పాఠశాలల్లో ‘టీచకులు’
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు.
వెలుగులోకి రానివెన్నో..
బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు.
గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్‌లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్‌లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు.
కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది.
ఇప్పటి వరకు నమోదైన కేసులు
రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.పోక్సో చట్టం
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది.
Comments
Please login to add a commentAdd a comment