హైదరాబాద్: మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహా ధర్నా రూపంలో మహా డ్రామా చేస్తున్నారని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డిలు విమర్శించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణమైన కాంగ్రెస్ నేతలు ఇప్పడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో శంకర్ పల్లి, నేదునూరు ప్రాజెక్టులకు కేటాయింపులో ఇవ్వడంలో విఫలమైయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తెలంగాణలో విద్యుత్ ఉత్పాదనను విస్మరించిందని వారు తెలిపారు. విభజన చట్ట ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను అడ్డుకుంటున్న చంద్రబాబు ఇంటివద్ద కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు.
విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కించే యోచనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం కాంగ్రెస్ నేతలకు తగదన్నారు. అధికారంలో ఉండి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు కాబట్టే ఆ రెండు పార్టీలను ప్రజలు ఓడించారన్నారు. భవిష్యత్తులో కూడా ఆ రెండు పార్టీలను ప్రజలను నమ్మరని వారి విమర్శించారు.