పవన్‌.. గొంతు ఎందుకు పెగలడం లేదు? | KSR Comments On Pawan Kalyan Over Johny Master Incident | Sakshi
Sakshi News home page

పవన్‌.. గొంతు ఎందుకు పెగలడం లేదు?

Published Wed, Sep 18 2024 1:16 PM | Last Updated on Wed, Sep 18 2024 1:29 PM

KSR Comments On Pawan Kalyan Over Johny Master Incident

కాలం ఎప్పుడూ ఒక్క తీరున ఉండదంటారు పెద్దలు. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ చిన్న ఘటన జరిగినా దబాయిస్తూ.. గదమాయిస్తూ రంకెలు వేసిన పవన్‌ కళ్యాణ్‌ స్వరం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు మూగ పోయింది మరి!. కూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా ఆయన పెదవి అస్సలు విప్పడం లేదు.

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ విషయమే తీసుకుందాం. తోటి కొరియోగ్రాఫర్‌ను జానీ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. టాలీవుడ్‌ నటులు చాలా మంది దీనిపై స్పందించారు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం తనకేమీ పట్టనట్టుగానే ఉన్నాడు. రెండేళ్లుగా తనను జానీ వేధిస్తున్నాడని, అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆ జూనియర్‌ కొరియోగ్రాఫర్‌ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై నటి పూనమ్‌ కౌర్‌ కూడా ఆరోపణలను పునరుద్ఘాటించడం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. పవన్‌ కళ్యాణ్‌కు ఇష్టమైన వ్యక్తి కావడం గమనార్హం.

పూనమ్‌ కౌర్‌ గతంలో పవన్‌ కళ్యాణ్‌పై స్వయంగా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కానీ, రాజకీయ నేపథ్యం లేకపోవడం వల్లనో, సినీ పరిశ్రమలో తగినంత పలుకుబడి లేదనో తెలియదు కానీ ఆ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కొందరిపై అడప దడపా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పటికీ పెద్దలు కొందరు కల్పించుకుని ఏదోలా మేనేజ్‌ చేసి రక్షిస్తుంటారని పుకార్లు ఉన్నాయి.

తెలుగుదేశం ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడి బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం కూడా అలాంటిదే అనుకోవాలి. ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినా ఆయన జైలుకు వెళ్లకుండా పలుకుబడి కలిగిన వాళ్లు కాపాడినట్లు చర్చ ఇప్పటికీ నడుస్తూంటుంది. ‘ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి..’ అంటూ బహిరంగ వేదికపైనే వ్యాఖ్యానించినా మహిళా సంఘాలు పెద్దగా ఆక్షేపించింది లేదు. పైగా ఆయన అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ తిరుగుతుంటారు. పైగా హిందూపురం ప్రజలు ఆయనను మూడుసార్లు  శాసనసభకు ఎన్నుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మహిళల విషయంలో చులకన భావంతో వ్యాఖ్యలు చేసే, అనైతిక చర్యలకు పాల్పడే వారి విషయంలో తప్పు ఎవరిదంటే.. ప్రజలదనే చెప్పాలి. బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ వంటి వారిది కాదనే అనుకోవాలి.

ఈ ఘటనలన్నీ తెలుగు సినిమా రంగంలోని వికృత, వికారపు చేష్టలకు అద్దంపట్టేవే. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమపై వచ్చిన మత్తుమందు వాడకం ఆరోపణలు, రాజ్‌తరుణ్‌, అతడి సహజీవన భాగస్వామి మధ్య జరిగిన రచ్చ, ఆ తరువాత ప్రియురాలితో గొడవ వంటివి సినీ అభిమానులకు కనువిప్పు కావాలి. ఒక హత్య కేసులో కన్నడ సినీ హీరో దర్శన్‌ను ఇటీవలే పోలీసులు అరెస్ట్‌ చేయడం ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది. కేరళలో ‘హేమ కమిటీ’ నివేదిక సృష్టించిన కలకలం కూడా ఇంకా సద్దుమణగలేదు. మళయాల సినీ రంగంలో ప్రముఖ హీరోలు, నటులు మహిళా నటుల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో ఈ నివేదిక బట్టబయలు చేసింది. మోహన్‌ లాల్‌ వంటి ప్రసిద్ధ నటుడు ఈ నివేదిక నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ఇక, తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. గత ప్రభుత్వ హయాంలోనూ పలువురు ప్రముఖ నటులు మత్తుమందుల వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు. కానీ, వారు ఎలాగోలా మేనేజ్ చేసుకున్నారని చెబుతారు. సినిమాల్లో నీతులు చెప్పడం, హీరోయిజం ప్రదర్శించడం వేరు. వాస్తవ జీవితంలో వారు వ్యవహరించే శైలి వేరని అనేక మార్లు రుజువవుతున్నా కొంతమంది కులం పేరుతోనో, లేక ఇతరత్రా అభిమానం పేరుతో విపరీతంగా ఆరాధించడం బాధాకరం. సినిమాను వినోదంగా చూసి సరిపెట్టుకోలేని అభిమానుల బలహీనతను నటులు కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తద్వారా రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొంది కథలు చెబుతున్నారు. అలాంటి వారిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరు కూడా పలువురు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు.

పవన్‌ కళ్యాణ్‌ తన కళ్ల ముందే ఇంకో మహిళతో కాపురం చేశారని ఆయన రెండో భార్య రేణూ దేశాయ్‌ ఒక ఇంటర్వ్యూలో చెబితే.. అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. పవన్‌ చేసింది తప్పని మాత్రం అనలేకపోయారు. దానికి తోడు ఒక సామాజిక వర్గం పవన్‌ కళ్యాణ్‌ను అభిమానిస్తోందన్న బలహీనత నుంచి లబ్ధి పొందేందుకు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం మొత్తాన్ని వాడుకుని మరీ వ్యూహాలు పన్నాడు. ఎలాగైతేనేం.. వీళ్లిద్దరూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకైతే వచ్చారు. ఆ తరువాతి నుంచి ఏపీలో మహిళలపై ఎన్ని అత్యాచారాలు, దాష్టీకాలూ జరిగినా పవన్‌ కళ్యాణ్‌ నోరు పెగలడం లేదని విమర్శకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్‌ జానీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి జానీని దూరం పెట్టినట్లు ఒక ప్రకటనైతే వచ్చింది కానీ.. పవన్‌ కళ్యాణ్‌తో అతడికి ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిపే అంశాలు ప్రచారంలోకి రావడంతో పార్టీతోపాటు పవన్‌ పరువు కూడా పోయినట్లు అయ్యింది. 
పవన్ కల్యాణ్‌కు సంబంధించి జానీ ఒక ట్వీట్ చేస్తూ ‘మీ ప్రోత్సాహంతో మొదలై, మీ స్ఫూర్తితో కొనసాగుతున్న ప్రయాణమిది. అందరి ఆశీస్సులతోపాటు మీ అభినందనలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. పవన్ కల్యాణ్‌ అన్నా’ అని వ్యాఖ్యానించాడు. ఒక అవార్డు వచ్చిన సందర్భంగా సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు జానీ అని పవన్ కళ్యాణ్‌ మెచ్చుకోవడం విశేషం. అంతేకాకుండా తాను చేసిన పలు చిత్రాలకు జానీ పని చేశాడని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కూడా ఉన్నాడని గుర్తు చేసుకున్నారు.

అవార్డు  వచ్చినందుకు పొగిడితే తప్పులేదు కానీ, సామాజిక స్పృహ ఉందనడం, అసలు పని చేయని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఉన్నాడని చెప్పడం ద్వారా వారిద్దరి చిరకాల స్నేహ సంబంధాలు అందరికీ తెలిశాయి. జానీ ఇప్పుడు ఒక జూనియర్ డాన్సర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారన్న అభియోగానికి గురి కావడం సామాజిక స్పృహ ఎలా అవుతుందన్న ప్రశ్న వస్తోంది. పైగా పవన్ స్ఫూర్తితో ప్రయాణిస్తున్నానని జానీ అంతకు ముందు వ్యాఖ్యానించిన వైనం కూడా పవన్‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు అందరికీ తెలిసినవే.

ఇక, 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో సుగాలీ ప్రీతి అనే యువతి హత్య కేసును వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు పవన్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏపీలో వాలంటీర్లుగా పని చేస్తున్న సామాన్యులను అమ్మాయిల కిడ్నాపర్లుగా పోల్చి దారుణంగా అవమానించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయిల కిడ్నాప్ గురించి నోరెత్తితే ఒట్టు. అంతే కాదు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే కొంతమంది జనసేన వారు హింసా కాండకు దిగినా, మహిళలపై సైతం రాక్షసత్వంగా వ్యవహరించినా పవన్ కనీసం ఎప్పుడూ ఖండించలేదు. ముచ్చుమర్రి అనే గ్రామంలో ఒక బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ బాలికను హత్య చేసి కృష్ణానదిలో పారేసినా పోలీసులు ఆ భౌతికకాయం ఎక్కడుందో కనిపెట్ట లేకపోయారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి లోకేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో రెండు అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గత నాలుగు నెలల్లో మహిళలపై జరిగిన అకృత్యాల సంఖ్య ఎక్కువే. అయినా పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు సరైన రీతిలో స్పందించడం లేదు. కానీ.. పలువురిని మోసం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై నటి ఒకరిని అడ్డం పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కనీస నిబంధనలు పాటించకుండా సస్పెండ్ చేయడం బహుశా ఏపీలో మాత్రమే జరిగి ఉంటుంది.

గతంలో ఓటుకు నోటు కేసులోనో లేక స్కిల్ స్కామ్‌లోనో  తనను పట్టుకున్నారన్న కోపంతో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై  చంద్రబాబు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని అదే పార్టీకి చెందిన ఒక మహిళా నేత నేరుగా ఆరోపించినా ఆయన్ను అరెస్ట్‌ చేయకుండా సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఆ కేసును మేనేజ్ చేసే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై సైతం పవన్ కల్యాణ్ కనీసం ప్రశ్నించలేదు. వీటన్నిటి బట్టి అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్‌ ఎలా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చని, తన అభిమానులకు  ఆయన ఎలాంటి స్ఫూర్తిని అందిస్తున్నదని తెలుసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా కేవలం సినిమా నటులు అన్న పిచ్చి అభిమానంతో వారు ఎన్ని అరాచకాలు చేసినా, కొన్ని హేయమైన పనులకు పాల్పడినా వారిని తమ దేవుళ్ల మాదిరి చూసుకోవడం తప్పో కాదో అభిమానులే నిర్ణయించుకోవాలి.

కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్‌ జర్నలిస్ట్‌,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement