హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు పోక్సో యాక్ట్ కేసుతో పాటు ఆయన లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. జానీ పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.
జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పరారీలో లో ఉన్నాడు. అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
::రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది తెలిసిందే. మరోవైపు జానీ బాధితురాలు నిన్న స్టేట్ విమెన్ కమిషన్‌ను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసిన బాధితురాలు.. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఫిర్యాదును విచారణ స్వీకరించిన మహిళా కమిషన్.. జానీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే టైంలో బాధితురాలికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
ఇక.. లైంగిక దాడి కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల అండతో జానీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విమర్శలకు తలొగ్గి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయాడంటూ ప్రకటనలు ఇస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కొందరు.
ఈ అభియోగాల తర్వాత జానీ ఏ మీడియాతో మాట్లాడలేదు. మూడు రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. కొండపూర్‌లోని నివాసానికి తాళం వేసి ఉంది. తొలుత నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. ఆయన భార్య ఆచూకీ కూడా తెలియరావడం లేదు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీని ముమ్మరం చేశారు.
కేసులో రెండ్రోజులకే ట్విస్ట్
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులుగా వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు.
.. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
ఈమేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు. అయితే.. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో యాడ్ చేశారు.
ఇదీ చదవండి: జానీ వ్యవహారంపై పవన్ మౌనం
Comments
Please login to add a commentAdd a comment