గురువారం రాములు నాయక్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఒక రోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో పోలీసు పహారా మధ్య ఆయన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు. సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ వీ హెచ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయితే గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారి హక్కులు కాల రాస్తున్నా పట్టించుకోవడం లేదనివిమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాములు నాయక్ దీక్ష ప్రకటించిన నేపథ్యంలో కౌంటర్ వేస్తామని సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment