స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకుంటే అందుకు భిన్నంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జేబులు నింపుకోవడానికే మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి సీఎం దేశంలో ఎవరూ లేరని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై బుధవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఉత్తమ్ మాట్లాడుతూ.. పోతి రెడ్డిపాడు ద్వారా రోజూ 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీ తీసుకువెళితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళుతామని గత డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విషయంపై జనవరి 5న తమ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తే స్పందించలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క నూతన ఆయకట్టు కన్నా నీరిచ్చారా అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేదని, కానీ సీఎం పట్టించుకోలేదని విమర్శించారు.
మహబూబ్‌నగర్‌ను బొందపెట్టిండు...
కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను 90% పూర్తిచేస్తే, ఈ ఆరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 10% పనులను కూడా పూర్తి చేయలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు. ఎంపీగా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహబూబ్‌నగర్‌ను కేసీఆర్ బొందపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ 30 కిలోమీటర్లు పూర్తి చేస్తే, మిగిలిన 10 కిలోమీటర్ల పనులను టీఆర్‌ఎస్ పూర్తి చేయలేకపోయిందన్నారు. వచ్చే నెల 2న కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల వద్ద జల దీక్ష చేస్తున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, వలస కార్మికులను వారి సొంతూళ్లకు తరలించడం తదితర కార్యక్రమాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు సోషల్ మీడియా క్యాంపెన్ నిర్వహించాలని సూచించారు.
సాగర్ ఎండిపోయే ప్రమాదం..
ఉన్న నీళ్లనే వాడుకలోకి తీసుకురాలేని ప్రభుత్వం అదనపు నీళ్లను ఎలా తీసుకువస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదనంగా నీళ్లను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చేది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయని, సాగర్ నిండక ఏడేళ్లు అవుతుందని, ఈ పరిస్థితుల్లో సంగమేశ్వర నుంచి నీళ్లను తీసుకువెళితే భవిష్యత్‌లో నాగార్జునసాగర్ ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో సాగర్ ఎడమ కాల్వ మీద ఆధారపడిన ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డిలు సాగునీటి రంగంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్ నేతలు సంపత్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment