
శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి : శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు మరింత గడువునిచ్చింది. గతంలో కౌంటర్ల దాఖలుకు మూడు వారాల గడువునిచ్చిన హైకోర్టు, ఇప్పుడు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానస సభాపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. శాసన సభ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని శాసన సభ కార్యదర్శి తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు కోరారు. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని, ఆ వివరాలను కూడా కౌంటర్‌లో పొందుపరుస్తామని చెప్పారు. దీనికి జగన్ తరపు న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసిందని చెప్పారు.
చిరునామా సరిగా లేదంటూ స్పీకర్ కార్యదర్శి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. పోస్టుమేన్ స్పీకర్ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లగలిగినప్పుడు చిరునామా సరిగా లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని, అది అనవసరమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కౌంటర్ల దాఖలుకు అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు మరో నాలుగు వారాల గడువునిస్తూ విచారణను ఆ మేరకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment