Rangareddy District Court
-
పోలీస్ కస్టడీకి జానీ
హైదరాబాద్, సాక్షి: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. బుధవారం జానీ కస్టడీకి రంగారెడ్డి కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ తన నేరాన్ని అంగీకరించారు. అయితే కస్టడీలో జానీ అఘాయిత్యాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. అంతకు ముందు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబయిలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. యువతి ఫిర్యాదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన జానీని.. నాలుగు రోజుల తర్వాత గోవాలోని ఓ హోటల్లో తెలంగాణ ఓఎస్టీ అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌కు తరలించింది. ఆపై ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఎయిర్ ఇండియాకు జరిమానా
సాక్షి, రంగారెడ్డి జిల్లాకోర్టులు: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు శ్రీమతి చిట్టినేని లతా కుమారి నేతృత్వంలోని బెంచ్ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు రూ.10 వేలు జరిమానా విధించింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చిలకమర్తి గోపీకృష్ణ 2020 అక్టోబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా సదరు విమానయాన సంస్థ టికెట్‌ను రద్దు చేసింది. రద్దు చేసినందుకు టికెట్ ధర రూ. 71,437లను తిరిగి చెల్లించేందుకు అగీకరిస్తూ ఇందుకు సంబందించి ప్రక్రియ మొదలు పెట్టినట్టు మార్చి 2021లో సమాచారం అందించింది. ఆ తర్వాత సదరు సంస్థ వినియోగదారుడికి ఎటువంటి జవాబు ఇవ్వకపోగా, ఇది వరకే రీఫండ్ చేశామని చెప్పడంతో బాధితుడు గోపీకృష్ణ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ తర్వాత 20 రోజులకు రూ. 71,437/–ల టికెట్టు రుసుమును గోపీకృష్ణకు చెల్లించి ఫోరం ఎదుట వాదనలు వినిపించిన సంస్థకు చెల్లింపుల్లో జరిగిన జాప్యాన్ని పరిగణలోకి తీసుకున్న ఫోరం విమానయాన సంస్థ సేవల లోపం కారణంగానే జాప్యం జరిగిందని నిర్ధారిస్తూ సంస్థకు జరిమానాతో పాటు టికెట్ రుసుముపై ఐదు నెలలకు 6% వార్షిక వడ్డీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. చదవండి: (CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!) -
స్నేక్ గ్యాంగ్ కీచకులు దోషులే
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో ఎనిమిదిమందిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్ కేసులో న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో A9గా ఉన్న సాలం హమ్దీ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. నిందితులకు బుధవారం శిక్షలు ఖరారు కానున్నాయి. రెండేళ్ల క్రితం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 2014 జులై 31న స్నేక్‌గ్యాంగ్ సభ్యులు ఫాంహౌజ్‌లో చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై భారత శిక్షా స్మృతి 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్‌నగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ,బార్కాస్), మహ్మద్ పర్వెజ్(షాయిన్‌నగర్), సయ్యద్ అన్వర్(షాయిన్‌నగర్), ఖాజా అహ్మద్ (ఉస్మాన్‌నగర్), మహ్మద్ ఇబ్రాహీం (షాయిన్‌నగర్), అలీ బరాక్బ (షాయిన్‌నగర్), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు. -
ఏసీబీకి చిక్కిన కోర్టు ఉద్యోగి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బెయిలీఫ్(న్యాయశాఖ ఫీల్డ్ అసిస్టెంట్)ని లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆర్బీఐకాలనీలో జీడీఎస్ శాస్త్రి నివాసముంటాడు. ఆయన 2009లో రామకృష్ణ అనే వ్యక్తికి తన ఇంట్లో పైపోర్షన్ అద్దెకు ఇచ్చాడు. అతడు ఎంతకీ ఇల్లు ఖాళీ చేయకపోవడంతో వారి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసును న్యాయవాది జె.వేణుధర్‌రెడ్డి ద్వారా కోర్టులో కేసు నడుస్తుంది. రెండు నెలల క్రితం ఇంటి యజమానికి అనుకూలంగా ఉన్నత కోర్టు తీర్పునిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆదేశించింది. ఆదేశాలను అమలుచేయాల్సిన రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిలీఫ్ అధికారి అయిన వై.వి.కృష్ణమోహన్...రూ.25 వేలు ఇస్తేనే కోర్టు ఉత్తర్వు కాపీలు ఇస్తానంటూ రెండు నెలల నుంచి తిప్పుకుంటున్నాడు. దీనిపై శాస్త్రి తన న్యాయవాది వేణుధర్రెడ్డికి సమాచారం అందించాడు. ఇద్దరు కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఇచ్చిన సూచనల మేరకు శాస్త్రి... కోర్టు ఉత్తర్వు ప్రతుల కోసం రూ.20వేలు ఇస్తానని కృష్ణమోహన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శుక్రవారం ఉదయం మోహన్‌నగర్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కాలనీ వద్దకు డబ్బులు తీసుకుని రావాల్సిందిగా కృష్ణమోహన్ చెప్పడంతో శాస్త్రి రూ. 20వేలు తీసుకుని వచ్చి డబ్బులు అందిస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం అల్కాపురిలో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఏసీబీ అధికారులు.. కోర్టు అనుమతితోనే ఈ మేరకు దాడులు చేసినట్లు సమాచారం. -
రంగారెడ్డి జిల్లా కోర్టుకు భత్కల్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. విచారణలో భాగంగా భత్కల్ ను పటిష్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు. ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌తో పాటు మిగతా ఉగ్రవాదులను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా జైలు సమాచారం చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
కోర్టులో భత్కల్ హల్చల్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హల్చల్ సృష్టించాడు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడ్ని కోర్టులో హజరుపర్చారు. కోర్టు హాలులోకి ప్రవేశించిన వెంటనే ఒక్కసారిగా జేబులో నుంచి ఓ కాగితాన్ని తీసిన భత్కల్.. కోర్టు కిటికీ నుంచి దానిని బయటకు విసిరేశాడు. ఈ అనూహ్య చర్యకు బిత్తరపోయిన పోలీసులు ఒక్క ఉదుటన భత్కల్ను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కిటికీ నుంచి అతడు విసిరేసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే పారిపోతున్నానని ప్రచారం చేస్తున్నారని, ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని అనుమానం ఉదని భత్కల్ ఆ లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు భత్కల్ తల్లి రహీనా కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. -
ఐడీ కార్డు ఉంటేనే కోర్టులోకి అనుమతి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ముందు 144 సెక్షన్ అమలు అవుతోంది. ఐడీ కార్డులు ఉన్నవారినే కోర్టులోనికి అనుమతి ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయలంటూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లాయర్లపై దాడి చేశారు. దాంతో కోర్టు పరిసరాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు చార్మినార్ సిటీ సివిల్ కోర్టు వద్ద కూడా పోలీసులు మోహరించారు. మేజిస్ట్రేట్‌ను అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు భద్రతను పెంచారు. ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే కోర్టులోకి అనుమతించాలని సూచనలను పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా జంటనగరాల కమిషనరేట్ల పరిధిలో భద్రతను పెంచినట్లు సీపీ తెలిపారు. -
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత
-
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టులోకి న్యాయమూర్తులు వెళ్లకుండా తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు. కోర్టు గేటు మూసివేసి అక్కడ బైఠాయించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వారిపై లాయర్లు కోడిగుడ్లు విసిరారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ఎయిర్ ఇండియాకు ఫోరం మొట్టికాయ
రంగారెడ్డి జిల్లా కోర్టులు: సేవలో లోపం ఉందంటూ ఎయిర్ ఇండియా సంస్థకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేస్తూ ఫిర్యాదుదారుడికి లక్ష రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఆదేశిస్తూ గురువారం తీర్పు చెప్పింది. వివరాలు.. కూకట్పల్లి హెచ్ఎంటీ శాతవాహననగర్‌లో నివాసముండే విఠల్‌రావు 2012 జూలై 11న హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానంలో న్యూజెర్సీకి వెళ్లేందుకు రెండు టికెట్లను బుక్ చేసుకుని భార్యతో పాటు వెళ్లాడు. వారికి సంబంధించిన రెండు లగేజీలు న్యూజెర్సీ ఎయిర్‌పోర్టులో దిగగానే సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు అందజేయలేదు. ఆ లగేజీలో విలువైన పత్రాలతో పాటు మెడికల్‌కు సంబంధించిన పత్రాలు, మెడిసిన్స్, విలువైన వస్త్రాలు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులకు ఫిర్యాదు చేశారు. సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ఫిర్యాదుదారు విఠల్‌రావు ఎయిర్‌లైన్స్ సేవలో లోపం ఉందంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం అధ్యక్షులు గోపాలకృష్ణమూర్తి, మహిళా సభ్యురాలు ప్రశాంతిలు పైవిధంగా తీర్పు చెప్పారు.