సెర్ప్‌ కార్యాలయమా..టీడీపీ ఆఫీసా.. | SERP CEO Under Ruling party service | Sakshi
Sakshi News home page

సెర్ప్‌ కార్యాలయమా..టీడీపీ ఆఫీసా..

Published Sat, Apr 6 2019 4:44 AM | Last Updated on Sat, Apr 6 2019 4:44 AM

SERP CEO Under Ruling party service - Sakshi

సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలన్నింటినీ పర్యవేక్షించే కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో కృష్ణమోహన్‌ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించి మరీ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇందుకోసం సెలవురోజుల్లోనూ సిబ్బందిని కార్యాలయానికి రప్పించి మరీ పనిచేయిస్తున్నారు. వారితో డ్వాక్రా మహిళా సంఘాలకు ఫోన్లు చేయిస్తూ వారిని అధికారపార్టీకి అనుకూలంగా ఓటేసేలా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో అధికారపార్టీకి తోడ్పడేలా పనిచేయాలంటూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తేవడమేగాక.. బెదిరింపులకు సైతం దిగుతున్నారు. అంతేగాక జిల్లాల్లో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు ఎక్కడికక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థులను కలవాలని, వారు చెప్పినట్టు చేయాలని బెదిరిస్తూ ఫోన్లు సైతం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ అభ్యర్థిని కలవాలని అక్కడి సిబ్బందిని బెదిరిస్తూ కృష్ణమోహన్‌ మాట్లాడిన ఆడియో టేపు బయటపడడం తెలిసిందే. సెర్ప్‌ సీఈవో అరాచకాలకు ఈ ఆడియో టేపు నిదర్శనంగా నిలుస్తోంది. 

శుక్రవారం సెలవురోజునా పనిచేసిన కార్యాలయం..
సాధారణంగా సెలవు రోజున ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. కానీ కృష్ణమోహన్‌ సీఈవోగా పనిచేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ(సెర్ప్‌) ప్రధాన కార్యాలయం మాత్రం శుక్రవారం సెలవు రోజునా పనిచేసింది. కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా కార్యాలయానికి పిలిపించుకున్నారు. జిల్లాలో ఉన్న సిబ్బందికి ఫోన్లు చేస్తూ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం బిజీబిజీగా మారింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 72 లక్షలమంది డ్వాక్రా మహిళలలో.. ఎక్కువ మందితో టీడీపీకి ఓటు వేయించాలన్న లక్ష్యంగా సెలవురోజు కార్యాలయం పనిచేయడం గమనార్హం. అంతేకాదు.. అధికారపార్టీకి అనుకూలంగా పనిచేయడానికి వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాకు ఇద్దరేసి ఉద్యోగులు, వారి కింద జిల్లా స్థాయిలో ముగ్గురు సిబ్బందితో కూడిన కమిటీలను సెర్ప్‌ సీఈవో ప్రత్యేకంగా నియమించారు. జిల్లా స్థాయిలోని ముగ్గురు సిబ్బందితో కూడిన కమిటీ పని ఏంటంటే.. ఎప్పటికప్పుడు తమ పరిధిలో మండల స్థాయిలో ఉండే ఏరియా కోర్డినేటర్లకు, గ్రామ స్థాయిలో ఉండే సంఘ మిత్రల(యానిమేటర్ల)కు ఫోన్లు చేస్తూ పర్యవేక్షించాలి.

ఈ సందర్భంగా సంఘమిత్రలు తమ పరిధిలో ఉండే డ్వాక్రా మహిళలతో నిత్యం సంప్రదింపులు జరిపేలా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఆయా నియోజక వర్గాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంత డ్వాక్రా మహిళల తరలింపు వంటి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కార్యక్రమాలు ఈ ప్రక్రియలో యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎన్నికల వరకు ఇలా సెర్ప్‌ సిబ్బందిని అధికారపార్టీకోసం పని చేయించడానికి వీలుగా శనివారం ఉగాది పండుగ రోజున, అలాగే ఆదివారం రోజున కూడా రాష్ట్ర స్థాయిలో సెర్ప్‌ కార్యాలయం, జిల్లా స్థాయి డీఆర్‌డీఏ, మండల స్థాయిలో ఎంసీసీ కార్యాలయాలు పనిచేయాలని సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఎన్నికల పోలింగ్‌ జరిగేరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం. అయితే ఆ రోజు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు సీఈవో ఇప్పటికే దిశానిర్దేశం చేయడం గమనార్హం. దీన్నిబట్టి సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ అధికార తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తోడ్పడేందుకోసం ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోంది.

టీడీపీ కోసం పనిచేసినందుకు ప్రతిఫలం..
ప్రస్తుతం సెర్ప్‌ సీఈవోగా పనిచేస్తున్న కృష్ణమోహన్‌ గతంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేశారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన సీఎం ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. డిప్యుటేషన్‌పై ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను 2016లో సెర్ప్‌ సీఈవోగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో సెర్ప్‌ సీఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పనిచేశారు. అత్యంత కీలకమైన ఈ బాధ్యతల్లో ఐఏఎస్‌ లేదా కనీసం రిటైర్డు ఐఏఎస్‌ కూడా కాని వ్యక్తిని నియమించడమేంటని అందులో పనిచేసే ఉద్యోగ సంఘ నాయకులు విమర్శించినా సర్కారు పట్టించుకోలేదు. పూర్తిగా చంద్రబాబుకు స్వామిభక్తి పరాయణుడిగా వ్యవహరిస్తున్నందునే కృష్ణమోహన్‌ను ఈ పోస్టులో కొనసాగిస్తోంది. 

సొంత అజెండాతో సిబ్బందిని వేధిస్తున్నాడు
కృష్ణమోహన్‌ వైఖరిపై సెర్ప్‌–వెలుగు ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో కృష్ణమోహన్‌ ఎన్నికల సమయంలో తన కిందిస్థాయి ఉద్యోగులను టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల దగ్గరకు వెళ్లి కలవాలంటూ ఫోన్ల ద్వారా బెదిరింపులకు దిగడంపై సెర్ప్‌– వెలుగు ఉద్యోగుల జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా ఆయన తనకంటూ సొంత అజెండా పెట్టుకుని సెర్ప్‌– వెలుగు సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పెంచి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌ జె.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నందిగామ ఏరియా కో–ఆర్డినేటర్‌ కిరణ్‌ను ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఈవో కృష్ణమోహన్‌ దుర్భాషలాడడాన్ని ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ శాఖ చేయనన్ని కార్యక్రమాలను సిబ్బంది చేత చేయిస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్న సీఈవో నిరంకుశ వైఖరిని గర్హిస్తున్నామని పేర్కొన్నారు.

కృష్ణమోహన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండున్నరేళ్లలో సుమారు 48 మంది ఆయన పెడుతున్న మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక చిన్న వయస్సులోనే మరణించారని తెలిపారు.  సిరబ్బంది చనిపోయారు అన్నప్పుడు కూడా కనీస మానవత్వం లేకుండా, సానుభూతి సైతం చూపకుండా అదంతా సాధారణం అన్నట్టుగా మాట్లాడడం ఈ సీఈవోకే చెల్లిందని విమర్శించారు. ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉండాల్సిన సీఈవో కుర్చీలో గతంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన నాన్‌–ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించిందని నాగరాజు ఆరోపించారు. వ్యక్తిగత కక్షలతో, సొంత ఎజెండాతో సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న సీఈవో కృష్ణమోహన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ అంశాలపై న్యాయపోరాటానికి కూడా తాము సిద్ధమేనన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement