సాక్షి,హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడికి కారకులైన ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం(డిసెంబర్23) ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే.. వీరికి అప్పటికప్పుడే బెయిల్ మంజూరు అయ్యింది.
అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు.. ఒక్కొకరికి రూ.10వేల పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినవారిలో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఉన్నారు. నిందితులపై బీఎన్‌ఎస్ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. నిందితులు మీ పార్టీ వాళ్లంటే.. మీ పార్టీ వాళ్లంటూ కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌లు పరస్పర ఆరోపణలకు దిగాయి.
కాగా, సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందన సరిగా లేదని ఓయూ జేఏసీ పేరిట పలువురు ఆయన ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు వేయడంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: పుష్ప అభిమాని అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment