పచ్చ కండువా తీసి వెళ్లాలంటూ గల్లాకు సూచిస్తున్న కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్పీ విజయరావు
సాక్షి, గుంటూరు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులోగల 244వ పోలింగ్ బూత్‌లో సోమవారం జరిగిన రీపోలింగ్‌లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గత నెల 11న ఇదే బూత్ వద్ద టీడీపీ నేతలు గొడవకు దిగడంతో పోలింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ కేంద్రంలో 1,396 మంది ఓటర్లు ఉండగా, 180 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కానీ, టీడీపీ నేతలు మాత్రం పోలింగ్ మొదలైనప్పటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద హల్‌చల్ చేశారు. పోలీసులు ఎంత వారించినా వినకుండా వారిపై సైతం దౌర్జన్యానికి తెగబడ్డారు.
పచ్చ కండువాతో పోలింగ్ బూత్‌కు ‘గల్లా’
కాగా, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పచ్చకండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారులు అడ్డుకున్నారు. కండువా తీసి వెళ్లాలంటూ వారు సూచించడంతో సహనం కోల్పోయిన గల్లా.. ‘డోన్ట్ టాక్’ అంటూ వారిపై ఊగిపోయారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావు సైతం కండువా తీయాలంటూ సూచించారు. కలెక్టర్ తన వద్ద ఉన్న తెల్ల కండువాను తీసి ఇవ్వబోయినా తీసుకోకుండా తాను పచ్చకండువాతోనే వెళ్తానంటూ ‘గల్లా’ మొండికేయడంతో ఆర్వో ఆదేశాలతో వెళ్లాలంటూ సూచించి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా, గల్లా జయదేవ్ అలాగే పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని తెలుసుకున్న జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తోట చంద్రశేఖర్ సైతం బయటకు వెళ్లి ఎర్ర కండువాలు వేసుకుని మరీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఈ తరహాలో వ్యవహరిస్తున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం మాత్రం సంయమనంతో పోలింగ్ సజావుగా జరిగేందుకు పోలీసులు, పోలింగ్ అధికారులకు సహకరించారు.
ఎస్సైపై చేయిచేసుకున్న టీడీపీ మహిళా నేత
ఇదిలా ఉంటే.. టీడీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు ఉదయం నుంచి పోలీసులు ఎంత వారిస్తున్నా వినకుండా పోలింగ్ జరిగే ప్రాంతంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సోమవారం సా.4 గంటల సమయంలో ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూలైనులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రైనీ ఎస్సై ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఎస్సై చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఎస్సై ధరించిన బాడీవార్న్ కెమెరా పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ పరిణామంతో అక్కడున్న ఓటర్లు, పోలీసు అధికారులు విస్తుపోయారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడితో ఆమెపై కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఓ పోలీసు ఉన్నతాధికారి అయితే ఆమె జోలికి ఎందుకు వెళ్లావంటూ ఎస్సైనే తిట్టడంపై అధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment