వేగురుపల్లి–నీరుకుల్ల మధ్య నిర్మించిన బ్రిడ్జి
సాక్షి, మానకొండూర్: మండలంలోని వేగురుపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామాల వద్ద మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్న ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ వంతెనకు ఇరువైపుల భూ సేకరణ చేపట్టి రహదారి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ అ«ధికారులు భూ సేకరణ చేపట్టలేదు.
వంతెనకు ఒక వైపే భూ సేకరణ పనులు నామమాత్రంగా చేపట్టినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. వంతెనకు మరోవైపు భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, అ«ధికారులు మాత్రం అటువైపుగా దృష్టి సారించక పోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేక పోతోందని వాహనదారులు ఇరు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఏడాది క్రితమే బ్రిడ్జి పనులు పూర్తి
వేగురుపల్లి–నీరుకుల మధ్య మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులో మట్టి పోసి వాగును దాటే వారు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోవడం వలన మళ్లీ అక్కడక్కడ మట్టి పోసి అనేక ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించేవారు. తొలిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి మాట నిలుపుకున్నారు.
వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేయించారు. 2016 జనవరి 2న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు వేగవంతంగా చేశారు. 15 ఫిల్లర్లు, 2 అపార్టుమెంట్లు ప్రధాన పనులను త్వరితగతిన పూర్తి చేశారు. ఫిల్లర్లపై గడ్డర్స్, డక్ స్లాబ్ పనులు కూడా చేశారు. 640 మీటర్ల మేర చేపట్టే ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి రాకపోవడంతో అలంకారప్రాయంగా మారింది.
భూ సేకరణలో జాప్యం
వంతెనకు ఇరువైపుల రైతుల నుంచి భూ సేకరణ చేపట్టి రెండు కిలోమీటర్లకు పైగా కాంట్రాక్టర్ తారు రోడ్డు వేయాల్సి ఉంది. మానకొండూర్ మండలం వేగురుపల్లి వైపు అధికారులు భూ సేకరణ చేపట్టిన పూర్తిస్థాయిలో జరుపలేదని తెలుస్తోంది. కొద్దిదూరం మాత్రమే భూ సేకరణ చేపట్టి మట్టి పనులు చేశారు. పంట పొలాల్లో మట్టి పోసి రహదారి ఏర్పాటు చేసి తారు వేయాల్సి ఉంది.
ప్రస్తుతం పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇరుకుల్ల వైపు భూ సేకరణ పనులు ఇంత వరకూ చేపట్టనేలేదు. వేగురుపల్లి వైపు కిలోమీటరు మేర పనులు చేపట్టాల్సి ఉండగా, ఇరుకుల్ల వైపు కిలోమీటరుపైగా పనులు చేపట్టాల్సి ఉంది. భూ సేకరణ త్వరగా చేపట్టితేనే ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. వంతెనకు ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి వంతెనపై రాకపోకలను ప్రారంభించాలని ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment