ఏసీబీకి చిక్కిన కోర్టు ఉద్యోగి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బెయిలీఫ్(న్యాయశాఖ ఫీల్డ్ అసిస్టెంట్)ని లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆర్‌బీఐకాలనీలో జీడీఎస్ శాస్త్రి నివాసముంటాడు. ఆయన 2009లో రామకృష్ణ అనే వ్యక్తికి తన ఇంట్లో పైపోర్షన్ అద్దెకు ఇచ్చాడు.
అతడు ఎంతకీ ఇల్లు ఖాళీ చేయకపోవడంతో వారి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసును న్యాయవాది జె.వేణుధర్‌రెడ్డి ద్వారా కోర్టులో కేసు నడుస్తుంది. రెండు నెలల క్రితం ఇంటి యజమానికి అనుకూలంగా ఉన్నత కోర్టు తీర్పునిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆదేశించింది. ఆదేశాలను అమలుచేయాల్సిన రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిలీఫ్ అధికారి అయిన వై.వి.కృష్ణమోహన్...రూ.25 వేలు ఇస్తేనే కోర్టు ఉత్తర్వు కాపీలు ఇస్తానంటూ రెండు నెలల నుంచి తిప్పుకుంటున్నాడు. దీనిపై శాస్త్రి తన న్యాయవాది వేణుధర్‌రెడ్డికి సమాచారం అందించాడు.
ఇద్దరు కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఇచ్చిన సూచనల మేరకు శాస్త్రి... కోర్టు ఉత్తర్వు ప్రతుల కోసం రూ.20వేలు ఇస్తానని కృష్ణమోహన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శుక్రవారం ఉదయం మోహన్‌నగర్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీ వద్దకు డబ్బులు తీసుకుని రావాల్సిందిగా కృష్ణమోహన్ చెప్పడంతో శాస్త్రి రూ. 20వేలు తీసుకుని వచ్చి డబ్బులు అందిస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం అల్కాపురిలో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఏసీబీ అధికారులు.. కోర్టు అనుమతితోనే ఈ మేరకు దాడులు చేసినట్లు సమాచారం.