ప్రచారం బంద్
సాక్షి,నెల్లూరు: తొలివిడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి తెరలేచింది. మద్యం, డబ్బు పంపిణీ ఊపందుకుంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో అడ్డదారులు తొక్కుతున్నాయి. మొత్తంగా పరిషత్ ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకుంది. తొలివిడతలో భాగంగా జిల్లాలోని 21 మండలాల్లో ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. 911 పోలింగ్ కేంద్రాల పరిధిలో 7,04,671 మంది గ్రామీణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
విజయమే లక్ష్యంగా..
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే మద్యం పంపిణీ షురూ చేశారు. ఓటు కు రూ.500 నుంచి రూ.2 వేల వరకూ వెచ్చిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలనే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కనీసం 10 నుంచి ఆ పైన ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలను మరింత మచ్చిక చేసుకుని పెద్ద మొత్తం వెచ్చించి వారిని కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఈ మొత్తం రెండు మూడు రె ట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. యువకులకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు, తదితర వస్తువులను సైతం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం సాయంత్రానికి అధికారికంగా ప్రచారం ముగియడంతో పల్లెల్లో చీకటి రాజకీయాలు జోరందుకున్నాయి. రాత్రి పొద్దుపోయాక గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు. అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడంలేదు. సరాసరి ఒక్కొక ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.25 లక్షలు తగ్గకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనరల్ కేటగిరీకి కేటాయించిన జెడ్పీటీసీ స్థానాల్లో కోట్లలోనే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన పార్టీల నేతలు పల్లెల్లో మకాం వేసి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
శనివారం సాయంత్రానికి ప్రలోభాల పర్వం మరింత జోరందుకోనుంది. మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలను ఎక్కడా పాటిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. ఇక జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ అభ్యర్థ్టుల విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని అందుకు అవసరమైన అడ్డదారులన్నీ తొక్కుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీకి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ నేతలు టీడీపీతో చీకటి ఒప్పందాలకు దిగారు. చాలా ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కాంగ్రెస్,టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నది పరిశీలకుల అభిప్రాయం.