శుక్రవారం ఇల్లందకుంట మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, పొన్నం, జీవన్‌రెడ్డి తదితరుల
ఇల్లందకుంట (హుజూరాబాద్)/సాక్షి, సిద్దిపేట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, అలాగే ధాన్యంలో ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేయాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. అయితే రైతుల తరఫున మాట్లాడితే సీఎం కేసీఆర్, ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల తరఫున మాట్లాడితే రాజకీయమా అని ప్రశ్నించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. శుక్రవారం పీసీసీ బృందం కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ బృందం సందర్శించింది.
తడిసిన వరి ధాన్యం, మక్కలను పరిశీలించింది. నాయకులు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్వింటాల్‌కు పదికిలోల ధాన్యంకోత పెడుతున్నారని, తూ కంలోనూ జాప్యం చేస్తున్నారని రైతులు కాం గ్రెస్ నాయకులవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరిలో అమ్మిన కందుల డబ్బులు ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. వరి, బత్తాయి, నిమ్మ, మామిడి, పసుపు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాలు, మిల్లు ల్లో తరుగు పేరుతో 4 కిలోల వరకు కోత విధిస్తున్నా ఉమ్మడి జిల్లాలో ఉన్న నలుగురు మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రులు మిల్లర్లతో మిలాఖత్ అయి రైతులను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కొనుగోళ్లలో జాప్యంతోనే రైతులకు నష్టం ..
‘ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు సరఫరా చేయలేదు.. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టి వారాల తరబడి ధాన్యం కొనకుండా జాప్యం చేశారు. దీని మూలంగానే రైతుల ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్ద అయింది.. రైతుల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని నాయకులు పరిశీలించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోటి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ.30 వేల కోట్లు సిద్ధంగా ఉంచామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలు అయ్యాయన్నారు.
వైఎస్ హయాం నుంచే ధాన్యం కొనుగోళ్లు
పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం శోచనీయమన్నారు. మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు.
మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు: ఉత్తమ్
రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై..ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రైతులకు జరుగుతున్న అన్యాయం.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లా లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన శుక్రవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బస్తాల్లో 42 కిలోల వడ్లు నింపి 40 కేజీలకే లెక్క కడుతున్నారని, ఎవరి ఆదేశాలతో ఇది చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం మిల్లర్లకు లబ్ధి కలిగేలా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బత్తాయి ఆరోగ్యానికి మంచిదని.. మనమే వినియోగించుకోవాలని చెప్పి బయటకు అమ్ముకోకుండా చేశారని విమర్శించారు. గతేడాది రూ.40 వేలకు టన్ను అమ్మితే.. ప్రసుతం రూ.10 వేలకు కూడా ఎవరూ కొనేవారు లేకుండా పోయారని అన్నారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment