గెలిచే అవకాశం ఏమైనా ఉందా? | TDP candidates is in fear of defeat | Sakshi
Sakshi News home page

గెలిచే అవకాశం ఏమైనా ఉందా?

Published Tue, Apr 23 2019 4:26 AM | Last Updated on Tue, Apr 23 2019 4:26 AM

TDP candidates is in fear of defeat - Sakshi

సాక్షి, అమరావతి: ‘నీ పరిస్థితి ఏంటి.. గెలుస్తావా?.. రాష్ట్రంలో మన ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం ఉందంటావా? బయట అందరూ జగన్‌ ప్రభుత్వం వచ్చేస్తుందంటున్నారు?’ ఇదీ ఓ టీడీపీ అభ్యర్థి తన సహచర అభ్యర్థితో అన్న మాటలు. టీడీపీ అభ్యర్థులందరిలోనూ ఇదే ఆలోచన. గెలిచే అవకాశం ఉందా? లేదా? ఎన్ని సీట్లు వస్తాయి, ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్స్‌ ఉందా..? అంటూ అధికార పార్టీ అభ్యర్థులు చర్చలు సాగిస్తున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పోలింగ్‌ సరళిపై చర్చ కంటే.. విజయావకాశాలపై ఆందోళనే ఎక్కువగా వ్యక్తమైనట్లు సమాచారం.

చంద్రబాబు సహజ ధోరణిలో విసుగెత్తేలా ఉపన్యాసమిచ్చినా అభ్యర్థులు, సీనియర్‌ నేతల్లో మాత్రం ఎక్కడా గెలుపుపై భరోసా కనిపించలేదు. బలమైన నేతలుగా చెప్పుకునే వారు సైతం తమ నియోజకవర్గాల్లో తెలుస్తామో? లేదో? అనే రీతిలో మాట్లాడడం ఇతర నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కచ్చితంగా గెలుస్తారని టీడీపీ భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. తనకు చాలా గట్టి పోటీ ఉందని, మైనస్‌లో ఉన్నానని పలువురు మీడియా ప్రతినిధుల ఎదుటే చెప్పడం టీడీపీలో నెలకొన్న తాజా పరిస్థితికి అద్దం పట్టింది. 

అందరిలోనూ అనుమానమే 
ఈ సమావేశంలో అభ్యర్థులెవరూ తాము కచ్చితంగా గెలుస్తామని చెప్పే సాహసం చేయలేదని సమాచారం. పలువురు మంత్రులు సైతం గెలుపుపై స్పష్టత లేకుండా మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి వైఎస్సార్‌సీపీ నుంచి ఊహించని స్థాయిలో పోటీ వచ్చిందని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేత తనకు సన్నిహితంగా ఉండే అభ్యర్థుల వద్ద వాపోయినట్లు సమాచారం. సమీకరణలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయని, తమ వెంట ఉంటారనుకునే బీసీల్లోనూ ఈసారి మార్పు వచ్చిందని, ఓటింగ్‌ సరళి కూడా అంచనాకు అందలేదని సీనియర్‌ నాయకులు విశ్లేషించారు. ప్రధానంగా లోకేష్‌ పోటీ చేసిన మంగళగిరి పరిస్థితి గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. మంగళగిరిలో లోకేష్‌కు ఎదురుగాలి తప్పదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమైనట్లు తెలిసింది. పోలింగ్‌ సరళి, ఈవీఎంలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు, ముఖ్య నేతలు అడిగిన వాటిపైనా అభ్యర్థులు రకరకాలుగా సమాధానాలు చెప్పడంతో గందరగోళం నెలకొంది.

పసుపు కుంకుమ నిలబెడుతుందా? 
డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పసుపు కుంకుమపైనే ఆశలున్నాయని, పింఛన్ల పెంపుతో వృద్ధుల్లోనూ కృతజ్ఞత కనిపిస్తోందని ఈ రెండు అంశాలే ఎన్నికల్లో టీడీపీకి సానుకూలంగా ఉన్నాయనే విశ్లేషణ సమావేశంలో జరిగింది. అయితే పసుపు కుంకుమ పొందిన మహిళలంతా టీడీపీకి ఓటేశారనే గ్యారంటీ లేదని, వారిలో వైఎస్సార్‌సీపీకి బలమైన మద్దతుదారులు సగం మంది ఉంటారు కాబట్టి అదొక్కటే గెలిపించలేదని సీనియర్లు అభిప్రాయపడినట్లు తెలిసింది.

సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం అధికారం దక్కించుకోవడంపై అనుమానంగా మాట్లాడడంతో అభ్యర్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. అయితే ప్రతిపక్షం గెలుస్తుందనే ప్రచారం చూసి భయపడవద్దని, తన లెక్కలు తనకున్నాయని చంద్రబాబు అభ్యర్థుల్లో కొంత ధైర్యం నింపే ప్రయత్నం చేసినా అభ్యర్థుల్లో భయంపోలేదని తెలిసింది. ఈవీఎంలలో లోపాలున్నాయని ఎలా చూపాలి, కౌంటింగ్‌ తర్వాత వాటి గురించి ఎలా చెప్పాలి.. తదితర అంశాలపై జరిగిన విశ్లేషణలు ఓటమికి చూపే సాకులుగా ఉన్నట్లు అభ్యర్థులే చర్చించుకున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ జరిగిన సమావేశంలో.. ప్రజలను ఆకర్షించలేకపోయామనే బాధ, ఓటమి భయం తప్ప గెలుపు ఉత్సాహం టీడీపీ నేతల్లో కనిపించలేదు. 

నా ప్లానింగ్‌ వల్లే మహిళల ఓట్లు: చంద్రబాబు 
ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో సరిగా పనిచేయలేదని, తప్పులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజావేదికలో పార్టీ అభ్యర్థులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొందరు అభ్యర్థులు అంతా తమకే తెలుసన్నట్లు వ్యవహరించారని, దీనివల్ల ఇబ్బందులు వచ్చాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు తాను జోక్యం చేసుకుని చాలా నియోజకవర్గాల్లో ఏం చేయాలో చెప్పాల్సి వచ్చిందని చెప్పారు.

తన ప్లానింగ్‌ వల్ల మహిళల ఓట్లు ఎక్కువగా పడ్డాయని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ప్రచారానికి భయపడాల్సిన అవసరం లేదని, తమకు గెలుపు అవకాశాలున్నాయని చెప్పారు. జూన్‌ ఎనిమిదో తేదీ వరకూ తమ ప్రభుత్వానికి సమయం ఉందని అప్పటి వరకూ చురుగ్గా పనిచేయాలని అభ్యర్థులకు సూచించారు. పార్టీ నేతలెవరూ కూడా వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉండొద్దని ఆదేశించారు. తనను క్యాంప్‌ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దంటున్నారని, ప్రధాని మోదీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటున్నారని విమర్శించారు. తన ప్రచారం వల్ల కర్ణాటకలో ప్లస్‌ అవుతుందని అక్కడి నేతలు చెబుతున్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీకి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌కు సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిసింది. 

మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశంలో తొలుత ఈవీఎంలపై చర్చించారు. రాత్రి 8 గంటల నుంచి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో సమావేశమై పోలింగ్‌ సరళి, బూత్‌ల వారీగా వచ్చే అవకాశం ఉన్న ఓట్లు, పోలింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు విశ్లేషణ జరిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement