ఇంధన ధరలతో కేంద్రం దగా | Tpcc Uttam Kumar Reddy Fires On Central Government Over Fuel Prices | Sakshi
Sakshi News home page

ఇంధన ధరలతో కేంద్రం దగా

Published Sun, Jul 5 2020 4:13 AM | Last Updated on Sun, Jul 5 2020 8:01 AM

Tpcc Uttam Kumar Reddy Fires On Central Government Over Fuel Prices - Sakshi

శంషాబాద్‌: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కష్టకాలంలో పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు మాసాలుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై ధరల పెంపు భారం మోపడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్న సమయంలో దేశంలో మాత్రం ఇం«ధన రేట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 108 డాలర్లు ఉండగా, ఇక్కడ లీటరు పెట్రోలు రూ.71.40, డీజిల్‌ ధర రూ. 59.49 ఉందని.. అదే క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ప్రస్తుతం 41 డాలర్లు ఉన్నా.. పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. గత ఆరేళ్ల కాలంలో పదకొండు సార్లు ఎక్సైజ్‌ పన్ను పెంచిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందన్నారు. రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ జనార్దన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, పార్టీ సీనియర్‌ నాయకురాలు మైలారం సులోచన తదితరులు పాల్గొన్నారు.

శనివారం శంషాబాద్‌ తహసీల్‌ ఎదుట జరిగిన ధర్నాలో ఉత్తమ్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement