సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు అంతర్గత రాజకీయం నడిపిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు శుక్రవారం రాత్రి నుంచి కుమ్మక్కు రాజకీయానికి తెరలేపాయి. తమ వల్ల తెలుగుదేశం ఓడిపోతుందనుకునే డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ రోజు చేతులెత్తేసే ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అడ్డుకట్ట వేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత పొత్తులు పొడిచినట్లు తెలిసింది.
నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అంచనాకు వచ్చాయి. ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలు పైకి ఒకరినొకరు తిట్టిపోసుకున్నా ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరు రహస్య ఒప్పందానికి వచ్చారు. కాంగ్రెస్ ఎలాగూ గెలిచే ప్రసక్తే లేనందువల్ల డివిజన్లలో ఈ పార్టీ తరపున బలమైన వారిని బరిలోకి దించకుండా అవగాహనకు వచ్చారు. తమ వల్ల టీడీపీ ఓడిపోరాదనే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరించినట్లు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని డివిజన్లలో ప్రచార పర్వంలోనే చేతులు పెకైత్తేసి కూర్చున్నారు.
తమకు కావాల్సిన నాలుగైదు డివిజన్లలో టీడీపీ నుంచి డమ్మీ అభ్యర్థులు బరిలోకి దిగేలా చూసుకున్న కాంగ్రెస్ నేతలు ఆ డివిజన్లలోనే ఓట్ల కొనుగోలుకు పోటీ పడ్డారు. మిగిలిన డివిజన్లలోని కాంగ్రెస్ అభ్యర్థులకు పోలింగ్ ముందు మూడు రోజుల ఖర్చులకు నగదు సరఫరా కాకుండా చేశారు. ఈ వ్యవహారం చూసిన కొందరు అభ్యర్థులు నాయకుడు తమను నడి సముద్రంలో ముంచేశారని తిట్టి పోసుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా కూడా తాము గెలవలేని డివిజన్లలో తమ ఓట్లు సైకిల్‌కు బదిలీ చేయించేందుకు కాంగ్రెస్ నేతలు అవసరమైన ఏర్పాట్లు చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు పార్టీలే కాకుండా కొన్ని డివిజన్లలో ఇతర పార్టీలు, స్వతంత్రుల ను కూడా ఇదే బాట పట్టించేందుకు అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు రాత్రి రాజకీయాలు చేసినట్లు తెలిసింది. ఆ రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్న తెర చాటు మహాకూటమి రాజకీయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి?
కుమ్మక్కు.. గిమ్మిక్కు
Published Sun, Mar 30 2014 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement