ఇది ప్రజా విజయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
- కాంగ్రెస్‌పై కోపాన్ని ఓట్ల రూపంలో చూపించారు
- హామీలన్నీ తప్పకుండా అమలుచేస్తా
- ఎన్డీయే ప్రభుత్వంలో చేరతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిది ప్రజావిజయమని, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ అందుకు ప్రధాన కారణమయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు శుక్రవారం రాత్రి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి సభలో ప్రకటించిన విధంగానే సీమాంధ్ర ప్రాంతంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, వారి ఆశలు వమ్ము చేయకుండా తాను పని చేస్తానని చెప్పా రు.
సీమాంధ్ర ప్రాంతాన్ని మరో సింగపూర్‌గా చేస్తామని పునరుద్ఘాటించారు. అభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు అవినీతి, కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ క్షీణించటంతో పాటు నిత్యావసరాల ధరలు పెరిగాయని, సంక్షేమ కార్యక్రమాలు దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు తమ కోపాన్ని ఓట్ల ద్వారా చూపారని విశ్లేషించారు. రాష్ట్రాన్ని కేంద్రం విభజించిన తీరు బాధాకరంగా ఉందని, టీడీపీని దెబ్బ తీయాలనే కుట్ర పూరిత ఆలోచనతో గొయ్యి తీసిన కాంగ్రెస్ ఆ గోతిలోనే పడిపోయిందని విమర్శించారు. నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్‌లతో మాట్లాడి వారికి కృతజ్ఞతలు చెప్పానని, వారూ నాకు అభినందనలు తెలిపారన్నారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
- ఎన్నికల సమయంలో ప్రజలకు నిర్దిష్టమైన హామీలిచ్చా. వాటిని తీర్చేందుకు సర్వశక్తులూ ఉపయోగిస్తా. పద వీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేసే అంశంపై బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వాటిని అమలు చేస్తాం. అభివృద్ధిపై దృష్టి పెట్టి పేదలకు న్యాయం చేస్తాం.
- ఆంధ్రప్రదేశ్‌ను కిందిస్థాయి నుంచి పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నేను ప్రస్తుతం ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ప్రణాళికా బద్ధంగా పనిచేయాలి. నట్టులు, బోల్టులు బిగించుకోవాల్సిన అవసరం ఉంది.
- గతంలో మేము ఎన్‌డీఏకు బయటినుంచి మద్దతు ఇచ్చాం. ఈసారి ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నాం, ప్రభుత్వంలో చేరతాం. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటాం.
- పార్టీ గెలుపుకోసం పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, మేధావులు పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు నేను చేసినన్ని పోరాటాలు మరెవరూ చేయలేదు. నాకు ఎవరిపై వ్యక్తిగతంగా కక్ష లేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడా (జగన్‌పై కక్ష తీర్చుకుంటారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు).
- సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగైన నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ బలపడకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలను చేర్చుకున్నాం. తద్వారా పలు జిల్లాల్లో మా పార్టీ ప్రయోజనం పొందింది. కాంగ్రెస్ పార్టీ చర్రితలో ఇలాంటి పరాభవాన్ని ఎపుడూ చూడలేదు. ఆ పార్టీకి ఈ ఎన్నికలు ఓ గుణపాఠం. స్వార్థం కోసం రాజకీయాలు చేస్తే ప్రజలు స్వాగతించరని ఈ ఫలితాలు నిరూపించాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మగా మారారు.
- తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్ర శేఖరరావుకు అభినందనలు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కారణమైన నన్ను తెలంగాణ ప్రాంత ప్రజలు మర్చిపోలేదు. అందుకే మెజారిటీ స్థానాల్లో మాకు ఓట్లు వేశారు. బీజేపీ కూటమి దేశంలో 300 స్థానాలకు పైగా సాధిస్తుందని తొలుత చెప్పింది నేనే.