కాంగ్రెస్, టీడీపీ దోస్తీ
ఎంపీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల హంగ్
- ఎంపీపీ స్థానాల కోసం ఎత్తుకు పైఎత్తులు
- చిరకాల ప్రత్యర్థులతోనూ చెలిమి
- డోన్, బండిఆత్మకూరులో బొమ్మాబొరుసుతో నిర్ణయం
- ఓర్వకల్లులో అధ్యక్ష ఎంపిక వాయిదా
- మరో ఏడు స్థానాల కోసం పోటాపోటీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. మండల పరిషత్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారిపోతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆలింగనం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు.
జిల్లాలో ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తొమ్మిది స్థానాల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోవడంతో హంగ్ నెలకొంది. వీటిని ఎలాగైనా తమ ఖాతాలో జమ చేసుకోవాలనే తలంపుతో ఆ రెండు పార్టీలు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. కొందరు స్వతంత్రులతో మంతనాలు నెరుపుతుండగా.. మరికొందరు శుత్రువులతో సైతం చేతులు కలుపుతున్నారు. గతంలో ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే ఎంపీపీ ఎంపిక పూర్తయ్యేది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీపీల ఎంపికకు సమయం ఉండటంతో.. రాజకీయ పార్టీలు శిబిరాల ఏర్పాటు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరిని రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఏమి కావాలో అడిగి తెలుసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో 53 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 23 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 21 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 9 స్థానాల్లో అధిక్యత కోసం పోటాపోటీ నెలకొంది.
వెల్దుర్తిలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో 6 వైఎస్సార్‌సీపీ, 5 టీడీపీ, మరో 6 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ మద్దతు కోరుతున్నట్లు సమాచారం.
కల్లూరులో 3 వైఎస్‌ఆర్‌సీపీ, 8 టీడీపీ, 6 స్వతంత్రులు, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. ఎంపీపీ కోసం టీడీపీ పట్టుబడుతోంది. మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతోంది.
కోడుమూరులో వైఎస్సార్‌సీపీ 8, కాంగ్రెస్ 7, టీడీపీ 2, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ఎంపీపీ పదవిని ఇతరులకు కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
- డోన్‌లోవైఎస్సార్‌సీపీ 9, టీడీపీ 9 స్థానాలను దక్కించుకోగా.. రెండు పార్టీల నేతల్లో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఎంపీపీ పదవి ‘అదృష్టం’పై ఆధారపడి ఉంది.
- పాణ్యం మండల పరిషత్‌లో టీడీపీ బొక్క బోర్లా పడింది. ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయ్యింది. అయితే టీడీపీ తరఫున ఎస్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీడీపీకి 8 ఎంపీటీసీ స్థానాలు వచ్చినా ప్రయోజనం లేకపోతోంది. ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోనుంది.
- బండిఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ, టీడీపీకి చెరి ఏడు స్థానాలు దక్కాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి.
- గూడూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, కాంగ్రెస్ 3, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
- ఓర్వకల్లులో వైఎస్సార్‌సీపీ 8, టీడీపీ 3, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలుపొందారు. కన్నమడకల స్థానం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తిక్కలి వెంకటస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో అధ్యక్ష ఎంపిక వాయిదా పడనుంది.
- సి.బెళగల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 6, టీడీపీకి 7, కాంగ్రెస్‌కు 3 ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీకే ఎంపీపీ పదవి దక్కనున్నట్లు సమాచారం.