Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comment On Telangana Congress 10 Years Power1
తెలంగాణ కాంగ్రెస్‌లో పదేళ్ల లొల్లి!

తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్‌ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్‌.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్‌లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్‌ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్‌ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్‌కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్‌ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్‌ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్‌ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్‌ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులు రేవంత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్‌ కర్నూల్‌ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Minister Narayana Scolds Amaravati Workers Over Delay2
హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌లెస్‌ ఫెలో

సాక్షి, విజయవాడ : కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదస్తులో తెలియజేసేలా రోజుకో వీడియో బయటకు వస్తోంది. మంత్రి నారాయణ తన నోటికి పని చెప్పారు. అమరావతి రాజధాని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బందిని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అమరావతి పనులను మంత్రి నారాయణ తాజాగా పర్యవేక్షించారు. ఆ సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదంటూ కాంట్రాక్టు సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్లు చెప్పే వాస్తవ పరిస్థితి వివరిస్తున్నా వినకుండా తన ఫ్రస్టేషన్ ప్రదర్శించారు. హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌లెస్‌ ఫెలో అంటూ అందరి ముందు ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు.కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. జేసీ ప్రభాకరరెడ్డి, గాలి భానుప్రకాశ్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, ఇలా ఇప్పుడు ఈ లిస్టులో నారాయణ కూడా వచ్చి చేరారు.

News Circulate On Next ścontenders Here List3
ఉప రాష్ట్రపతి రేసు.. శశిథరూర్‌, నితీశ్‌ సహా మరో ముగ్గురు సీనియర్లు?

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ధన్‌ఖడ్‌ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనే కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, మనోజ్‌ సిన్హా, వీకే సక్సేనా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివన్ష్‌ నారాయణ్‌ సింగ్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేరు కూడా తెరపైకి వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనను బీజేపీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా వ్యవహారం బీజేపీ కుట్రగా బీహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. బీహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండగా బీజేపీ ఈ కుట్రకు తెరతీసిందని ఆర్‌జేడీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా అప్రాధాన్యమైన ఉపరాష్ట్రపతి వంటి పోస్టులో సీఎం నితీశ్‌ కుమార్‌ను కూర్చోబెట్టాలనేదే బీజేపీ అసలు ఉద్దేశమంటున్నారు. నితీశ్‌ కుమార్‌ను తప్పించి, బీహార్‌లో తమ పార్టీ సీఎంను కూర్చోబెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓటమి ఖరారని భావిస్తున్న బీజేపీ హఠాత్తుగా ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించింది. అయితే, గతంలో పలుమార్లు నితీశ్‌ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనున్నారంటూ వచ్చిన వార్తలు విధితమే.శశిథరూర్‌కు ఆఫర్‌?ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌కు క్రమంగా దూరమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే హస్తానికి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి శశిథరూర్‌ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో శశిథరూర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను పార్టీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.లిస్టులో వారిద్దరూ.. ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనే ప్రచారం కూడా జరుగుతోంది. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్‌ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సిన్హా.. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు, వివాదాలతో అనేక సార్లు వార్తల్లో నిలిచారు. దీంతో, ఆయన పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో.. నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గుచూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎవరు అనే ఉత్కంఠ నడుస్తోంది.

India Slams Pakistan at United Nations4
‘సమితి’లో పాక్‌ బండారం బయటపెట్టిన భారత్‌

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ తీరుతెన్నులను భారత్‌ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్‌ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్‌ పేర్కొన్నారు. అనంతరం భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు.

WCL 2025 AB de Villiers Stars as Proteas Massive win Over India Champions5
డివిలియర్స్‌ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్‌కు షాక్‌

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025 (WCL 2025)సీజన్‌ను ఇండియా చాంపియన్స్‌ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్‌ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా చాంపియన్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.డివిలియర్స్‌ విధ్వంసంఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా (22), జాక్వెస్‌ రుడాల్ఫ్‌ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సరేల్‌ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్‌ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU— . (@ABDszn17) July 22, 2025 భారీ స్కోరుమిగతావాళ్లలో స్మట్స్‌ (17 బంతుల్లో 30), వాన్‌ విక్‌ (5 బంతుల్లో 18) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్‌ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇండియా చాంపియన్స్‌ బౌలర్లలో పీయూశ్‌ చావ్లా, యూసఫ్‌ పఠాన్‌ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్‌ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్‌ ఊతప్ప (2), శిఖర్‌ ధావన్‌ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్‌ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్లఈ క్రమంలో స్టువర్ట్‌ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్‌ పఠాన్‌ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌ (10), పీయూశ్‌ చావ్లా (9), పవన్‌ నేగి (0), వినయ్‌ కుమార్‌ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్‌ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.చివరన యువీ సేనమరోవైపు.. ఇండియా చాంపియన్స్‌ పాకిస్తాన్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకోగా ఒక పాయింట్‌ వచ్చింది. తాజా మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి సీజన్‌లో యువీ సేన ఫైనల్లో పాక్‌ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?

gold and silver rates today on market in telugu states6
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Suriya Karuppu Movie Teaser Telugu7
సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్

'కంగువ'తో ఓ రేంజులో దెబ్బతిన్న సూర్య.. 'రెట్రో'తో కొంతమేర పర్వాలేదనిపించుకున్నాడు. ఎందుకంటే తమిళంలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కరుప్పు' మూవీతో వస్తున్నాడు. బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి దర్శకనిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగానీ అదే టైటిల్‌ని యధాతథంగా ఉంచేశారు. టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకుడు.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)

Sagubadi: Kullakar Rice several health benefits and nutritional vules8
కుల్లాకర్‌ రైస్‌ : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఫలిస్తున్న కలలు

సంతాన భాగ్యానికి, ఆరోగ్య భాగ్యానికి చిరునామాగా నిలుస్తోంది అరుదైన హెరిటేజ్‌ రైస్‌ ‘కుల్లాకర్‌’ (Kullakar Rice). ఈ అపురూపమైన రెడ్‌ రైస్‌ పుట్టిల్లు తమిళనాడు అయినా దేశవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దేశీ వరి వంగడాల్లో పోషకాలు, విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఒకానొక అపురూప వంగడం ఇది. గర్భ ధారణలో సమస్యలను అధిగమించాలన్నా.. లేకుండా సహజ రీతిలో సుఖప్రసవం కావాలన్నా.. ప్రసవానంతరం తల్లీ బిడ్డా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా.. అన్నిటికీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కుల్లాకర్‌ తదితర దేశీ వరి బియ్యాన్ని ఆశ్రయించాల్సిందేనా? దేశీ ఆవు పాలు, నెయ్యిని మెనూలో జోడించాల్సిందేనా?? అంటే.. ముమ్మాటికీ అవును అంటున్నారు ‘సేవ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్‌పికె) సాధకులు, దేశీ విత్తన పరిరక్షకులు ఎం. విజయ్‌రామ్‌. ఆరోగ్యవంతమైన కుటుంబ జీవనానికి కుల్లాకర్‌ ఆరోగ్య బాటలు వేస్తోందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ముడి కుల్లాకర్‌ బియ్యాన్ని అనేక గ్రామాల్లో, హైదరాబాద్‌ నగరంలో గత కొన్నేళ్లుగా పలువురితో తినిపించారు. వారి అనుభవాల సారాన్ని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. కేవలం కుల్లాకర్‌ బియ్యం తినటం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన సమృద్ధ జీవనానికి దోహదం చేసే ‘దేశీ ఆహారంతో కూడిన ఒక సమగ్ర జీవన విధానాన్ని ఆయన సూచిస్తున్నారు. ఇంతకీ దొడ్డు/ముతక రకం కుల్లాకర్‌ బియ్యం చుట్టూ అల్లుకున్న విశేషాలేమిటి? వాడిన/వాడుతున్న కుటుంబాల సుసంపన్న అనుభవాలేమిటి?? ఆలస్యం ఎందుకు.. చదవండి!మొదట సిజేరియన్‌.. రెండో కాన్పు నార్మల్‌!అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్లం. మొదట కాన్పులో బాబు పుట్టినప్పుడు సిజేరియన్‌ ఆపరేషన్‌ అయ్యింది. హైదరాబాద్‌ వచ్చిన రోజే రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ అయ్యింది. సాధారణ వైట్‌రైస్‌ తినకుండా ఉండలేకపోయేదాన్ని. కేర్‌లెస్‌గా జంక్‌ఫుడ్‌ తినేదాన్ని. ప్రీడయాబెటిక్‌ స్టేజ్‌కి వెళ్లా. రెండో కాన్పు కూడా ఆపరేషన్‌ తప్పదనుకున్నాం. అయితే, గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత, విజయరామ్‌ గారి వీడియోలు చూసి సుఖప్రసవానికి, ఆరోగ్యానికి కుల్లాకర్‌ బియ్యం ఉపయోగపడతాయని తెలుసుకున్నా. అప్పటి నంచి 4–5 నెలల పాటు కులాకర్‌ బియ్యాన్ని మట్టిపాత్రలో వండుకొని తినటం, దేశీ ఆవు నెయ్యి, పాలు వాడటం శ్రద్ధగా చేశా. నార్మల్‌ డెలివరీ అయ్యింది. బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 21వ రోజే తల నిలిపాడు. స్థిమితంగా, నెమ్మదిగా ఉంటాడు. ఆకలైతేనో, నిద్ర వస్తేనో ఏడుస్తాడు. మా ఇద్దరి పిల్లలకు ఈ విషయంలో తేడా గమనించాను. డెలివరీ తర్వాత బహురూపి, నారాయణ కామిని, ఇంద్రాణి వంటి దేశీ బియ్యం తింటున్నాం. నల్లబియ్యం, ఎర్రబియ్యం దోసెలకు వాడుతున్నాం. మా ఇంట్లో రెండు వైపులా పెద్దవాళ్లకు సుగర్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూర్చొని చేసే ఉద్యోగం, పైగా పని వత్తిడి. అయినా, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ ఆహారం తింటున్నాం కాబట్టి ఆ భయం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం. ఆహారాన్ని ఇలా మార్చుకుంటే యూరిన్‌ ఇన్ఫెక్షన్, పిసిఓఎస్, పీరియడ్స్‌ సమస్యలు పోతాయి. మళ్లీ రావు. ఆలస్యం కాకముందే కళ్లు తెరిచి మీరేమి తింటున్నారో తెలుసుకోమని యువతకు స్వానుభవంతో ఘంటాపథంగా చెబుతున్నా. -రామవరపు సింధుకుమారి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, కొండాపూర్, హైదరాబాద్‌ 3 నెలల్లోనే ఫలించిన కల పెళ్లయిన ఐదేళ్లకు తొలి కాన్పులో బాబు అనారోగ్యంతో పుట్టి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 50 రోజులకు చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ గర్భం రాలేదు. ఆ దశలో కులాకర్‌ బియ్యం మధ్యాహ్నం, రాత్రి వండుకొని తినటం ప్రారంభించిన మూడు నెలల్లోనే, ఎటువంటి మందులు వాడకుండానే, నా భార్య సింధూరి గర్భం దాల్చింది. తర్వాత కూడా ఏ సమస్యలూ రాలేదు. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించింది. కులాకర్‌ బియ్యం గర్భం దాల్చటానికి దోహదపడుతున్నట్లు యూట్యూబ్‌లో విజయరామ్‌ వీడియో చూసి రెండేళ్ల క్రితం సేవ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి కలిశాం. అప్పటి నుంచి కుల్లాకర్, బహురూపి, గోవింద భోగ్, నవార బియ్యం, దేశీ ఆవు నెయ్యి పాలు ఉపయోగిస్తున్నందు వల్లనే మా కల నెరవేరింది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం చేకూరిందని నూరు శాతం నమ్ముతున్నాం. ఇవన్నీ తింటుంటే ఎగతాళి చేసిన మా అక్క ఇప్పుడు రసాయనాల్లేని దేశీ బియ్యం, దేశీ ఆవు ఉత్పత్తుల ప్రభావాన్ని గుర్తించింది. మా అత్తగారి (కడప జిల్లా వేంపల్లె) ఊళ్లో 3 ఎకరాల భూమి కొన్నా. నాకు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించబోతున్నాం. – సి. క్రాంతికుమార్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, హైదరాబాద్‌20 మంది కలలు పండాయి! వికారాబాద్‌ జిల్లా దారూర్‌ మండలం నాగసముందర్‌ గ్రామంలో సంతానం కావాలనుకునే 30 మంది మహిళలకు 18 నెలల పాటు కుల్లాకర్‌ బియ్యాన్ని ఇచ్చి వాడించాం. అదే విధంగా, కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు లంక గ్రామంలో 18 నెలల పాటు 20 మందికి ఈ బియ్యాన్ని తినిపించాం. వీళ్లందరూ గర్భదాల్చారు. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టారు. పిల్లల బరువు 2.5 కేజీల నుంచి 3 కేజీల మధ్యన వుంది. పుట్టిన పిల్లలు చలాకీగా వున్నారు. వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుంది. ఒక సంవత్సరం లోపు పిల్లలు ఇతరుల దగ్గర వున్నప్పుడు చికాకుతో ఏడవట్లేదు. పాలు అవసరమైనప్పుడు మాత్రమే తల్లి కోసం ఏడుస్తున్నారు. మధ్యలో తల్లి కనిపిస్తూ వుంటే ఇతరులతో స్థిమితంగా వుండ గలుగుతున్నారు. తల్లుల ఆరోగ్యం బాగుంది. పిల్లలకు సరిపడా పాలు వున్నాయి. ఈ పద్ధతిని పాటించిన ఒక ప్రవాస భారతీయురాలు కుల్లాకర్‌ బియ్యాన్ని వాడి బిడ్డకు సరిపడా పాలు ఇవ్వడమే కాకుండా తల్లి పాల బ్యాంకుకు తన పాలను దానం చేయగలిగింది. చాలా మంది గర్భవతులకు సహజ సిద్ధంగా సులభ ప్రసవం జరిగింది. 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేని తల్లి ఈ బియ్యాన్ని వాడి 40 రోజుల్లోనే గర్భవతి అయ్యింది. అంతకు మునుపు అబార్షనై, పిసిఓడితో బాధపడే ఒకామె ఈ బియ్యాన్ని 6 నెలలు వాడి పండంటి బిడ్డను కన్నారు. ప్రైవసీ కోసం వారందరి పేర్లు బహిరంగంగా ఇవ్వలేకపోతున్నాం. ఆసక్తి గల ఎవరైనా హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్డులోని ‘సేవ్‌’ ఆఫీసు(సుంకర వెంకట రమణ: 63091 11427) ను సంప్రదించి, వారితో ఫోనులో మాట్లాడొచ్చు. తర్వాత నేరుగా కలవొచ్చు కూడా!– ఎం. విజయ్‌ రామ్, దేశీ విత్తన పరిరక్షకులు, సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్‌పికె) సేద్య విధాన సాధకులు, సేవ్‌ సంస్థ వ్యవస్థాపకులు కుల్లాకర్‌లో పోషకాలేమిటి?సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే దేశీ వరి బియ్యంలో అద్భుతమైన పోషక / ఔషధ విలువలు చెక్కు చెదరలేదన్న విషయం మనకు బోధపడుతుంది. అపారమైన దేశీ వరి జీవవైవిధ్యం చాలా వరకు కాలగర్భంలో కలసిపోయింది. అయితే, కొద్ది మంది ముందుచూపున్న రైతులు ఇప్పటికీ అనేక వందల అలనాటి వరి వంగడాలను ఏటేటా సాగు చేస్తూనే ఉన్నారు. వీటిని అపురూపంగా పరిరక్షించుకుంటున్నారు. ఇంతకీ, ఏ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఏయే దేశీ వరి బియ్యం ఉపయోగపడతాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు! అందుకే ఈ ఆహారమే ‘దివ్యౌషధం’ అయ్యింది!! చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ నాలెడ్స్‌ సిస్టమ్స్‌ (సిఐకెస్‌) అనే స్వచ్ఛంద సంస్థ ‘ట్రెడిషినల్‌ రైస్‌ వెరైటీస్‌ ఆఫ్‌ తమిళనాడు: ఏ సోర్స్‌ బుక్‌’ అనే సంకలనాన్ని 2019లో ప్రచురించింది. దీని ప్రకారం.. సేంద్రియంగా పండించిన కుల్లాకర్‌ బాయిల్డ్‌ (ఉప్పుడు) బియ్యంలో వివిధపోషకాలు మెండుగా ఉన్నాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జిఐ) తక్కువ. ఐరన్, కాల్షియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

IAF to phase out MiG-21 fighter jets9
మిగ్-21.. ‘రష్యన్’ యుద్ధ విమానానికి వీడ్కోలు!

మిగ్-21 యుద్ధ విమానాలు.. ఇవి రష్యన్ ఫైటర్ జెట్స్. ఒకప్పుడు యుద్ధాల్లో భారత్ విజయానికి బాటలు పరిచిన మిగ్స్.. పిట్టల్లా నేల కూలి, ఎందరో పైలట్ల ప్రాణాలు తీసి ‘ఎగిరే శవపేటికలు’ గానూ అపకీర్తి మూటగట్టుకున్నాయి. 60 ఏళ్లపాటు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మిగ్-21 విమానాలు ఇక భారత నేలను ముద్దాడి ఈ మట్టిపైనే శాశ్వత విశ్రాంతి తీసుకోబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా మిగ్-21 యుద్ధ విమానాలను విడతలవారీగా సేవల నుంచి తప్పించాలని, దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1ఎ’ను వాటి స్థానంలో మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భావిస్తోంది.భారత్ వద్ద ప్రస్తుతం 36 మిగ్-21లు ఉన్నాయి. వీటిలో చివరి వేరియంట్ అయిన ‘బైసన్’ను ఇప్పుడు సేవల నుంచి తొలగించనున్నారు. మనకు మిగ్-21 సేవలు 1963లో తొలిసారి ప్రయోగాత్మకంగా మొదలయ్యాయి. అప్పటినుంచి రష్యన్ సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందే వరకు కొన్ని దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి మిగ్-21 వెన్నెముకగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఇటు రక్షణ పరంగానూ, అటు ప్రత్యర్థులపై దాడుల పరంగానూ మన వైమానిక దళానికి గగనతలంలో స్పష్టమైన ఆధిపత్యం కట్టబెట్టింది ఈ యుద్ధ విమానమే.సోవియట్ కాలంలో తయారీ!సోవియట్ యూనియన్ హయాంలో మికోయాన్-గురెవిచ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన మిగ్-21 ఫైటర్ జెట్ తొలిసారిగా రెక్కలు విప్పుకుని 70 ఏళ్ల క్రితం 1955లో ఆకాశంలో రివ్వున ఎగిరింది. శక్తిమంతమైన ‘తుమన్ స్కై ఆర్-25’ టర్బోజెట్ ఇంజిన్ సాయంతో ఈ విమానం ధ్వని వేగానికి రెండు రెట్ల పైబడిన వేగం అందుకుంటుంది. ఒకప్పుడు మన దేశంలో 900 దాకా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఉండేవి. వాటిలో 660 విమానాలను నాటి ఒప్పందం మేరకు ఇండియాలోనే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారుచేశారు.1965, 1971 సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో, 1999లో కార్గిల్ యుద్ధంలో మిగ్-21 తనదైన ముద్ర వేసింది. 2019లో బాలాకోట్ (పాక్)లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన దాడుల్లోనూ కీలక పాత్ర పోషించింది. మిగ్-21లో మూడో తరానికి చెందిన ‘మిగ్-21 బిస్’ను 1976లో మన వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఇక రాడార్, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థల పరంగా మరింత అధునాతనమైన ‘మిగ్-21 బైసన్’ వేరియంట్ వీటిలో చివరిది.మిగ్-21 బైసన్.. అరివీర ‘డాగ్ ఫైటర్’!నరాలు తెగే ఉత్కంఠ పుట్టించేలా రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఊహకందని విన్యాసాలతో అతి సమీపంగా ఒకదానికొకటి భీకరంగా తలపడుతూ రెండో దానిపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తే అది... ‘డాగ్ ఫైట్’! క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలు లేని తొలినాళ్లలో యుద్ధ విమానాలకు మెషీన్ గన్స్ ఉండేవి. శత్రు యుద్ధ విమానాన్ని కూల్చడం కోసం కాల్పులు జరపడానికి రెండో విమానం మొదటి దానికి బాగా దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.ఇలా రెండు విమానాలూ మెరుపు వేగంతో పైకీ, కిందికీ కదులుతూ, హఠాత్తుగా మలుపులు తీసుకుంటూ, ఒకదానికి మరొకటి చిక్కకుండా గిరికీలు కొడుతూ హోరాహోరీగా ‘డాగ్ ఫైట్’లో పాల్గొనేవి. మిగ్-21 బైసన్ గొప్ప ‘డాగ్ ఫైటర్. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆర్-73 క్షిపణులను దానికి అమర్చారు. ఆరితేరిన సుశిక్షిత పైలట్ దొరకాలే గానీ.. ప్రత్యర్థిపై మిగ్-21 బైసన్ వీరోచితంగా విరుచుకుపడుతుందనడంలో కించిత్ అతిశయోక్తి లేదు! 2004లో ‘కోప్ ఇండియా’ పేరిట భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అతి సమీప యుద్ధ విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఎఫ్-15 ఫైటర్ జెట్స్ కంటే మిగ్-21 బైసన్ విమానాలు మెరుగ్గా రాణించి ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి.కూలిన మిగ్స్ 400... 200 మంది పైలట్ల మృతి!చారిత్రకంగా భారత వైమానిక దళానికి ఎన్ని సేవలందించినా, ఎన్ని విజయాలు సాధించిపెట్టినా, దేశ భౌగోళిక ప్రాంతాన్ని ఎంత గొప్పగా పరిరక్షించినా మిగ్-21లకు ‘ఎగిరే శవపేటికలు’గా, ‘వితంతువుల సృష్టికర్త’ (Widow Maker)గా చెడ్డ పేరు మాత్రం తప్పలేదు. మన దేశంలో గత 60 ఏళ్లలో మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయిన సంఘటనలు 400 దాకా ఉన్నాయి. 200 మందికి పైగా ఐఏఎఫ్ పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ఆయా దుర్ఘటనల్లో మరణించారు. ఉద్దేశిత కాలం కంటే సుదీర్ఘ కాలంపాటు ఈ యుద్ధ విమానాలను సర్వీసులో ఉంచడంతో ఇటు భారీగా ప్రాణనష్టం సంభవించగా అటు జెట్స్ నిర్వహణ ఖర్చూ పెరిగిపోయింది.2023 మే మాసంలో ఓ మిగ్-21 విమానం బహ్లాల్ నగర్ (రాజస్థాన్) వద్ద సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ముగ్గురు గ్రామస్థులు మరణించారు. ఆ దుర్ఘటనతో మన వైమానిక దళం మిగ్-21 శ్రేణి విమానాలన్నిటినీ గ్రౌండ్ చేసింది. ఇక వీడ్కోలు యాత్రలో భాగంగా స్క్వాడ్రన్-4కు చెందిన మిగ్-21 బైసన్ విమానం చివరిసారిగా 2023 అక్టోబరులో రాజస్థాన్ పట్టణమైన బార్మర్ గగనవీధుల్లో చక్కర్లు కొట్టింది. యూరప్ ఖండంలో చివరి మిగ్-21 గత ఏడాది క్రొయేషియాలో రిటైరైంది. మరో రెండు నెలల్లో మన దేశంలోనూ మిగ్-21 అధ్యాయం ముగియబోతుంది. మిగ్-29 యుద్ధ విమానాలకు కూడా 2027 నాటికి స్వస్తి పలకాలని ఐఏఎఫ్ భావిస్తోంది. - జమ్ముల శ్రీకాంత్.

Chandrababu Naidu Govt Neglected Womens with Aadabidda Nidhi10
ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి

ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యు­లేషన్‌ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకు­న్నాకే హామీ ఇచ్చాం. సూపర్‌ సిక్స్‌ వెరీ క్లియర్‌. ఇది మా ఎష్యూరెన్స్‌. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్‌ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‌‘వైఎస్సార్‌సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్‌ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్‌ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‌‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్‌ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్‌ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్‌ సిక్స్‌ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్‌ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌కోవిడ్‌ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్‌ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్‌సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్‌ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలి­పోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్‌వీ మోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement