
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో ఏపీ సీఎంతో మాట్లాడే బాధ్య త తెలంగాణ సీఎం కేసీఆర్ దేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌కు మంచి సంబం ధాలు ఉన్నాయని, అలాంటప్పుడు అక్కడి ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్ నుంచి ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఫేస్‌బుక్‌లైవ్ ద్వారా మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించడంతో పాటు కృష్ణా రివర్‌బోర్డు చైర్మన్‌ను కలిశామని, కేంద్రమంత్రి షెకావత్‌తో మాట్లాడి తమ అభ్యంతరాలు చెప్పామని వివరించారు.
కానీ, అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేసీఆర్ అసమర్థతతో వ్యవహరిస్తున్నారా లేదంటే ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయని, వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ కారణంగా సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమయిందని, ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ నిరుత్సాహపరిచిందని అన్నారు. మధ్య తరహా, చిన్న పరిశ్రమలు అసంతృప్తితో ఉన్నాయని, వాటికి జీఎస్టీ లేదా రుణాల రూపంలో ఉపశమనం కల్పించాలని కోరారు. కరోనా సమయంలో పేదల కష్టాలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment