వైఎస్సార్‌సీపీకి ఓటేశారని గ్రామ బహిష్కరణ | Village expulsion to the people who vote for YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి ఓటేశారని గ్రామ బహిష్కరణ

Published Thu, Apr 25 2019 4:29 AM | Last Updated on Thu, Apr 25 2019 11:00 AM

Village expulsion to the people who vote for YSRCP - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న కరుణ (మధ్యలో)

చంద్రగిరి (చిత్తూరు జిల్లా):  సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. సీఎం చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించడంతో పాటు మహిళపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. చంద్రగిరి కోట గ్రామంలోని శశిధర్‌ ఆయన భార్య కరుణ నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కరుణతో పాటు మరో మహిళ స్వామి వారికి హారతి ఇవ్వడానికి హారతి పళ్లెం తీసుకెళ్లారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మునిచంద్ర, గిరి, వెంకట్రాయులు, రాజేంద్రతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు కరుణ హారతిని పక్కకు నెట్టేశారు. ‘‘మీరు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారు.. అందుకే మిమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించాం.. మీరు హారతి ఇవ్వకూడదు’’ అంటూ బెదిరింపులకు దిగారు. దీనిని ఆమె ఆక్షేపించి, నిలదీయడంతో కరుణతో పాటు మరికొందరు మహిళలను రాయలేని భాషలో దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరోసారి గ్రామంలో జరిగే కార్యక్రమాలకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని బాధితులు వాపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, బాధితులకు అండగా నిలిచారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మా ఓటు మేము వేసుకోకూడదా!...
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదని, అలాంటప్పుడు అభివృద్ధి పనిచేసే నాయకులను ఎంచుకోవడం కోసం మా ఓటును కూడా మేము వేసుకోకూడదా!? అని పలువురు మహిళలు ప్రశ్నించారు. కోట గ్రామంలోని టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు దారుణమని నిరసించారు.

కులాల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ నాయకులు
టీడీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లేశారనే నెపంతో గ్రామ బహిష్కరణ చేయడం దారుణమని ఖండించారు. అలా అయితే ఆదివారం సంతకు వచ్చే కోట గ్రామస్తులను వ్యాపారాలు చేయకుండా చంద్రగిరి వాసులుగా తాము అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. పోలీసులు కేసు నీరు గార్చకుండా గ్రామ బహిష్కరణకు పాల్పడి, దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement