ముహూర్తబలం
41 మంది.. 56 సెట్లు మూడోరోజు.. నామినేషన్ల జోరు
అందుబాటులో లేని అభ్యర్థులు.. కుటుంబసభ్యుల చేత దాఖలు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ముహూర్తం బాగుందని జిల్లాలో ఎక్కువ మంది శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు రెండు రోజుల్లో 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా శుక్రవారం 13 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి 41 మంది అభ్యర్థులు 56 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటించకున్నా ఆశావహులు టికెట్ ఆశిస్తూ పార్టీ పరంగా నామినేషన్లు దాఖలు చేశారు.
సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మినహా.. 12 నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో బీ ఫారం కోసం అభ్యర్థులు హైదరాబాద్ వెళితే.. ముహూర్తం బాగుందని ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి సతీమణులు.. కుటుంబసభ్యులు నామినేషన్లు వేయడం విశేషం. వైఎస్సార్‌సీపీ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయకపోయినప్పటికీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి కండెన్ ప్రభాకర్ కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు నామినేషన్ సమర్పించారు.
మానకొండూరు అసెంబ్లీ స్థానం నుంచి సొల్లు అజయ్‌వర్మ, పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి ఎంఏ ముస్తాఖ్‌పాషా నామినేషన్ వేశారు. శనివారం బాబుజగ్జీవన్‌రాం జయంతి సెలవుదినం అయినప్పటికీ నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఆదివారం తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావడంతో సోమవారం అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
టీఆర్‌ఎస్ నుంచి..
కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తరఫున ఆయన సతీమణి రజిని నామినేషన్ దాఖలు చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తరఫున ఆయన కుమారుడు అరుణ్‌కుమార్‌తోపాటు పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు గుంపుల ఓదెలు, ధర్మపురిలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తరఫున ఆయన సతీమణి స్నేహలత, మంథనిలో పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ తనతోపాటు తన భర్త తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు.
వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తరఫున ఆయన ముఖ్య అనుచరుడు ఎర్రం మహేశ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్ తరఫున తండ్రి హన్మంతరావు, చిన్నాన జితేందర్ , హుస్నాబాద్‌లో వొడితల సతీశ్‌బాబు తరఫున ఆయన మరదలు వర్ష నామినేషన్ వేశారు. మంథనిలో చందుపట్ల సునీల్‌రెడ్డి నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ నుంచి :
మానకొండూరులో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ అసెంబ్లీకి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జగిత్యాలకు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తరఫున మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గట్టు సతీశ్ నామినేషన్లు దాఖలు చేశారు. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవితారెడ్డి, రామగుండంలో పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోలేటి దామోదర్, కౌశిక్‌హరి తరఫున ఆయన సతీమణి లత, కోరుట్లలో బెజ్జారపు శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు.
టీడీపీ నుంచి :
పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు, కరీంనగర్ నుంచి కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల నుంచి కోడి అంతయ్య, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మ్యాక లక్ష్మయ్య, జానపట్ల స్వామి, రామగుండంలో సిరిపురం మాణిక్యం, షేక్‌అఫ్జల్ నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడలో గండ్ర నళిని, కోరుట్లలో సాంబరి ప్రభాకర్, మానకొండూరులో ఎడ్ల వెంకటయ్య నామినేషన్ వేశారు.
బీజేపీ నుంచి :
పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కోరుట్లలో ఆర్మూరు పోచయ్య రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థులు :
రామగుండంలో శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ తరఫున ఆయన సతీమణి ప్రసూన మనాలి, కౌశిక్‌హరి అనుచరుడు రాజు, గోపు ఐలయ్య యాదవ్, పాతిపల్లి ఎల్లయ్య, పెంట రాజేశ్, మానకొండూరు నుంచి ఎడ్ల వెంకటయ్య, కోరుట్లలో గడ్డం మధు, మంథనిలో చందుపట్ల సునీల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
బీఎస్పీ నుంచి వేములవాడలో గడ్డం రవీందర్‌రెడ్డి నామినేషన్ వేశారు.