హైకోర్టు ఉత్తర్వులు
ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉంటుంది
పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారు
పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇక్కడ వర్తించవన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా
రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు. ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కుఆయనకు ఉంటుంది. – హైకోర్టు న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ (ఏ11)కు హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య చేయాలన్న ఉద్దేశం, పదునైన ఆయుధాలతో దాడి చేయడానికి సంబంధించిన సెక్షన్లు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది. పోలీసులు అనుమతి ఇచి్చన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారని, ఆయన్ను రావొద్దని పోలీసులు చెప్పారనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది.
అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మరణం చోటుచేసుకున్నా, గరిష్టంగా ఐదేళ్లు శిక్ష పడే నేరంలో బెయిల్‌కు ఆయన అర్హు డని పేర్కొంది. పలు తీర్పులను ప్రస్తావి స్తూ.. 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలర్‌కు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమరి్పంచాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యా ప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు సూచించింది. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది.
భద్రత కల్పించని పోలీసులదే బాధ్యత: అల్లు అర్జున్ తరఫు న్యాయవాది
పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంతో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పిటిషన్ వేశాం. అది ఇంకా ధర్మాసనం ముందుకు రాకముందే అరెస్టు చేశారు. క్వాష్ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో నటుడు షారుక్‌ఖాన్‌కు గుజరాత్ హైకోర్టు ఊరటనిచి్చంది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దానిని సవరించింది. కిందికోర్టు రిమాండ్ విధించినా.. దాన్ని నిరాకరించే అధికారం హైకోర్టుకు ఉంటుంది (బండి సంజయ్ కేసును ప్రస్తావించారు).
రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. అందుకు ఆయన్ను బాధ్యున్ని చేయలేదు కదా. పుష్ప ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. హీరో, హీరోయిన్ వస్తారంటూ పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచి్చంది. అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉండగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి ఆయన బాధ్యుడెలా అవుతారు? ఇది ఉద్దేశపూర్వంగా లేదా కావాలని చేసింది కాదు. దురదృష్టవశాత్తు మహిళ మృతి చెందింది. 118 (1) బీఎన్‌ఎస్‌తో పాటు సెక్షన్ 105 ఈ కేసులో వర్తించదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో భద్రత కల్పించని పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. తొక్కిసలాటను ఆపే ప్రయత్నం వారు చేయలేదు. పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు. విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి..’అని కోరారు.
లంచ్‌మోషన్ అనుమతించవద్దు: పీపీ
ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదు. బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి. కోరగానే లంచ్‌మోషన్ ఇవ్వడం తప్పుడు సంకేతం ఇస్తుంది. లంచ్‌మోషన్ మధ్యాహ్నం వేయడాన్ని అనుమతించకూడదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా కోరలేదు. కనీసం పిటిషన్ చదువుకునే సమయం అయినా ఇవ్వకుండా వాదనలు వినిపించాలంటే ఎలా? విచారణ సోమవారానికి వాయిదా వేయాలి. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పారు. ఆయన్ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించాం..’అని తెలిపారు.
హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా?
‘లంచ్ మోషన్ విచారణకు అనుమతి ఇవ్వొద్దని తొలుత భావించా. సామాన్యులైతే ఇద్దామనుకున్నా. అయితే సినీ హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? అనే సందేహం వచి్చంది. అతని హోదా కారణంగా స్వేచ్ఛను కోల్పోవడం సరికాదని అనిపించింది. అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇదే హైకోర్టు పలువురికి బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్‌కు పంపిన తర్వాత బీజేపీ నేత బండి సంజయ్‌కి, అలాగే 489ఏ వ్యవహారంలో ఒక సామాన్యునికి ఊరట దక్కింది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం, తదితరులు దాఖలు చేసిన మరో పిటిషన్‌లో అరెస్టయిన మరో ఇద్దరిని (ఏ–1, ఏ–2) కూడా విడుదల చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. ఇతర పిటిషనర్లపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment