గరివిడి, న్యూస్‌లైన్ : మండలంలోని కోనూరు గ్రామంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వర్గీయులు బుధవారం రాత్రి కొట్లాటకు దిగారు. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. కారం పొడి చల్లుకున్నారు. కొట్లాటలో మహిళలు కూడా భాగస్వాములయ్యారు. ఈ ఘటనలో 14 మంది గాయాలపాలయ్యారు.
గరివిడి ఎస్సై కృష్ణమోహన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు బూడి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీకి చెందిన వెంపడాపు రమణమూర్తి వర్గాలు బుధవారం సాయంత్రం నుంచి ఎన్నికల స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
రాత్రి 7 గంటల సమయంలో గ్రామం మధ్యలో ఉన్న రామాలయం వద్దకు ఇరు వర్గాల వారూ చేరుకున్నారు. ఒకరికొకరు ఎదురుపడడంతో తొలుత మాటల యుద్ధానికి దిగారు. ఇది కాస్త పెద్దదై కొట్లాటకు దారి తీసింది. కర్రలతోనూ, కారం పొడులతోనూ దాడులకు దిగారు.
ఈ దాడుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గడి రామునాయుడు, మీసాల రాములప్పుడు, జె.సన్యాసప్పడు, చింతపల్లి రమణ, మంత్రి అప్పలనాయుడు, ఎర్ర రాము, వెంపడాప నారాయణమూర్తి తదితర తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన బూడి శ్రీను, యడ్ల బంగారునాయుడు, యడ్ల తౌడు, ఎం.అక్కమ్మ, ఎం.నారాయణమ్మలకు గాయాలయ్యాయి.
ఈ ఐదుగురితోపాటు, టీడీపీకి చెందిన మంత్రి అప్పలనాయుడు, వెంపడాపు నారాయణమూర్తిలను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి స్థానికులు తరలించారు. మిగిలిన వారు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవలకు కారకులైన 18 మందిని గుర్తించి పోలీసులు నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు.
టీడీపీ, కాంగ్రెస్ బాహాబాహీ
Published Fri, Apr 11 2014 4:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement