బాధితురాలిపై కొరియోగ్రాఫర్ జానీ అఘాయిత్యాలెన్నో
‘అల వైకుంఠపురం’తో ఇరువురికి పరిచయం
షూటింగ్‌ల పేరుతో వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం
బాధితురాలి తల్లికి కూడా ఈ విషయాలు చెప్పిన వైనం
రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బాధితురాలు (21) తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి పరారీలో ఉన్న జానీని గురువారం గోవాలోని గ్రాండ్ లియోనీ రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. దీంతో జానీ మాస్టర్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు న్యాయస్థానానికి సమరి్పంచిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలను పొందుపరిచారు.
చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ..
బాధితురాలికి చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే మక్కువ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు నృత్య శిక్షణ ఇప్పించారు. తర్వాత వివిధ ప్రాంతాలలో స్టేజ్ షోలు ఇస్తుండేది. ఈ క్ర మంలో 2017లో పదో తరగతి చదువుతున్న క్రమంలో బాధితురాలికి ఢీ–11 డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తల్లితో సహా కలసి తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ షోకు న్యాయనిర్ణేతగా నిందితుడు జానీ మాస్టరే వ్యవహరించా డు. అనంతరం బాధితు రాలు ఢీ–12లోనూ పా ల్గొంది కానీ మధ్యలోనే ఆమెను తొలగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జానీ మాస్టర్ బృందంలోని సభ్యురాలు దర్శిని బాధితురాలికి ఫో న్ చేసి మాస్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తావా? అని అడిగింది. దీంతో ఒప్పుకున్న బాధితురాలు 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌కు వచ్చింది.
అల వైకుంఠపురంతో కలిసి..
‘అల వైకుంఠపురం’సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో తొలిసారిగా జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అదే రోజు మాస్టర్ మేనేజర్ ఒకరు బాధితురాలికి ఫోన్ చేసి జానీ మాస్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్లు రాహుల్, మోయిన్‌లతో కలిసి 2020 జనవరి 10న ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ముంబైలోని ఓ హోటల్‌లో చెకిన్ అవుతున్న క్రమంలో జానీ తన ఆధార్ కార్డు, ఇతరత్రా డాక్యుమెంట్లను బాధితురాలికి ఇచ్చాడు. అదే రోజు రాత్రి 11–12 గంటల సమయంలో జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి ఉదయం తాను ఇచ్చిన ఆధార్, డాక్యుమెంట్లను తీసుకొని గదికి రావాలని ఆదేశించాడు.
డోర్ వెనకాల దాక్కొని..
అప్పటికే జానీ మాస్టర్ గది తలుపులు తెరిచి, వెనకాల దాక్కొని ఉన్నాడు. బాధితురాలు గది లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా తలుపులు మూసేసి, లాక్ వేసేశాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు తనను వదిలేయాలని ప్రాధేయపడుతూ తలుపులు తెరిచేందుకు ప్రయతి్నంచగా.. జానీ మాస్టర్ ఆమెను అడ్డుకొని, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేయడమే కాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు.
బాధితురాలి నిస్సహాయతను ఆసరా చేసుకున్న జానీ మాస్టర్ షూటింగ్‌ల పేరు చెప్పి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్ గదులు, వ్యానిటీ వ్యాన్‌లలో అత్యాచారానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ వేధింపులు, ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధితురాలు కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కానీ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా పని ఉంటే అవకాశం ఇప్పించాలని నిందితుడు జానీ మాస్టర్‌ను సంప్రదించింది. తన లైంగిక వాంఛను తీర్చనన్నందుకు షూటింగ్ సమయంలో అందరి ముందు బాధితురాలిని అవమానపరిచేవాడు.
మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..
మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.
ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment