కాంగ్రెస్‌తో కేసీఆర్ శాంతి బంధం
టీడీపీ శిథిలభవనంలో బీజేపీ ఇరుక్కుంది: జైపాల్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలవదని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అర్థం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌తో శాంతి బంధాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం ఇదే’ అని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ, టీడీపీ నడుమ ఎన్నికల అవగాహన కుదరక ముందు బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఆయన ప్రతిపాదనను బీజేపీ జాతీయ నాయకత్వం తిరస్కరించి టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది.
కూలిపోతున్న టీడీపీ భవనంలో పొత్తుల పేరిట బీజేపీ ఇరుక్కుపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ పలుమార్లు మాట తప్పి విశ్వసనీయతను తగ్గించుకున్నారు.. ఇప్పటికైనా తన మాటలతో విశ్వసనీయత పెంచుకునే ప్రయత్నం చేయాలి’ జైపాల్‌రెడ్డి సూచిం చారు. ‘తెలంగాణ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేశామని చెప్తున్నా సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. సీమాంధ్రలో సోనియా తన బలాన్ని కోల్పోయి మూల్యం చెల్లించినా తెలంగాణ ఇచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ విషయంలో సోనియాకు అందరికంటే ఎక్కువగా తానే ప్రభావితం చేశానన్నారు.