హైదరాబాద్, సాక్షి: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. బుధవారం జానీ కస్టడీకి రంగారెడ్డి కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు.
లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ తన నేరాన్ని అంగీకరించారు. అయితే కస్టడీలో జానీ అఘాయిత్యాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. అంతకు ముందు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి.
‘‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబయిలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది.
యువతి ఫిర్యాదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన జానీని.. నాలుగు రోజుల తర్వాత గోవాలోని ఓ హోటల్‌లో తెలంగాణ ఓఎస్‌టీ అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌కు తరలించింది. ఆపై ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment