పోరు బిడ్డకే పట్టం
-
తెలంగాణ పగ్గాలు కేసీఆర్‌కే
-
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం
-
63 అసెంబ్లీ, 11 పార్లమెంట్ సీట్లు కైవసం
-
సంబరాల్లో మునిగిన పార్టీ శ్రేణులు
-
మట్టికరిచిన కాంగ్రెస్ మహామహులు
-
20 స్థానాలకే పరిమితమైన అధికార పార్టీ
-
టీడీపీ-బీజేపీ కూటమికి 20 సీట్లు
-
ఎంఐఎం 7, వైఎస్సార్‌సీపీ 3 చోట్ల విజయం..
-
బీఎస్పీకి 2 స్థానాలు, సీపీఐ, సీపీఎంకు చెరొక సీటు
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే మా ధ్యేయం. ఒక్కమాట పొల్లుబోకుండా మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేస్తాం. ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. విద్యార్థులపై పెట్టిన
కేసులన్నింటినీ ఎత్తివేస్తాం.- కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్‌ఎస్ దెబ్బకు కాంగ్రెస్ మహామహులంతా మట్టికరిచారు. బంగారు తెలంగాణ తమ వల్లే సాధ్యమంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఎన్నికల సందర్భంగా సుడిగాలి పర్యటనలతో విస్తృత ప్రచారం చేసి పార్టీని విజయ తీరానికి చేర్చారు. తెలంగాణ రాష్ర్టంలో తొలి ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. మరోవైపు పార్టీని ఏకతాటిపై నడిపించే నాయకుడు లేక అధికార కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. తెలంగాణ సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమై ఎన్నికల్లో బొక్కబోర్లాపడింది.
కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోలేకవడం, పార్టీ ముఖ్యులంతా సొంత నియోజకవర్గాలకే పరిమితంకావడంతో కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. తెలంగాణలో ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లను టీఆర్‌ఎస్ సాధించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 63 సీట్లు రాగా, కాంగ్రెస్ మాత్రం 20 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక టీడీపీకి 15, బీజేపీకి 5, ఎంఐఎంకు 7, వైఎస్సార్‌సీపీకి 3, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి. సీపీఎం, సీపీఐలు చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాగా, 17 పార్లమెంట్ స్థానాలకుగాను టీఆర్‌ఎస్ 11 సీట్లను గెలుచుకుంది.
ఇక కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం కాగా.. బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానంలో నెగ్గాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు ఆది నుంచీ ఆసక్తి కలిగించాయి. తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవచ్చునని, హంగ్ ఏర్పడుతుందని పరిశీలకులు భావించినా ఆ పార్టీ అంచనాలను మించి ఫలితాలు సాధించడం విశేషం. శుక్రవారం ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచే మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యతను కనబరిచింది.
సెంటిమెంట్ బలానికి తోడు కేసీఆర్ వ్యూహాలు ఫలించడంతో పార్టీ అభ్యర్థుల్లో చాలా మంది భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇటీవలే ప్రాదేశిక ఎన్నికల్లో సాధించిన విజయాలను పునరావృతం చేస్తూ ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్ పూర్తి పట్టును ప్రదర్శించింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లలో దాదాపు ఏకపక్ష విజయాలను సాధించింది. ఇక మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలోనూ ఆ పార్టీ అనూహ్య విజయాలు నమోదు చేసింది. ఏ దశలోనూ కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. 24 అసెంబ్లీ స్థానాలున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
గత ఎన్నికల్లో 23 స్థానాల ను కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. వీహెచ్, దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ వంటి ముఖ్య నేతలు కూడా చతికిల పడ్డారు. ఇతర జిల్లాల్లో పోటి పడిన అగ్ర నేతలు, పార్టీ సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకున్న వారు కూడా ఓటమి పాలయ్యారు. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడే జనగాంలో పరాజయం పొందారు. అసలు ప్రచార పర్వం నుంచి పోలింగ్ రోజు వరకు ఆ పార్టీ ఏ దశలోనూ విజయం సాధిస్తామనే ధీమాను కనబరచలేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పట్టింది.