విచారణ అనంతరం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్
‘సంధ్య థియేటర్’ ఘటనపై అల్లు అర్జున్‌ను విచారించిన పోలీసులు
తండ్రి, మామ, న్యాయవాదితో కలసి హాజరైన అర్జున్
ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు
ఉదయం 11:13 గంటల నుంచి మధ్యాహ్నం 2:47 గంటల వరకు విచారించిన పోలీసులు
చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు
అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని, రావాలని ఆదేశం
తొక్కిసలాటకు కారకుడిగా పేర్కొంటూ అల్లు అర్జున్
బౌన్సర్ ఆంటోనీ అరెస్టు
నిందితుల జాబితాలో ఏ–18గా మైత్రి మూవీ మేకర్స్‌ను చేర్చిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్/ చిక్కడపల్లి: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం అల్లు అర్జున్‌ను విచారించారు. మూడున్నరగంటలపాటు 20కిపైగా ప్రశ్నలు అడిగారు. ప్రీమియర్‌షోకు వచ్చేందుకు పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా తెలియదా అనే అంశం నుంచి ర్యాలీగా రావడం, వెళ్లడం దాకా ఎప్పుడేం జరిగిందనేది గుర్తు చేస్తూ విచారించారు. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు రావాలని సూచించారు.
ఈ నెల 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప–2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసుల ఆదేశాల మేరకు అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
సుమారు మూడున్నర గంటల పాటు
తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్‌రెడ్డి, సినీ నిర్మాత బన్నీ వాసు, న్యాయవాది అశోక్‌రెడ్డిలతో కలిసి అల్లు అర్జున్ ఉదయం 11:03 గంటలకు చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అరవింద్, చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీవాసులను పోలీస్‌స్టేషన్ కింద రూమ్ వరకే అనుమతించారు. మొదటి అంతస్తులో అడ్వొకేట్ అశోక్‌రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ విచారించారు.
సంధ్య థియేటర్ ఘటన, తదినంతర పరిణామాలపై మధ్యాహ్నం 2:47 గంటల వరకు ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల విడుదల పోలీసులు చేసిన పది నిమిషాల వీడియోను ఆధారంగా చూపిస్తూ వివరాలను తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీశారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.
10 నిమిషాలకోసారి విరామమిస్తూ..
పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ప్రతి పది నిమిషాలకోసారి విరామం తీసుకున్నట్టు తెలిసింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో అల్లు అర్జున్ కేవలం ఒక్కసారి మాత్రమే టీ తీసుకున్నట్టు సమాచారం. చివరిగా అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని పోలీసులు అల్లు అర్జున్‌కు సూచించినట్టు తెలిసింది.
ఏ–18గా మైత్రి మూవీస్..
సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటివరకు మైత్రి మూవీస్ సంస్థపై ఎటువంటి కేసులు నమోదు చేయని పోలీసులు.. మంగళవారం అల్లు అర్జున్ విచారణ సమయంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలను ఏ–18 నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీ ఆరెస్టు..
సంధ్య థియేటర్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలవడానికి కారణం ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు 10వేలకుపైగా వీడియోలను విశ్లేషించారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనీ అని గుర్తించారు. పోలీసులను సైతం అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం, గేట్లను మూసివేయడం వంటివాటిని అతడే దగ్గరుండి పర్యవేక్షించినట్టు సీసీ కెమెరా ఫుటేజీలలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
తొక్కిసలాట కాదు... ఊపిరాడకనే..
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటతోనే రేవతి మరణించిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ఇప్పటివరకు భావిస్తున్నారు. తొక్కిసలాట అయితే వారి శరీరంలో ఎముకలు విరగడం గానీ, ఇతర అవయవాలు దెబ్బతినడం గానీ జరిగి ఉండేది. అయితే రేవతికి గానీ, శ్రీతేజ్‌కి గానీ ఎక్కడ కూడా గాయాలైన ఆనవాళ్లు లేవని వైద్యుల నివేదికలో వెల్లడైంది. థియేటర్ లోయర్ బాల్కనీలో పరిమితికి మించి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడం వల్లే వారికి ఊపిరి ఆడలేదని.. ఈ క్రమంలోనే రేవతి కన్నుమూసిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగిన పలు ప్రశ్నలివే..
సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను విచారించిన పోలీసులు నాటి ఘటనకు సంబంధించి ప్రశ్నల వర్షం గుప్పించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు అడిగిన ప్రశ్నలివే..
⇒ పుష్ప–2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్టు సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు అంగీకరించారు. ఈ విషయాన్ని నాగరాజు మీకు చెప్పారా? లేదా?
⇒ థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా, లేదా? అందినప్పటికీ మీరు ప్రీమియర్ షోకు వచ్చారా?
⇒ పోలీసుల అనుమతి లేకున్నా థియేటర్‌కు ఎందుకు వచ్చారు?
⇒ మీతో పాటు సినిమా చూసేందుకు ఎంత మంది వచ్చారు?
⇒ మీతోపాటు ఎంత మంది బౌన్సర్లు వచ్చారు? ఆ బౌన్సర్ల ఏజెన్సీకి అనుమతులు ఉన్నాయా?
⇒ మీరు థియేటర్‌కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందనే దానిని అంగీకరిస్తారా?
⇒ చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్‌లోకి వచ్చారు?
⇒ పోలీసుల విధులను మీరు ఎందుకు అడ్డుకున్నారు?
⇒ రేవతి చనిపోయిందనే విషయం మీకు థియేటర్ లోపల మేనేజర్ నాగరాజు చెప్పారా? లేదా?
⇒ రేవతి మృతి గురించి మరుసటి రోజు వరకు మీకు తెలియదని మీడియాతో ఎందుకు చెప్పారు?
⇒ చనిపోయిన రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా?
⇒ తొక్కిసలాట జరిగినా, ఒక వ్యక్తి మరణించినా కూడా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటికి రాలేదు?
సంధ్య థియేటర్ కేసులో నిందితుల వివరాలివీ...
ఏ–1: ఆగమాటి పెదరామిరెడ్డి, థియేటర్ యజమాని
ఏ–2: ఆగమాటి చిన్నరామిరెడ్డి, థియేటర్ యజమాని
ఏ–3: ఎం.సందీప్, భాగస్వామి
ఏ–4: సుమిత్, భాగస్వామి
ఏ–5: ఆగమాటి వినయ్, భాగస్వామి
ఏ–6: అశుతోష్‌రెడ్డి, భాగస్వామి
ఏ–7: రేణుకాదేవి, భాగస్వామి
ఏ–8: అరుణారెడ్డి, భాగస్వామి
ఏ–9: నాగరాజు, థియేటర్ మేనేజర్
ఏ–10: విజయ్ చందర్, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జి
ఏ–11: అల్లు అర్జున్, పుష్ప సినిమా హీరో
ఏ–12: సంతోష్, అల్లు అర్జున్ పీఏ
ఏ–13: శరత్ బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్
ఏ–14: రమేష్, సెక్యూరిటీ
ఏ–15: రాజు, సెక్యూరిటీ
ఏ–16: వినయ్‌కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్
ఏ–17: పర్వేజ్, బాడీగార్డ్
ఏ–18: మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు
Comments
Please login to add a commentAdd a comment