తెలంగాణలో టీఆర్ఎస్ బలమెంత?
తెలంగాణలో టీఆర్ఎస్ బలమెంత?
Published Tue, Mar 25 2014 7:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అత్యధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను గంప గుత్తగా గెలుచుకోవాలని వ్యూహాలను రచిస్తున్న టీఆర్ఎస్ బలం, కేసీఆర్ సామర్ధ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్ద కాల ఉద్యమ చరిత్ర, నేపథ్యమున్న టీఆర్ఎస్ మూడు పదుల అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్లో కూడా కేసీఆర్ అత్యధిక స్థానాలను గెలుచుకోలేక చతికిలపడిన విషయం విదితమే.
తెలంగాణకు అనుకూలంగా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీసుకున్న సానుకూల నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో టీఆర్ఎస్ ది బలమైన పాత్ర అని చెప్పవచ్చు. గత దశాబ్ద కాలంలో వివిధ జేఏసీలు, ఉద్యమ పార్టీల మద్దతుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలోనూ, క్లిష్టపరిస్థుతుల్లో ఉద్యమాన్ని స్థిరపరచడంలోనూ కేసీఆర్ తనదైన శైలిని ప్రదర్శించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ ది 'వన్ మ్యాన్ షో' అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రిడిట్ ను తెలుగుదేశంతోపాటు కాంగ్రెస్, బీజేపీలు సొంతం చేసుకోవడానికి ప్రస్తుత ఎన్నికల్లో పావులు కదుపుతున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు, 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుందామనే కేసీఆర్ వ్యాఖ్యాల్లో వాస్తవముందా అనే విషయాన్ని పరిశీలిస్తే.. కష్టమే అనిపించక తప్పదు. ఎందుకంటే హైదరబాద్ జంట నగరాలతోపాటు గ్రేట్ హైదరబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సుమారు 24 స్థానాలున్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 24 స్థానాల్లో అంతంత బలం ఉన్న టీఆర్ఎస్ కు అధిక స్థానాలు దక్కుతాయా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 స్థానాలు మినహాయిస్తే 95 స్థానాలున్నాయి. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఊపు కొంత ఉన్నా.., దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమే అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
దక్షిణ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కేడర్ కూడా చాలా తక్కువే అనే విషయం చెప్పనక్కర్లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగానే ఉన్నా.. నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారనేది ఆపార్టీ శ్రేణులే అనుమానం వ్యక్తం చేసే అంశం. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ తెచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుండగా... మోడీ ఫ్యాక్టర్ తో బీజేపీ దూసుకుపోతోంది. హైదరాబాద్ లో ఎంఐఎం ఎప్పటిలానే తన స్థానాలను గెలుచుకోవచ్చు లేదా తగ్గనువచ్చూ. ఇక తెలంగాణ ప్రాంతంలో అంతో ఇంతో కేడర్ ఉన్న తెలుగుదేశం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు కీలక స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాంగ్రెస్, బీజీపీలతోపాటు ప్రధాన ప్రత్యర్ధులు బలమైన పోటిని ఇవ్వనున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్రంలో ప్రభావం చూపే విధంగా..తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేసే సామర్ధ్యం కేసీఆర్ ఉందా? అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యలు నిజమైన బలుపేనా లేకా వాపా అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టం కానుంది.
Advertisement
Advertisement