నెల్లూరు 2) డాక్టర్ కె.కృష్ణకిషోర్ – ప్రొఫెసర్ ఈఎన్టీ – కాకినాడ 3) లక్ష్మి – స్టాఫ్ నర్స్ – జీజీహెచ్, విజయవాడ 4) కె.జ్యోతిర్మయి – స్టాఫ్ నర్స్ – అనంతపురం 5) తురుబిల్లి తేజస్వి – స్టాఫ్ నర్స్ – విశాఖపట్నం 6) ఎం.యోబు – మేల్ నర్సింగ్ – నెల్లూరు 7) అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ – గుంటూరు 8) ఆర్తి హోమ్స్ – వైఎస్సార్ కడప -
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి
నెహ్రూనగర్ (గుంటూరు): ప్రతి పౌరుడు సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ పీస్ ఫౌండేషన్ గ్లోబల్ ఏపీ చాప్టర్ కార్యవర్గ ఎన్నిక శనివారం గుంటూరులోని బ్రాడీపేటలో జరిగింది. దీనికి హాజరైన జస్టిస్ మాట్లాడుతూ..పీస్ ఫౌండేషన్ ద్వారా జమ్మూ అండ్ కశ్మీర్‌లోని అనాథలకు, వృద్ధులకు, వితంతువులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వారి సేవలను ఏపీలో కూడా ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఏపీ చాప్టర్ బ్రాండ్ అంబాసిడర్ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ..జమ్మూ అండ్ కశ్మీర్, లడ్హాఖ్‌లు భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయని, అక్కడ చేస్తోన్న సేవలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
సెర్ప్ కార్యాలయమా..టీడీపీ ఆఫీసా..
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలన్నింటినీ పర్యవేక్షించే కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో కృష్ణమోహన్ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించి మరీ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇందుకోసం సెలవురోజుల్లోనూ సిబ్బందిని కార్యాలయానికి రప్పించి మరీ పనిచేయిస్తున్నారు. వారితో డ్వాక్రా మహిళా సంఘాలకు ఫోన్లు చేయిస్తూ వారిని అధికారపార్టీకి అనుకూలంగా ఓటేసేలా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో అధికారపార్టీకి తోడ్పడేలా పనిచేయాలంటూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తేవడమేగాక.. బెదిరింపులకు సైతం దిగుతున్నారు. అంతేగాక జిల్లాల్లో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు ఎక్కడికక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థులను కలవాలని, వారు చెప్పినట్టు చేయాలని బెదిరిస్తూ ఫోన్లు సైతం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ అభ్యర్థిని కలవాలని అక్కడి సిబ్బందిని బెదిరిస్తూ కృష్ణమోహన్ మాట్లాడిన ఆడియో టేపు బయటపడడం తెలిసిందే. సెర్ప్ సీఈవో అరాచకాలకు ఈ ఆడియో టేపు నిదర్శనంగా నిలుస్తోంది. శుక్రవారం సెలవురోజునా పనిచేసిన కార్యాలయం.. సాధారణంగా సెలవు రోజున ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. కానీ కృష్ణమోహన్ సీఈవోగా పనిచేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ(సెర్ప్) ప్రధాన కార్యాలయం మాత్రం శుక్రవారం సెలవు రోజునా పనిచేసింది. కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా కార్యాలయానికి పిలిపించుకున్నారు. జిల్లాలో ఉన్న సిబ్బందికి ఫోన్లు చేస్తూ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం బిజీబిజీగా మారింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 72 లక్షలమంది డ్వాక్రా మహిళలలో.. ఎక్కువ మందితో టీడీపీకి ఓటు వేయించాలన్న లక్ష్యంగా సెలవురోజు కార్యాలయం పనిచేయడం గమనార్హం. అంతేకాదు.. అధికారపార్టీకి అనుకూలంగా పనిచేయడానికి వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాకు ఇద్దరేసి ఉద్యోగులు, వారి కింద జిల్లా స్థాయిలో ముగ్గురు సిబ్బందితో కూడిన కమిటీలను సెర్ప్ సీఈవో ప్రత్యేకంగా నియమించారు. జిల్లా స్థాయిలోని ముగ్గురు సిబ్బందితో కూడిన కమిటీ పని ఏంటంటే.. ఎప్పటికప్పుడు తమ పరిధిలో మండల స్థాయిలో ఉండే ఏరియా కోర్డినేటర్లకు, గ్రామ స్థాయిలో ఉండే సంఘ మిత్రల(యానిమేటర్ల)కు ఫోన్లు చేస్తూ పర్యవేక్షించాలి. ఈ సందర్భంగా సంఘమిత్రలు తమ పరిధిలో ఉండే డ్వాక్రా మహిళలతో నిత్యం సంప్రదింపులు జరిపేలా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఆయా నియోజక వర్గాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంత డ్వాక్రా మహిళల తరలింపు వంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కార్యక్రమాలు ఈ ప్రక్రియలో యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎన్నికల వరకు ఇలా సెర్ప్ సిబ్బందిని అధికారపార్టీకోసం పని చేయించడానికి వీలుగా శనివారం ఉగాది పండుగ రోజున, అలాగే ఆదివారం రోజున కూడా రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయం, జిల్లా స్థాయి డీఆర్డీఏ, మండల స్థాయిలో ఎంసీసీ కార్యాలయాలు పనిచేయాలని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఎన్నికల పోలింగ్ జరిగేరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం. అయితే ఆ రోజు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు సీఈవో ఇప్పటికే దిశానిర్దేశం చేయడం గమనార్హం. దీన్నిబట్టి సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ అధికార తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తోడ్పడేందుకోసం ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోంది. టీడీపీ కోసం పనిచేసినందుకు ప్రతిఫలం.. ప్రస్తుతం సెర్ప్ సీఈవోగా పనిచేస్తున్న కృష్ణమోహన్ గతంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేశారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన సీఎం ఓఎస్డీగా నియమితులయ్యారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. డిప్యుటేషన్‌పై ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను 2016లో సెర్ప్ సీఈవోగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో సెర్ప్ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పనిచేశారు. అత్యంత కీలకమైన ఈ బాధ్యతల్లో ఐఏఎస్ లేదా కనీసం రిటైర్డు ఐఏఎస్ కూడా కాని వ్యక్తిని నియమించడమేంటని అందులో పనిచేసే ఉద్యోగ సంఘ నాయకులు విమర్శించినా సర్కారు పట్టించుకోలేదు. పూర్తిగా చంద్రబాబుకు స్వామిభక్తి పరాయణుడిగా వ్యవహరిస్తున్నందునే కృష్ణమోహన్‌ను ఈ పోస్టులో కొనసాగిస్తోంది. సొంత అజెండాతో సిబ్బందిని వేధిస్తున్నాడు కృష్ణమోహన్ వైఖరిపై సెర్ప్–వెలుగు ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో కృష్ణమోహన్ ఎన్నికల సమయంలో తన కిందిస్థాయి ఉద్యోగులను టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల దగ్గరకు వెళ్లి కలవాలంటూ ఫోన్ల ద్వారా బెదిరింపులకు దిగడంపై సెర్ప్– వెలుగు ఉద్యోగుల జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆయన తనకంటూ సొంత అజెండా పెట్టుకుని సెర్ప్– వెలుగు సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పెంచి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ జె.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నందిగామ ఏరియా కో–ఆర్డినేటర్ కిరణ్‌ను ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఈవో కృష్ణమోహన్ దుర్భాషలాడడాన్ని ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ శాఖ చేయనన్ని కార్యక్రమాలను సిబ్బంది చేత చేయిస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్న సీఈవో నిరంకుశ వైఖరిని గర్హిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండున్నరేళ్లలో సుమారు 48 మంది ఆయన పెడుతున్న మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక చిన్న వయస్సులోనే మరణించారని తెలిపారు. సిరబ్బంది చనిపోయారు అన్నప్పుడు కూడా కనీస మానవత్వం లేకుండా, సానుభూతి సైతం చూపకుండా అదంతా సాధారణం అన్నట్టుగా మాట్లాడడం ఈ సీఈవోకే చెల్లిందని విమర్శించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాల్సిన సీఈవో కుర్చీలో గతంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన నాన్–ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించిందని నాగరాజు ఆరోపించారు. వ్యక్తిగత కక్షలతో, సొంత ఎజెండాతో సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న సీఈవో కృష్ణమోహన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ అంశాలపై న్యాయపోరాటానికి కూడా తాము సిద్ధమేనన్నారు. -
‘నీ జన్మలో నిజం చెప్పడం తెలుసా నీకు?’
సాక్షి, అమరావతి: డ్వాక్రా మహిళా సంఘాల వ్యవహారాలు పర్యవేక్షించే సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అవతార మెత్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబుకు బాకా ఊదుతూ ఏరియా కో–ఆర్డినేటర్లపై అధికారపార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేగాక వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొన్ని మండలాలకు ఏరియా కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కు ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ తరఫున నందిగామ నుంచి పోటీచేస్తున్న తంగిరాల సౌమ్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందని, ఆమెను కలవాలంటూ కిరణ్‌కు హుకుం జారీ చేశారు. అంతేకాక కిరణ్‌ను వ్యక్తిగతంగా ఫోన్లో సీఈవో కృష్ణమోహన్ తీవ్రంగా దుర్భాషలాడారు. కావాలని చెప్పి నాలుగు మండలాల్లో చెక్‌లు వెళ్లకుండా పెంటచేశావు.. మహిళలకు చెక్‌లు అందలేదు.. అంటూ తిట్లదండకం వినిపించారు. ఈ మేరకు కిరణ్‌కు సీఈవో కృష్ణమోహన్ ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సంభాషణల వివరాలు ‘సాక్షి’కి చిక్కాయి. అందులో సీఈవో కృష్ణమోహన్ సంభాషణ ఇలా ఉంది.. ఎంత ధైర్యం నీకు.. ‘‘నీ జన్మలో నిజం చెప్పడం తెలుసా నీకు? నీకంటూ ఎవరికైనా విశ్వాసంగా ఉండటంగానీ, నిజం చెప్పడంగానీ ఎప్పుడైనా ఉందా? నీవు ఆసుపత్రికి వెళితే పలకరించి మీ వెనుక మేము ఉన్నామయ్యా అంటే... ఇంత విష మనస్తత్వం గల నీవు ఎలాగ మనిషివయ్యావో.. నాకు అర్థం కాలేదు. నీ పరిస్థితి అలాగ కాదంటే ఇంకా దరిద్రంగా ఉందని చెబుతోంది ఆవిడ.. అర్థమైందా బెటర్ యూ.. నీవు నీ హద్దులో ఉండు.. లేకపోతే నీవు పెద్ద నాయకుడివైనా నీవే ఇబ్బంది పడతావు.. నీ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడను.. ఎంత ధైర్యం నీకు. కావాలని చెప్పి నాలుగు మండలాల్లో చెక్‌లు వెళ్లకుండా పెంటచేశావు.. మహిళలకు చెక్‌లు అందలేదు.. ఆమె నీ మీద ఎందుకు ఫిర్యాదు చేసిందంటావు.. ఎందుకు పెట్టింది ఆవిడ? ఏమైనా చెడ్డ ఆవిడా? అగ్రకుల అహంకారంతో పెట్టిందా? మనిషి అన్న తరువాత కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా విశ్వాసం ఉండాలి కదా కిరణ్. రిటన్‌గా ఫిర్యాదు ఇచ్చిందయ్యా ఆవిడ. ఎందుకిచ్చింది.. అంతమందిలో నీ మీదే ఎందుకు ఇచ్చింది ఆవిడ? నీ స్టాఫ్ అందరికీ చెప్పిన మేసేజ్‌లు చూపిస్తున్నారు వారు.. వెళ్లి మాట్లాడు మరి. ఊళ్లోనే ఉంటావు కదా.. వెళ్లి మాట్లాడవచ్చు కదా. ఎందుకు పెట్టారని, నీవు ఇంత దుర్మార్గుడవని అందరూ చెప్పారు. పాత రోజుల్లో ప్రశాంతి చెప్పింది. గతంలో నీ అంతటి దుర్మార్గుడు లేడని చెప్పారు.. కానీ నీ నక్క జిత్తుల వినయాలు చూసి నేను మోసపోయాను. అయ్యోపాపం ఆపదలో ఉన్నావని చెప్పి.. చేయ్ ఎంతవరకు చేస్తావో. నీవు ఎలాగ ఉంటావో చూస్తా.. చెయ్యి నీ ప్రతాపం ఏమిటో? నీవు చూపించింది ఇదయ్యా.. మేం కూడా చూపిస్తాం. నిన్ను ఉంచుకుని తప్పు చేశాం మేము. కొద్దిగా కాకపోతే కొద్దిగా సెన్స్ ఉండాలి కనీసం.. వెళ్లు కలు.. కలవకపోయినా.. కలిసినా అక్కడ ఇంకో నక్కజిత్తులతో ఏదో చెబుతావు.. కేరెక్టర్ లేనప్పుడు ఎలాగైనా బతికేయవచ్చు.. నీ దగ్గరున్న స్టాఫ్‌ను పురిగొలిపి మహిళల్లో సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నావంట. ఎంత ధైర్యం నీకు.. నీ ఎజెండా ఏమిటి.. నీతో మాట్లాడం కూడా సమయం వృథా. సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేశావు ఎంత ధైర్యం నీకు. నీలాంటి వాడితో మాట్లాడటం వేస్ట్’’ అంటూ సీఈవో కృష్ణమోహన్ ఫోన్లో తిట్ల దండకం వినిపించారు. అయితే మీకు(సీఈవో) వచ్చిన సమాచారం తప్పని, ఆరు మండలాల్లో చెక్‌లు పంపిణీ చేశానంటూ ఏరియా కో–ఆర్డినేటర్ కిరణ్ పదేపదే వివరణ ఇచ్చినప్పటికీ సీఈవో పట్టించుకోలేదు. టీడీపీ ఆఫీసుగా సెర్ప్ కార్యాలయం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవురోజు కూడా సెర్ప్ కార్యాలయానికి వచ్చి డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో టీడీపీకి ఓట్లు వేయించడమే లక్ష్యంగా సీఈవో కృష్ణమోహన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యాలయంగా సెర్ప్ కార్యాలయాన్ని కృష్ణమోహన్ మార్చేశారని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని పర్యవేక్షించకూడదని ఎన్నికల నియమావళి చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా సీఈవో వ్యవహరించడం గమనార్హం. -
కార్పొరేట్‌కు దీటుగా ‘గురుకుల’ంలో విద్యాబోధన
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులతో విద్యాబోధన అందిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి హెచ్.కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన టేకులోడు బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.3.75 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 గురుకుల పాఠశాలలు మంజూరు కాగా ఆరింటిని మత్య్సకారుల పిల్లల కోసం కేటాయించినట్లు చెప్పారు. మరో మూడు రాయదుర్గం మండలం కోనేబావి, మడకశిర మండలం గుండుమల, గుడిబండకు మంజూరయ్యాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో తరుగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్, జయసింహ నాయుడు, శ్యాంభూపాల్‌రెడ్డి, లేపాక్షి, కొడిగెనహళ్లి ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ముస్లింల స్థితిగతులపై అధ్యయనం
ఆత్మకూరు(పరకాల) : రాష్ట్రంలోని ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుండగా.. కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ మంగళవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్‌లోని కాశీ(రాళ్లు కొట్టి జీవనం గడుపుకునే) పనిచేసే కుటుంబాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి కృష్ణమోహన్‌రావు కలుసుకున్నారు. కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయనే వివరాలు తెలుసుకునేందుకు పలువురి గృహాలకు వెళ్లి జీవనశైలి, ఆరోగ్య స్థితిగతులు, కుటుంబపోషణ, పిల్లల చదువుల పై ఆరా తీశారు. అలాగే కటాక్షపూర్ గుట్టల్లో పనిచేసే కార్మికులను కలిసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. తిండికీ కష్టమవుతోంది.. బీసీ కమిషన్ పర్యటన సందర్భంగా కాశీ కుటుంబాలకు చెందిన పలువురు కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ ముందు తమ గోడు వెల్ల బోసుకున్నారు. తినడానికి తిండి కష్టమవుతోందని, రాళ్ల పనితో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోయారు. తమకు శాశ్వత జీవనోపాధి కల్పించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ కుటుంబాల స్థితిగతులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడుతూ కాశీ కుటుంబాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు సొసైటీ ఏర్పడితే పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేందర్‌జీ, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, సీఐ శ్రీనివాస్, డాక్టర్ రేష్మ, సర్పంచ్ రజిత, ఎంపీటీసీ గోరీబీ, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సింహస్వామి, సహాయ అభివృద్ధి అధికారి రమేష్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన కోర్టు ఉద్యోగి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బెయిలీఫ్(న్యాయశాఖ ఫీల్డ్ అసిస్టెంట్)ని లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆర్బీఐకాలనీలో జీడీఎస్ శాస్త్రి నివాసముంటాడు. ఆయన 2009లో రామకృష్ణ అనే వ్యక్తికి తన ఇంట్లో పైపోర్షన్ అద్దెకు ఇచ్చాడు. అతడు ఎంతకీ ఇల్లు ఖాళీ చేయకపోవడంతో వారి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసును న్యాయవాది జె.వేణుధర్‌రెడ్డి ద్వారా కోర్టులో కేసు నడుస్తుంది. రెండు నెలల క్రితం ఇంటి యజమానికి అనుకూలంగా ఉన్నత కోర్టు తీర్పునిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆదేశించింది. ఆదేశాలను అమలుచేయాల్సిన రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిలీఫ్ అధికారి అయిన వై.వి.కృష్ణమోహన్...రూ.25 వేలు ఇస్తేనే కోర్టు ఉత్తర్వు కాపీలు ఇస్తానంటూ రెండు నెలల నుంచి తిప్పుకుంటున్నాడు. దీనిపై శాస్త్రి తన న్యాయవాది వేణుధర్రెడ్డికి సమాచారం అందించాడు. ఇద్దరు కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఇచ్చిన సూచనల మేరకు శాస్త్రి... కోర్టు ఉత్తర్వు ప్రతుల కోసం రూ.20వేలు ఇస్తానని కృష్ణమోహన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శుక్రవారం ఉదయం మోహన్‌నగర్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీ వద్దకు డబ్బులు తీసుకుని రావాల్సిందిగా కృష్ణమోహన్ చెప్పడంతో శాస్త్రి రూ. 20వేలు తీసుకుని వచ్చి డబ్బులు అందిస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం అల్కాపురిలో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఏసీబీ అధికారులు.. కోర్టు అనుమతితోనే ఈ మేరకు దాడులు చేసినట్లు సమాచారం. -
నమ్మక ద్రోహం
అనంతపురం క్రైం : బంధువుల కంటే స్నేహితులే మిన్న అంటారు పెద్దలు. ఆపదలో ఆదుకున్న అటువంటి స్నేహితులకే కుచ్చుటోపి పెట్టాడు మన టీడీపీ మాజీ కార్పొరేటర్ కృష్ణమోహన్. స్థానికులు, బాధితుల కథనం మేరకు... నగరంలోని రంగస్వామినగర్‌కు చెందిన బి.కృష్ణమోహన్ టీడీపీ నేత. గత కౌన్సెల్లో కార్పొరేటర్‌గా పని చేశాడు. చీటీలు, వడ్డీ వ్యాపారం చేస్తుండేవారు. ఈ క్రమంలో స్నేహం ముసుగులో నమ్మినవారి వద్ద అప్పులు చేశాడు. కూతురు వివాహం కోసమని అడిగితే తమ వద్దలేకపోయినా తెలిసిన వారి వద్ద లక్షలాది రూపాయలు తెచ్చి ఇచ్చారు స్నేహితులు. మరికొంతమంది ప్రైవేటుగా పని చేసుకుంటూ లక్షలాది రూపాయలు చీటీలు పాడి మరీ తెచ్చి ఇచ్చారు. సుమారు రూ. కోటి దాకా అప్పులు చేసినట్లు తెలిసింది. కూతురు వివాహ కార్యక్రమం ముగియగానే ఇస్తానని చెప్పడంతో కొందరు ఎలాంటి బాండ్లు రాయించుకోకుండా లక్షలు రూపాయలు ఇచ్చారంటే స్నేహితుడిపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కూతురు పెళ్లితంతు పూర్తవగానే కొద్ది రోజుల తర్వాత ఈరోజు రేపు అంటూ అప్పులిచ్చిన వారికి చెబుతూ వచ్చిన కృష్ణమోహన్ హైడ్రామాకు తెరతీశాడు. ఎవరికీ కనిపించ కుండా అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో తన భర్త కనిపించడంలేదంటూ కృష్ణమోహన్ భార్య త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యుల సహకారంతోనే కృష్ణమోహన్ అదృశ్యమయ్యాడంటూ బాధితులు ఆరోపించారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తాజాగా కృష్ణమోహన్ 37 మంది బాధితులకు న్యాయవాది ద్వారా ఐపీ నోటీసులు జారీ చేయించాడు. 37 మందికి రూ. 76, 63,000 అప్పులున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. పైగా తాను వేరుశనగ, బియ్యం వ్యాపారం చేస్తూ తీవ్రంగా నష్టపోయానని పేర్కొన్నాడు. కొందరు బాధితులకు చెక్కులు ఐపీనోటీసులు జారీ చేసిన 37 మందికి కాకుండా మరికొంతమందికి కృష్ణమోహన్ తన భార్య పేరుతో చెక్కులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వారికి మాత్రం ఈ ఐపీ నోటీసులు ఇవ్వలేదని సమాచారం. వారందరికీ అప్పులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వడ్డీ కోసమే ఇచ్చిన బాధితులకు వదిలిపెట్టి, స్నేహం కోసం అప్పులిచ్చిన బాధితులకు అధికశాతం ఐపీ నోటీసులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలా ఉండగా చాలామంది బాధితుల వద్ద కృష్ణమోహన్ రూ. 2,3 వడ్డీకి తీసుకుని రూ. 5,10 ప్రకారం అప్పులిచ్చేవాడని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. -
‘బల్క్’ వైపు ఆర్టీసీ అడుగు
కర్నూలు(రాజ్‌విహార్): ‘బల్క్ బయ్యర్’ పేరుతో ఇకపై డీజిల్ కొనుగోలు చేసేందుకు రోడ్డు రవాణ సంస్థ కసరత్తు చేస్తోంది. ఎక్కువ మొత్తంలో డీజిల్‌ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభిస్తుందని భావించిన అధికారులు అందుకు కార్యచరణ మొదలుపెట్టారు. లీటరుపై సాధారణ ధర కంటే 50 పైసలు మిగులుతుందని, దీంతో ఏటా రూ.1.63 కోట్లకుపైగా ఇంధన ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవచ్చని నివేదికలు సిద్ధం చేశారు. ఈనివేదికలను సోమవారం రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ ఉన్నతాధికారులకు పంపించారు. 2013 జనవరి వరకు బల్క్ బయ్యర్ పేరుతో ఎక్కువ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే సంస్థగా ఆర్టీసీ ఉండేది. కానీ అదే ఏడాది జనవరి 30న బల్క్ బయ్యర్ కొనుగోలుదారులపై లీటరుకు రూ.11.40ల చొప్పున పెంచింది. దీనికి తోడు మరో 40పైసల పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుంది. డీజిల్ బంకుల్లో చిల్లరగా కొనుగోలు చేసే వాటి ధర పెంచకుండా అధిక మొత్తంలో కొనుగోల చేసే సంస్థల (బల్క్ బయ్యర్)పైన మాత్రమే ఈ పెంచిన భారాన్ని అప్పట్లో వేశారు. దీంతో ఆర్టీసీ ఈ సమస్యలను అధిగమించేందుకు బల్క్ బయ్యర్‌కు బదులు చిల్లర కొనుగోలు సంస్థగా మారింది. అప్పటి నుంచి డీజిల్‌ను ఆయా డిపోలకు సమీపంలోని డీజిల్ బంకుల వద్ద నుంచే కొనుగోలు చేసుకోవాల్సిందిగా అప్పటి వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టరు ఏకే ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో స్థానిక డిపో మేనేజర్లు ఆచరణలో పెట్టారు. అప్పట్లో చిల్లరగా కొనుగోలు చేస్తే లీటరు డీజిల్ రూ.51.14లకే లభిస్తుండగా బల్క్ బయ్యర్ భారం రూ.11.40తో కలిపి లీటరు రూ.62.54 చొప్పున చెల్లించాల్సి వచ్చేది. దీంతో చిల్లర వ్యాపారిగా మారింది. గత యూపీఏ ప్రభుత్వం డీజిల్ ధరల పెరుగుదలపై నియంత్రణ ఎత్తివేయడంతో ప్రతి నెల 1న 50 పైసల చొప్పున పెంచుతూ పోవడంతో గతంలో పెంచిన బల్క్ బయ్యర్ ధరను మించిపోయింది. ప్రస్తుతం చిల్లర కోనుగోలుపై లీటరు డీజిల్ రూ.63.70కు లభిస్తుండగా బల్క్ సంస్థలకు రూ.63.20 పడుతోంది. దీంతో ఇప్పుడు తిరిగి చిల్లర కొనుగోలుదారు నుంచి బల్క్ సంస్థగా మారేందుకు సిద్ధం అవుతోంది. ఇలా చేయడంతో ఏడాదికి రూ.1.37కోట్లు ఇందన ఖర్చులు పొదుపు అవుతాయి. నివేదికలు పంపించాం: కృష్ణమోహన్, ఆర్ఎం, కర్నూలు ప్రస్తుతం చిల్లరగా కొనుగోలు చేస్తుండటంతో లీటరు డీజిల్ రూ.63.70కి లభిస్తోంది. బల్క్ బయ్యర్‌గా ఎక్కువ మొత్తంలో కొంటే లీటర్ రూ.63.20కే వస్తుంది. దీంతో లీటరుపై 50పైసలు మిగులుతుంది. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించాం. అనుమతులు వస్తే ఆచరణలో పెడతాం. -
బ్యాంకింగ్ లావాదేవీల్లో పెరిగిన ఫిర్యాదులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడచిన ఆర్థిక ఏడాదిలో బ్యాంకింగ్ సేవలపై అందిన ఫిర్యాదుల్లో 4 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి బ్యాంకింగ్ సేవలపై 4,477 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో అత్యధికంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలపైనే ఉన్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకింగ్ అంబూడ్స్‌మన్ ఎన్.కృష్ణ మోహన్ తెలిపారు. 2012-13ల్లో ఫిర్యాదుల సంఖ్య 4,303గా ఉంది. గతేడాది బ్యాంకింగ్ ఫిర్యాదుల వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో 28 శాతం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలపైనే ఉన్నాయని, ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఏటీఎం, క్రెడిట్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు పెంచినప్పటికీ ఇంకా ఖాతాదారుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, అలాగే బ్యాంకులు కూడా మరింత పటిష్టమైన టెక్నాలజీని వినియోగించాల్సి ఉందన్నారు. బ్యాంకుల వారిగా చూస్తే ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులపైనే అధిక ఫిర్యాదులు ఉన్నాయని, కాని గతేడాదితో పోలిస్తే ఎస్బీఐ గ్రూపు వాటా తగ్గడం గమనించాల్సిన అంశంగా కృష్ణ మోహన్ పేర్కొన్నారు. 2012-13 ఫిర్యాదుల్లో ఎస్బీఐ గ్రూపు వాటా 47 శాతంగా ఉంటే అది ఇప్పుడు 44 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఇతర జాతీయ బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదులు 24 శాతంగా ఉంటే ప్రైవేటు బ్యాంకులపై 18 శాతం ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరగడంతో ఫిర్యాదులను జిల్లాల వారీగా విభజించి లెక్కించడం జరిగిందని, ఈ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి 53 శాతం ఫిర్యాదులు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 47 శాతం వచ్చినట్లు కృష్ణ మోహన్ పేర్కొన్నారు. మెట్రోపాలిటన్, పట్టణాల్లో ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగితే, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పడే వరకు రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉమ్మడిగా సేవలను అందిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పడిన తర్వాత అక్కడ కొత్తగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంతో పాటు ప్రత్యేకంగా అంబూడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ రీజనల్ డెరైక్టర్ (ఏపీ, తెలంగాణ) కె.ఆర్.దాస్ తెలిపారు. బుధవారం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో అంబూడ్స్‌మన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
టీడీపీ, కాంగ్రెస్ బాహాబాహీ
గరివిడి, న్యూస్‌లైన్ : మండలంలోని కోనూరు గ్రామంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వర్గీయులు బుధవారం రాత్రి కొట్లాటకు దిగారు. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. కారం పొడి చల్లుకున్నారు. కొట్లాటలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. ఈ ఘటనలో 14 మంది గాయాలపాలయ్యారు. గరివిడి ఎస్సై కృష్ణమోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు బూడి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీకి చెందిన వెంపడాపు రమణమూర్తి వర్గాలు బుధవారం సాయంత్రం నుంచి ఎన్నికల స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాత్రి 7 గంటల సమయంలో గ్రామం మధ్యలో ఉన్న రామాలయం వద్దకు ఇరు వర్గాల వారూ చేరుకున్నారు. ఒకరికొకరు ఎదురుపడడంతో తొలుత మాటల యుద్ధానికి దిగారు. ఇది కాస్త పెద్దదై కొట్లాటకు దారి తీసింది. కర్రలతోనూ, కారం పొడులతోనూ దాడులకు దిగారు. ఈ దాడుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గడి రామునాయుడు, మీసాల రాములప్పుడు, జె.సన్యాసప్పడు, చింతపల్లి రమణ, మంత్రి అప్పలనాయుడు, ఎర్ర రాము, వెంపడాప నారాయణమూర్తి తదితర తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన బూడి శ్రీను, యడ్ల బంగారునాయుడు, యడ్ల తౌడు, ఎం.అక్కమ్మ, ఎం.నారాయణమ్మలకు గాయాలయ్యాయి. ఈ ఐదుగురితోపాటు, టీడీపీకి చెందిన మంత్రి అప్పలనాయుడు, వెంపడాపు నారాయణమూర్తిలను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి స్థానికులు తరలించారు. మిగిలిన వారు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవలకు కారకులైన 18 మందిని గుర్తించి పోలీసులు నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. -
ఏదీ.. ఆనాటి ఫైర్!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: అంతన్నాడింతన్నాడో గంగరాజు.. అన్నట్లుంది అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారుల తీరు. కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలన్న అత్యుత్సాహంతో ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ఆకాశానికి నిచ్చెన వేస్తూ విద్యార్థులను ఆకర్షించడం.. ఆనక చేతులు ముడుచుకొని కూర్చోవడం.. ఫలితంగా తక్కువ ఫీజులతో కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశం అందిపుచ్చుకోవచ్చని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఇప్పుడు నేలచూపులు చూడాల్సిన దుస్థితి. గత ఏడాది ప్రారంభించిన ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఆర్భాటంగా ప్రారంభం కొత్త కోర్సుల ఏర్పాటులో భాగంగా 2013 మార్చి 13న డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇండస్ట్రియల్ క్వాలిటీ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ పీజీ డిప్లమా కోర్సు ప్రారంభించారు. విశాఖపట్నానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేప్టీ మేనేజ్మెంట్ సంస్థకు శిక్షణ బాధ్యత అప్పగించారు. ఆర్జీబీ భగవత్‌కుమార్ ఇన్చార్జి వీసీగా ఉన్నప్పుడు.. గత ఏడాది జనవరి 9న సంయుక్తంగా కోర్సు నిర్వహణ, సర్టిఫికెట్ అందజేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం.. తదితర అం శాలపై ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకున్నారు. షేర్‌మహ్మద్ పురంలోని 21వ శతాబ్ది గురుకులంలో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం 60 మంది కోర్సు చేస్తున్నారు. ఈ నెలలో శిక్షణ పూర్తి అవుతుంది. వీరందరికీ ఒప్పందం ఉపాధి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో అసలు రంగు బయటపడుతోంది. ఎన్నో గొప్పలు కోర్సు ప్రారంభం సందర్భంగా ఎన్నో గొప్పలు చెప్పారు. అదంతా డొల్లేనని ఇప్పుడు అర్థమవుతోంది. తరగతి గదికే బోధనను పరిమితం చేయకుండా క్షేత్రస్థాయి పరిశీలన, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ సిలబస్ రూపొం దించామన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు- నివారణ చర్యలు, ప్రమాదాలను ఎదుర్కొనే విధానం, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థల్లో ప్రమాదాలకు అవకాశాలు-నివారణ చర్యలు, ప్రమాద నియంత్రణ చర్యలపై సంపూర్ణ పరిజ్ఞానం కల్పిస్తామన్నారు. వీటితో పాటు ఆంగ్ల పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను బోధిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తు తం 20 శాతం సంస్థల్లో మాత్రమే అగ్ని ప్రమా ద స్వీయ నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని, అందుకే ఈ కోర్సుకు డిమాండు పెరిగిందని. పీజీ డిప్లమా చేసిన వారికి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు, సూపర్ వైజర్లుగా బోల్డన్నీ ఉద్యోగాకావశాలు లభిస్తాయని ఎన్నో ఆశలు కల్పిస్తూ ప్రచారం చేశారు. అలాగే కోర్సు ఫీజు రూ.60 వేలని.. అయితే గ్రామీణ ప్రాంతమైనందున ఇక్కడ కోర్సులో చేరిన వారు రూ.30 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. తీరా కోర్సులో చేరాక మెస్ బిల్లు కాకుండా ఫీజు రూ.30 వేలతోపాటు పుస్తకాలకు రూ.2 వేలు, పరిశ్రమల్లో క్షేత్ర పరిశీలన(విశాఖకు తీసుకెళ్లారు) పేరుతో రూ.2 వేలు, హెల్మెట్, దస్తులకు మరో రూ.2 వేలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు రూ.600 చొప్పున అదనంగా వసూలు చేశారు. ప్రారంభంలోనే రూ.20 వేల జీతం వస్తుందని ఆశ పెట్టడంతో నమ్మేసిన విద్యార్థులు వారు అడిగినంతా చెల్లించారు. రూ.5 వేల జీతానికి వెళ్లమంటున్నారు. నిర్వాహకుల తీరుతో ఈ నెలలోనే శిక్షణ పూర్తి చేసుకుంటున్న 60 మంది పరిస్థితి అయోమయంగా తయారైంది. వీరిలో సంతోష్ కుమార్ అనే విద్యార్థి సొంతంగా భువనేశ్వర్‌లోని ఓ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరై రూ.20 వేల జీతానికి ఎంపికయ్యాడు. మిగతా 59 మందికీ శిక్షణ సంస్థే ఉపాధి అవకాశం కల్పించాలి. అయితే ఉపాధి పేరుతో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, ఉత్తరాంచల్ తదితర దూరప్రాంత రాష్ట్రాలకు.. అది కూడా రూ.5 వేల వేతనానికి వెళ్లాలని శిక్షణ సంస్థ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఇంత ఖర్చు చేసి పీజీ డిప్లమా చేసి.. అంత తక్కువ వేతనానికి ఎలా వెళతామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇవేమీ పట్టించుకోకుండా కొత్త బ్యాచ్ ప్రారంభిం చేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేం దుకు కొంతమంది విద్యార్థులు ప్రయత్నించగా నిర్వాహక సంస్థ ప్రతినిధులు వారిని బతిమాలి వెనుక్కు తీసుకెళ్లారు. అయితే ఎటువంటి ఉపాధి చూపిస్తారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. వర్సిటీ అధికారులు స్పందించి న్యాయం చేయక పోతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నా దృష్టికి రాలేదు ఈ విషయాన్ని వర్సిటీ రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ దృష్టికి ‘న్యూస్‌లైన్’ తీసుకువెళ్లగా విద్యార్థుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయినా రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఉన్నత కోర్సులు చేసిన వారికే ఉద్యోగాలు రావడం లేదు.. వేలల్లో ఖర్చు పెట్టి చేసిన కోర్సుకు ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయని ప్రశ్నించారు.కోర్సు చేసిన వారికి ఉపాధి కల్పిస్తామన్న ఒప్పందం గురించి ప్రస్తావించగా.. అదంతా ఇప్పుడు అనవసరం. ఉపాధి చూపాల్సిన పని లేదు.. పరీక్షలు పూర్తయ్యాక సర్టిఫికెట్ చేతిలో పెట్టి రిలీవ్ చేస్తే చాలని తేల్చేశారు. -
వర్సిటీ ప్రిన్సిపాల్ నియామకంపై నీలినీడలు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కారణాలేంటో గానీ అంతులేని జాప్యం జరుగుతోంది. దీనిపై వర్సిటీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ప్రిన్సిపాల్‌గా ఉన్న మిర్యాల చంద్రయ్యను గత నెల 23న రెక్టార్‌గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రిన్సిపాల్ నియామకం మాత్రం ఇంతవరకు చేపట్టలేదు. ఈ బాధ్యతలను కూడా చంద్రయ్యకే అప్పగించారు. వాస్తవానికి, సీనియర్ ప్రొఫెసర్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించాలి. కానీ వర్సిటీ అధికారులు సీనియారిటీని గౌరవించటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. 2008 జూన్ 25న యూనివర్సిటీ ఏర్పడ్డాక కీలకమైన పోస్టులను భర్తీ చేయకుండా అప్పటి వీసీ ఎస్వీ సుధాకర్, రిజిస్ట్రార్ జి.జ్ఞానమణి, అనంతరం ప్రస్తుత రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్‌లు అన్నీ తామై వ్యవహరించారు. తర్వాత ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ ఆర్జీబీ భగవత్‌కుమార్ మాత్రం విమర్శలకు తావులేకుండా 2012 మార్చిలో సీనియారిటీ ప్రాతిపదికన పోర్టు ఫోలియోలను కేటాయించారు. ప్రిన్సిపాల్‌గా చంద్రయ్య, సీడీసీ డీన్‌గా గుంట తులసీరావు, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్‌గా పెద్దకోట చిరంజీవులు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్‌గా బిడ్డిక అడ్డయ్యలను నియమించారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ మినహా మిగతా పోర్టుఫోలియోలను వీసీ తన విచక్షణ మేరకు కేటాయించవచ్చు. ప్రిన్సిపాల్‌గా మాత్రం సీనియర్నే నియమించాలి. అలా కాకుండా చంద్రయ్యకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించటాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు. రెక్టార్ పోస్టులో ఉన్న వ్యక్తికి అదనపు బాధ్యతలు ఇవ్వటం ఏమిటని అంటున్నారు. అయితే నిబంధనల్లో ఉన్న వెసులుబాటును వర్సిటీ అధికారులు ఉపయోగించుకుంటున్నారు. మూడేళ్లపాటు కొనసాగే రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమిస్తే సీనియర్‌కు అవకాశం ఇవ్వాలి, అదే ఇన్చార్జిగా నియమిస్తే ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఎవరికైనా ఇచ్చి ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు, అవసరమనుకుంటే మళ్లీ రెన్యువల్ చేయవచ్చు. వర్సిటీ అధికారులు ఇదే చేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. తప్పేం లేదు.. ఈ విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇన్చార్జి బాధ్యతలను ఏ ప్రొఫెసర్కైనా ఇవ్వవచ్చని చెప్పారు. పుర్తి స్థాయి నియామకం అయితే సీనియారిటీని గౌరవించాలన్నారు. ప్రస్తుతం సీనియర్లందరూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. వర్సిటీ పాలన సజావుగా సాగేందుకు ఇన్చార్జిలను నియమించటంలో తప్పులేదన్నారు. -
బీఆర్ఏయూలో ఇంజినీరింగ్ విభాగం
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది ఇంజినీరింగ్ విభాగాన్ని ప్రారంభించనున్నామని రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. విశాఖపట్నంలోని ఏయూలో మంగళవారం జరిగిన ఎంఎన్‌డీసీ (విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, అభివృద్ధి కమిటీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఆయన సీడీసీ డీన్ గుంట తులసీరావుతోకలిసి విలేకరులకు వివరించారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విధానం మేరకు బీఆర్ఏయూలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రారంభానికి అవకాశం లభించిందని చెప్పారు. ఇందుకోసం ఎస్ఎం పురంలోని 21వ శతాబ్ధి గురుకులాన్ని వ ర్సిటీకి అప్పగించే అంశాన్ని ఉన్నత విద్యామండలి పరిశీలిస్తుందన్నారు. రెగ్యులర్ బోధకులను నియమించగానే తొలుత సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈ, సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచిలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మిర్యాల చంద్రయ్యను రెక్టార్‌గా నియమించేందుకు ఎంఎన్‌డీసీ అనుమతి తీసుకున్నామని, ఆయనకు త్వరలో నియామక ఉత్తర్వులు అందజేస్తామని చెప్పారు. మహిళా వసతిగృహంపై రూ.18.60 లక్షల అంచనాతో మరో 11 గదుల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నామని తెలిపారు. 34 రెగ్యులర్ బోధకుల భర్తీకి సంబంధించి అవసరమైన వివరాలను గవర్నర్ నామినీకి ఇప్పటికే పంపామని, ప్రభుత్వం మం జూరు చేసిన మరో 15 పోస్టులకు కూడా రోస్టర్ పాయింట్లు, సబ్జెక్టుల వారీగా జాబితా అందజేసి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. డీపీడీ కోర్సు, దూర విద్యాకేంద్రాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని వెల్లడించారు. దూరవిద్య ద్వారా ఏయే కోర్సులు నిర్వహించలనేది త్వరలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. -
‘సేనానీ లేడు... సైన్యమూ లేదు’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘సేనానీ లేడు... సైన్యమూ లేదు’అన్నట్టుగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పరిస్థితి. అది కూడా పార్టీ అధికారంలో ఉండగా ఇంతటి దుస్థితికి దిగజారిపోవడం విస్మయపరిచే వాస్తవం. అధికార పార్టీ అంటేనే ఎక్కడలేని దర్పం... హోదా... సందడి కనిపిస్తుంది. ఇక అధికార పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడి వైభవం అంతా ఇంతా కాదు.. డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కూడా అయితే ఇక చెప్పేదేముందీ!... కానీ జిల్లా కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ కార్యాలయంవైపు కన్నెత్తి చూడటం లేదు. బోర్డు తిప్పేసిన కంపెనీలా తయారైన జిల్లా కాంగ్రెస్ . తాజా పరిస్థితి ఇలా ఉంది... ఆమంచి ఆమడదూరం ఆమంచి కృష్ణమోహన్ తాను డీసీసీ అధ్యక్షుడిననే విషయాన్నే మరచిపోయినట్టున్నారు. కొన్ని నెలలుగా ఆయన డీసీసీ కార్యాలయానికే రావడం లేదు. నిజం చెప్పాలంటే ఆరు నెలల క్రితం డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన కేవలం రెండుసార్లే కార్యాలయానికి వచ్చారు. మొదటి సారి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి... మరోసారి ఓ సమావేశానికి హాజరయ్యారు. అంతే!... ఆ తరువాత ఇంత వరకు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడనే లేదు. జూన్ నుంచి ఇంతవరకు ఆయన డీసీసీ కార్యాలయానికి రానే లేదు. జులైలో పంచాయతీ ఎన్నికల కోసం కూడా డీసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించ లేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకోవడానికి ఆమంచి ఇష్టపడ లేదు. పార్టీ ఓడిపోతే అందుకు మంత్రి మహీధర్‌రెడ్డిని బాధ్యుడిని చేయాలన్నది ఆయన ఉద్దేశం. చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే(జులై 30) రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోయింది. దాంతో డీసీసీ కార్యాలయానికి రావాలన్న ఉద్దేశాన్ని ఆమంచి పూర్తిగా పక్కనపెట్టేశారు. రాజీనామా ప్రహసనం రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేసినట్టు ఆమంచి ప్రకటించారు. కానీ ఆ రెండు రాజీనామాలు ఆమోదం పొందలేదు. దాంతో ఆమంచి ఎమ్మెల్యేగా ఎంచక్కా కొనసాగుతున్నారు. గన్‌మెన్‌తోపాటు ఎమ్మెల్యేగా అన్ని హోదాలు అనుభవిస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి వచ్చేసరికి మాత్రం ఆమంచి మాటమారుస్తున్నారు. తాను రాజీనామా చేశానని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన అసలు ఉద్దేశం వేరుగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ప్రత్యామ్నాయం’ కోసం అర్రులు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయే తరణంలో డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆమంచి ససేమిరా అంటున్నారు. మంత్రి మహీధర్ రెడ్డితో ఆయనకు తీవ్ర విభేదాలు ఎలాగూ ఉన్నాయి. కాబట్టి జిల్లా పార్టీ బాధ్యతలు మంత్రే స్వయంగానో తన అనుచరుల ద్వారానో చూసుకుంటారులే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పనైపోయిందని నిర్ధారించుకున్న ఆమంచి ప్రత్యామ్నాయ అవకాశాలపై కన్నేశారు. రానున్న ఎన్నికల్లో సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేస్తానని బీరాలు పలికిన ఆమంచి తరువాత ఆ ఊసే ఎత్తడం మానేశారు. మళ్లీ సీఎం కిరణ్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇతరత్రా అవకాశాల కోసం అర్రులు చాస్తూ విఫలయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలను పూర్తిగా గాలికొదిలేశారు. పార్టీ ఊసే ఎత్తని మంత్రి మంత్రి మహీధర్ రెడ్డి తీరు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన కూడా జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీ వ్యవహారాల బాధ్యత తీసుకోలేదు. సాధారణంగానే పార్టీ బాధ్యతలను పట్టించుకునే అలవాటులేని ఆయన... ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ పార్టీ ఊసే ఎత్తడం లేదు. దాంతో జిల్లా కాంగ్రెస్‌లో కాస్తో కూస్తో మిగిలిన కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద దిక్కులేకుండాపోయింది. కనీసం ఎన్నికల వరకైనా బండిని లాక్కురావాలన్న ధ్యాసే తమ నేతలకు లేకుండాపోయిందని విమర్శిస్తున్నారు. జిల్లాలో పార్టీని దాదాపుగా చాపచుట్టేసినట్టేనని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.