manakonduru
-
రసమయి బాలకిషన్ తిట్ల పురాణం!
సాక్షి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ గ్రామస్తుడిపై నోరు పారేసుకున్నారు. తనను విమర్శించాడనే కోపంతో పరుష పదజాలంతో ఆయనపై విరుచుకుపడ్డారు. అయితే సదరు గ్రామస్తుడు సైతం.. ఎమ్మెల్యే తిట్ల దండకానికి అంతే దీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తమ గ్రామంలో పర్యటించలేదంటూ బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: టీఆర్ఎస్లో రచ్చ.. తన్నుకున్న నాయకులు) ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రసమయి, నేరుగా రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు. హఠాత్పరిణామంతో కంగుతిన్న రాజశేఖర్‌రెడ్డి.. తాను సైతం ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకుని గట్టిగానే బదులిచ్చారు. వీరిద్దరి మధ్య నడిచిన తిట్ల పురాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రసమయి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూ కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొంత మంది మాత్రం ఎదుటి వాళ్లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించినందు వల్లే ఆయన ఇలా చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బ్రిడ్జి ప్రారంభించేదెప్పుడో..?
సాక్షి, మానకొండూర్: మండలంలోని వేగురుపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామాల వద్ద మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్న ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ వంతెనకు ఇరువైపుల భూ సేకరణ చేపట్టి రహదారి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ అ«ధికారులు భూ సేకరణ చేపట్టలేదు. వంతెనకు ఒక వైపే భూ సేకరణ పనులు నామమాత్రంగా చేపట్టినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. వంతెనకు మరోవైపు భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, అ«ధికారులు మాత్రం అటువైపుగా దృష్టి సారించక పోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేక పోతోందని వాహనదారులు ఇరు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే బ్రిడ్జి పనులు పూర్తి వేగురుపల్లి–నీరుకుల మధ్య మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులో మట్టి పోసి వాగును దాటే వారు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోవడం వలన మళ్లీ అక్కడక్కడ మట్టి పోసి అనేక ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించేవారు. తొలిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి మాట నిలుపుకున్నారు. వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేయించారు. 2016 జనవరి 2న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు వేగవంతంగా చేశారు. 15 ఫిల్లర్లు, 2 అపార్టుమెంట్లు ప్రధాన పనులను త్వరితగతిన పూర్తి చేశారు. ఫిల్లర్లపై గడ్డర్స్, డక్ స్లాబ్ పనులు కూడా చేశారు. 640 మీటర్ల మేర చేపట్టే ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి రాకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. భూ సేకరణలో జాప్యం వంతెనకు ఇరువైపుల రైతుల నుంచి భూ సేకరణ చేపట్టి రెండు కిలోమీటర్లకు పైగా కాంట్రాక్టర్ తారు రోడ్డు వేయాల్సి ఉంది. మానకొండూర్ మండలం వేగురుపల్లి వైపు అధికారులు భూ సేకరణ చేపట్టిన పూర్తిస్థాయిలో జరుపలేదని తెలుస్తోంది. కొద్దిదూరం మాత్రమే భూ సేకరణ చేపట్టి మట్టి పనులు చేశారు. పంట పొలాల్లో మట్టి పోసి రహదారి ఏర్పాటు చేసి తారు వేయాల్సి ఉంది. ప్రస్తుతం పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇరుకుల్ల వైపు భూ సేకరణ పనులు ఇంత వరకూ చేపట్టనేలేదు. వేగురుపల్లి వైపు కిలోమీటరు మేర పనులు చేపట్టాల్సి ఉండగా, ఇరుకుల్ల వైపు కిలోమీటరుపైగా పనులు చేపట్టాల్సి ఉంది. భూ సేకరణ త్వరగా చేపట్టితేనే ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. వంతెనకు ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి వంతెనపై రాకపోకలను ప్రారంభించాలని ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు. -
తీన్మార్!
మానకొండూర్(ఎస్సీ) నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇదివరకు కమలాపూర్, హుజూరాబాద్, ఇందుర్తి, నేరెళ్ల, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఉన్న శంకరపట్నం, మానకొండూర్, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి(గన్నేరువరం) మండలాలను కలుపుకుని ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఏర్పడకముందు పలువురు మహామహులు పాలించిన ఇప్పటి మానకొండూర్‌లో 2009నుంచి త్రిముఖ పోరు ఉంది. తొలిఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి మోహన్ గెలిచారు. 2014లో టీఆర్ఎస్ తరఫున రసమయి బాలకిషన్ ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి గడ్డం నాగరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐదు నియోజకవర్గాల మానకొండూర్ 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మానకొండూర్ మండలంలోని 9 గ్రామాలు కమలాపూర్ నియోజకవర్గంలో ఉండేవి. 16 గ్రామాలు కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి. శంకరపట్నం మండలంలోని 13 గ్రామాలు కమలాపూర్‌లో, 7గ్రామాలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండేవి. తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం ఇందుర్తి నియోజకవర్గంలో ఉండేది. మిగితా 19గ్రామాలు కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి. (పూర్వపు) బెజ్జంకి మండలం మొత్తం ఇందుర్తి నియోజకవర్గంలో, ఇల్లంతకుంట మండలం నేరెళ్ల నియోజకవర్గంలో కలిసి ఉండేది. ప్రముఖులు ఏలిన ప్రాంతం.. ప్రస్తుత మానకొండూర్ గత ఐదు నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ప్రముఖుల చేత పాలించబడింది. కరీంనగర్ నుంచి చొక్కారావు, ఆనందరావు, ఎం.సత్యనారాయణరావు, కఠారి దేవేందర్‌రావు, నలుమాచు కొండయ్య మానకొండూర్, తిమ్మాపూర్ మండలాలకు ప్రాతినిథ్యం వహించారు. మానకొండూర్‌లోని 9 గ్రామాలు, శంకరపట్నంలోని 13 గ్రామాలను కమలాపూర్ నియోజకవర్గం నుంచి కేవీ. నారాయణరెడ్డి, పి. జనార్ధన్‌రెడ్డి రెండుసార్లు పాలించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ముద్దసాని దామోదర్‌రెడ్డి 20ఏళ్లు ఈ ప్రాంతాలను ఏలారు. తాజా మాజీ హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమలాపూర్ నుంచి రెండు పర్యాయాలు సేవలందించారు. గత ఇందుర్తి నియోజకవర్గంలో ఉన్న పూర్వపు బెజ్జంకి మండలం, తిమ్మాపూర్ మండలం లోని మొగిలిపాలెం గ్రామానికి సీపీఐ నుంచి దేశిని చినమల్లయ్య నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించగా, చాడ వెంకటరెడ్డి 2004లో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి బొమ్మా వెంకటేశ్వర్లు, బొప్పరాజు లక్ష్మీకాంతారావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నేరెళ్ల నియోజకరవర్గానికి అనుబంధంగా ఉన్న ఇల్లంతకుంట మండలానికి గొట్టె భూపతి, సుద్దాల దేవయ్య, కాసీపేట లింగయ్య ఎమ్మెల్యేలుగా సేవలందించారు. మూడు జిల్లాల పరిధిలో.. 2009 పునర్విభజనలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గం ఏర్పంది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు. ప్రస్తుతం మానకొండూర్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలు కరీంనగర్ పరిధిలో ఉన్నాయి. బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇల్లంతకుంట మండలం రాజన్నసిరిసిల్ల పరిధిలోకి వెళ్లింది. 2018 ఎన్నికలు మాత్రం కరీంనగర్ జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరుగనున్నాయి. ఆరెపల్లి.. సర్పంచ్ నుంచి విప్ వరకు మానకొండూర్ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సర్పంచ్ నుంచి ప్రభుత్వ విప్ వరకు అనేక పదవులు అధిష్టించారు. 1988 నుంచి 2001 వరకు 19ఏళ్లు సర్పంచ్‌గా కొనసాగారు. తిమ్మాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది, 2007 నుంచి 2009 వరకు జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మానకొండూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి చేతిలో ఓటమిపాలయ్యారు. ఎప్పుడూ త్రిముఖపోరే... మానకొండూర్ నియోజకవర్గం ఏర్పడిన 2009 నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడ త్రిముఖపోరు ఉంటోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి మోహన్, టీఆర్ఎస్ నుంచి ఓరుగంటి ఆనందర్, పీఆర్పీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పోటీ చేయగా ఆరెపల్లి మోహన్ విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి మోహన్, టీఆర్ఎస్ నుంచి రసమయి బాలకిషన్, టీడీపీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పోటాపోటీగా నిలవగా... రసమయి బాలకిషన్ విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి, బీజేపీ నుంచి గడ్డం నాగరాజు ఇప్పటికే నామినేషన్ వేశారు. రసమయి బాలకిషన్ త్వరలో నామినేషన్ వేయనున్నారు. దీంతో ఈ 2018 ఎన్నికల్లోనూ మానకొండూర్‌లో ‘త్రిముఖ’పోరు ఉండనుందని ఇక్కడి ఓటర్లు చర్చించుకుంటున్నారు. రసమయి.. ఉపాధ్యాయుడి నుంచి.. రసమయి బాలకిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమకాలంలో ధూం ధాం కళాకారుడిగా పేరు సంపాదించి, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. గుర్తించిన కేసీఆర్ రసమయిని 2014 ఎన్నికల్లో మానకొండూర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. భారీమెజార్టీతో గెలుపొంది, కేబినెట్ హోదాలో పనిచేశారు. తిరుగుబాటు గడ్డ.. మానకొండూర్ నియోజకవర్గం సాయుధ పోరాటాల వీరులకు నిలయంగా ఉంది. అనభేరి ప్రభాకర్‌రావు స్వగ్రామం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి. బద్ధం ఎల్లారెడ్డి స్వగ్రామం ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి. ఇదే మండలంలో 9.20లక్షల ఎకరాలకు సాగునీరందించే 24టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎల్ఎండీ ప్రాజెక్టు ఉంది. బెజ్జంకి లక్ష్మినృసింహుడు, గట్టుదుద్దెనపల్లి ప్రసన్నాంజనేయస్వామి వారు ఇక్కడివారికి ప్రత్యేకం. -
రెండు లారీలు ఢీ : 2 కి.మీ. మేర ట్రాఫిక్ జాం
మానకొండూర్: కరీంనగర్జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి వద్ద బ్రిడ్జిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలు రెండూ బ్రిడ్జిపై అడ్డంగా తిరగడంతో కరీంనగర్-వరంగల్ రహదారిపై రెండు కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రెండు వైపులా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
ప్రేమించి మోసం చేసిన ఎస్ఐ!
వరంగల్: బాధితులకు రక్షణ కల్పించవలసిన ఎస్ఐ ఓ యువతిని ప్రేమించి మోసం చేశాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎస్ఐ రాజు తనను ప్రేమించి మోసం చేశాడని ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరకాల డిఎస్పి సంజీవరావు వెంటనే స్పందించి ఎస్ఐ రాజుని అదుపులోకి తీసుకున్నారు. నిజాలు తెలుసుకునేందుకు అతనిని విచారిస్తున్నారు. ** -
గులాబీ ముళ్లు
టీఆర్ఎస్లో టిక్కెట్ల లొల్లి మొదలైంది. 13 అసెంబ్లీ స్థానాలకు 12 చోట్ల అభ్యర్థిత్వాలను కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీలో అసమ్మతి రాజుకుంది. తాము ఆశించిన సీట్లను మరొకరికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అసమ్మతి నేతలు, అభ్యర్థులతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో ఉండటానికి కొంతమంది ప్రయత్నిస్తుండగా, మరికొందరు పార్టీలోనే ఉంటూ అభ్యర్థిని ఓడించడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు అవకాశం ఇవ్వగా, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోరుకంటి చందర్ రెబెల్‌గా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల జాబితా విడుదల కాగానే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల మేరకు రెబెల్‌గా పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. 2009లో చందర్ టీఆర్ఎస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీచేయగా, సోమారపు సత్యనారాయణ రెబెల్‌గా బరిలోకి దిగారు. ఎన్నికల అనంతరమే 2014లో పార్టీ టికెట్ కోరుకంటి చందర్‌కు ఇస్తామని అప్పట్లో పార్టీ ప్రకటించింది కూడా. చివరకు చందర్‌కు పార్టీ మొండిచేయి చూపి, సత్యనారాయణకు టికెట్ ఇవ్వడంతో 2009 నాటి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దపల్లిలో పరిస్థితి మరోరకంగా ఉంది. అక్కడినుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి టికెట్‌ను ఆశించారు. పార్టీ హైకమాండ్ మాత్రం దాసరి మనోహర్‌రెడ్డి వైపే మొగ్గుచూపింది. దీంతో ఈద కూడా అసమ్మతితో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే ఆయన దాసరికి మద్దతు పలకడం అనుమానమే. మానకొండూరులో టికెట్ తనకే ఖాయమనుకొని ధీమాగా ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంటి ఆనంద్ అనూహ్యంగా తెరపైకి రసమయి బాలకిషన్ రావడంతో ఖంగుతిన్నారు. రసమయి బాలకిషన్‌కు టికెట్ ఇవ్వడంతో ఆనంద్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన పుట్ట మధుకు మంథని టిక్కెట్ కేటాయించడంతో అప్పటివరకు టిక్కెట్ ఆశించిన చందుపట్ల సునీల్‌రెడ్డి రెబెల్‌గా పోటీలో ఉంటానంటున్నారు. ఈ నెల 4నే ఆయన నామినేషన్ సైతం సమర్పించారు. కోరుట్లలో ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ టికెట్ ఆశించారు. అయితే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెను కథలాపూర్ నుంచి పార్టీ బరిలోకి దింపింది. కానీ స్థానికంగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు సహకరించడం లేదనే అసంతృప్తి ఇతర నేతల్లో నెలకొంది. ఇది ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉన్నట్లు పరిశీలకుల అంచనా. ఇక చొప్పదండి టికెట్ ప్రకటించగానే అసమ్మతి వెల్లువెత్తే అవకాశం ఉందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అభ్యర్థుల జాబితా వెల్లడితో టీఆర్ఎస్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిరాగం, అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుందా అనే కోణంలో పార్టీ అగ్రనాయకులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముందుజాగ్రత్తగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు, పార్టీ సీనియర్లు రంగంలోకి దిగినట్లు తెలిసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఏదో ఒకరకంగా టికెట్ రాని లోటును భర్తీ చేస్తామని అసమ్మతి నేతలకు తాయిలాల గాలం వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసమ్మతిని ఆదిలోనే అధిష్టానం తుంచి వేస్తుందా లేక అభ్యర్థులను పుట్టిముంచే స్థాయికి చేరుకుంటుందా అనే మీమాంసలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. -
ముహూర్తబలం
41 మంది.. 56 సెట్లు మూడోరోజు.. నామినేషన్ల జోరు అందుబాటులో లేని అభ్యర్థులు.. కుటుంబసభ్యుల చేత దాఖలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ముహూర్తం బాగుందని జిల్లాలో ఎక్కువ మంది శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు రెండు రోజుల్లో 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా శుక్రవారం 13 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి 41 మంది అభ్యర్థులు 56 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటించకున్నా ఆశావహులు టికెట్ ఆశిస్తూ పార్టీ పరంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మినహా.. 12 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో బీ ఫారం కోసం అభ్యర్థులు హైదరాబాద్ వెళితే.. ముహూర్తం బాగుందని ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి సతీమణులు.. కుటుంబసభ్యులు నామినేషన్లు వేయడం విశేషం. వైఎస్సార్సీపీ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయకపోయినప్పటికీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి కండెన్ ప్రభాకర్ కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు నామినేషన్ సమర్పించారు. మానకొండూరు అసెంబ్లీ స్థానం నుంచి సొల్లు అజయ్‌వర్మ, పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి ఎంఏ ముస్తాఖ్పాషా నామినేషన్ వేశారు. శనివారం బాబుజగ్జీవన్‌రాం జయంతి సెలవుదినం అయినప్పటికీ నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఆదివారం తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావడంతో సోమవారం అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి.. కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తరఫున ఆయన సతీమణి రజిని నామినేషన్ దాఖలు చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తరఫున ఆయన కుమారుడు అరుణ్‌కుమార్‌తోపాటు పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు గుంపుల ఓదెలు, ధర్మపురిలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తరఫున ఆయన సతీమణి స్నేహలత, మంథనిలో పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ తనతోపాటు తన భర్త తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తరఫున ఆయన ముఖ్య అనుచరుడు ఎర్రం మహేశ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్ తరఫున తండ్రి హన్మంతరావు, చిన్నాన జితేందర్ , హుస్నాబాద్‌లో వొడితల సతీశ్‌బాబు తరఫున ఆయన మరదలు వర్ష నామినేషన్ వేశారు. మంథనిలో చందుపట్ల సునీల్‌రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి : మానకొండూరులో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్ అసెంబ్లీకి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జగిత్యాలకు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తరఫున మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గట్టు సతీశ్ నామినేషన్లు దాఖలు చేశారు. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవితారెడ్డి, రామగుండంలో పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోలేటి దామోదర్, కౌశిక్‌హరి తరఫున ఆయన సతీమణి లత, కోరుట్లలో బెజ్జారపు శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి : పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు, కరీంనగర్ నుంచి కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల నుంచి కోడి అంతయ్య, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మ్యాక లక్ష్మయ్య, జానపట్ల స్వామి, రామగుండంలో సిరిపురం మాణిక్యం, షేక్అఫ్జల్ నామినేషన్ దాఖలు చేశారు. వేములవాడలో గండ్ర నళిని, కోరుట్లలో సాంబరి ప్రభాకర్, మానకొండూరులో ఎడ్ల వెంకటయ్య నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి : పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కోరుట్లలో ఆర్మూరు పోచయ్య రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు : రామగుండంలో శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ తరఫున ఆయన సతీమణి ప్రసూన మనాలి, కౌశిక్‌హరి అనుచరుడు రాజు, గోపు ఐలయ్య యాదవ్, పాతిపల్లి ఎల్లయ్య, పెంట రాజేశ్, మానకొండూరు నుంచి ఎడ్ల వెంకటయ్య, కోరుట్లలో గడ్డం మధు, మంథనిలో చందుపట్ల సునీల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ నుంచి వేములవాడలో గడ్డం రవీందర్‌రెడ్డి నామినేషన్ వేశారు.