వరంగల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లకు చివరి రోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ల వేశారు. బుధవారం ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీతో పాటు రెబల్స్, స్వతంత్రులు, ఇతర పక్షాల అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు వేయడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద జాతరను తలపించింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో వరంగల్‌కు 14, మహబూబాద్‌కు 16 నామినేషన్లు దాఖలయ్యాయి.
12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 314 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా పాలకుర్తిలో 43, వర్ధన్నపేటల్లో 42 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలో తక్కువగా 14 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూట్నీ, ఉపసంహరణ తర్వాత బరిలో ఎంత మంది ఉంటారో వేచి చూడాలి.
బలప్రదర్శనలు
నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు బలప్రదర్శనకు యత్నించారు. అభ్యర్ధులు చేపట్టిన ర్యాలీలు హోరెత్తారు. ఉదయం నుంచి నామినేషన్ల సమయం ముగిసే వరకు ఒకరి తర్వాత ఒకరు సెంటర్లకు బృందాలుగా వచ్చారు.
తమ కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీలు నిర్వహించారు. తొలి ప్రచారంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా భారీగా జనాన్ని సమీకరించేందుకు యత్నించారు. ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఇది పెద్ద పరీక్షగా మారింది.