సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన బీజేపీ, టీడీపీలు ఎట్టకేలకు జతకట్టాయి. ఈ పొత్తు తమ్ముళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మైనార్టీలు వ్యతిరేకిస్తున్న బీజేపీతో టీడీపీ కలిసి నడిచేందుకు నిర్ణయించుకోవడం మొదటికే మోసం తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఓటమి భయంతో అధినేత చంద్రబాబు ముందూ వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లా టీడీపీ శిబిరానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
జిల్లాలో జయాపజయాలను శాసించే ముస్లిం మైనారిటీలు ఇకపై టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదని ఈ పొత్తుతో స్పష్టమైపోయింది. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజించటంలో ప్రధాన భూమిక పోషించిన బీజేపీతో టీడీపీ జతకట్టడంతో విభజన వాదులంతా ఒకే గూటికి చేరినట్లయింది.
బీజేపీతో పొత్తు ఖరారైనప్పటికీ జిల్లాలో ఆ పార్టీకి ఏ సీట్లు కేటాయిస్తారనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం మూడు అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నారు. ఇందులో పాణ్యం, ఆదోని, నంద్యాల అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేతలు మాత్రం అభ్యర్థే లేని కోడుమూరు అసెంబ్లీని కేటాయిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కమల దళం వ్యతిరేకిస్తోంది.
ఆ మూడు బీజేపీకి కేటాయిస్తే...
కమల దళం కోరినట్లు నంద్యాల, ఆదోని, పాణ్యం అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే టీడీపీ పుట్టి మునిగినట్లేననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విభజన భయంతో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, ఆదోని టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, పాణ్యాన్నే నమ్ముకుని పచ్చకండువా కప్పుకున్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డికి బీజేపీ డిమాండ్లు మింగుడు పడటం లేదు. పాణ్యం సీటు తనదేనని.. అధినేత హామీ ఇచ్చాడంటూ కోట్లు ఖర్చు చేస్తూ ప్రచారంలో తలమునకలవుతున్న కేజే రెడ్డి పరిస్థితి ఎటూ తేలడం లేదు. బీజేపీ నేతలు అడిగిన డిమాండ్‌కు తలొగ్గితే ఆ ముగ్గురు నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని తెలుస్తోంది. ఒక వేళ్ల ఆ మూడు సీట్లు కేటాయిస్తే అధిష్టానాన్ని ధిక్కరించేందుకైనా సిద్ధమవుతామని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు.
సమైక్యవాదుల ఆగ్రహం: విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. అదేవిధంగా పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన పార్టీ బీజేపీ. ఈ రెండు పార్టీలు అధికారం కోసం చేతలు కలపటాన్ని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
‘పొత్తు’ చిక్కులు
Published Mon, Apr 7 2014 12:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement