టీడీపీలో కమల కల్లోలం
Published Mon, Apr 7 2014 2:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా టీడీపీ భయపడినంతా అయ్యింది.. కమలంతో పొత్త్తు పార్టీలో కల్లోలం రేపుతోంది. ఒంటరిగా పోటీచేయలేని అధినేత చంద్రబాబు పిరికితనం టీడీపీ పుట్టి ముంచేస్తోంది. నరసన్నపేటను బీజేపీకి కేటాయించాలన్న నిర్ణయంపై ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఆదివారం రాత్రి ఆకస్మికంగా సమావేశమైన నియోజకవర్గ టీడీపీ నేతలు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. కింజరాపు కుటుంబం రాజకీయ స్వార్థం కోసం నరసన్నపేట టీడీపీని బలిచేశారని దుయ్యబట్టారు. నరసన్నపేటలో పట్టుమని పదిమంది కార్యకర్తలు లేని బీజేపీకి ఆ స్థానాన్ని ఎలా కేటాయిస్తారని నిలదీశా రు. ‘నిర్ణయం మార్చుకోండి.. లేదా మా తడాఖా చూపిస్తాం’అని అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఇటీవల టీడీపీలో చేరిన నేతలు మళ్లీ వెనక్కివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఆ ఇద్దరి నిర్వాకమే!
జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల రాజకీయ స్వార్థం వల్లే నరసన్నపేట నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి సహా ఆ పార్టీ నేతలందరూ ఆ ఇద్దరి పాత్రనే తప్పుబడుతున్నారు. నేరుగా పేర్లు ప్రస్తావించనప్పటికీ కింజరాపు కుటుంబం వైపే వారు వేలు చూపిస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు వ్యూహాత్మకంగా నరసన్నపేటను బీజేపీకి కేటాయించేలా పావులు కదిపారన్నది వారి ప్రధాన ఆరోపణ. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న రామ్మోహన్‌కు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతోనే ఈమేరకు నిర్ణయించారని తెలుస్తోంది.
పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు పార్టీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడులను ఈ మేరకు కింజరాపు కుటుంబం మేనేజ్ చేసినట్లు సమాచారం. రామ్మోహన్ నాయుడుకు ఎంపీగా విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క సీటైనా కేటాయించాలని కింజరాపు కుటుంబం ప్రతిపాదించింది. తద్వారా మొత్తం లోక్‌సభ నియోజకవర్గంలో మోడీ చరిష్మాను ఉపయోగించుకోవచ్చన్నది వారి వ్యూహం. చంద్రబాబు ఇటవల జిల్లా పర్యటనకు వచ్చే ముందే నరసన్నపేటను బీజేపీకి కేటాయించాలన్న నిర్ణయం జరిగిపోయింది. అందుకే బగ్గు రమణమూర్తికి ఎలాంటి హామీ ఇవ్వకుండా మాట దాటవేశారు. దీనిపై కొన్ని రోజులుగా ఉప్పందుతున్నా రమణమూర్తితోపాటు నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొంత ఆశ మిగిలే మిణుకు మిణుకులాడేది. కానీ నరసన్నపేటను బీజేపీకి కేటాయించారని ఆదివారం స్పష్టం కావడంతో వారిలో అసంతృప్తి భగ్గుమంది.
టెక్కలి ఇవ్వొచ్చుగా!?..
బగ్గు వర్గం ఎదురుదాడి
రామ్మోహన్ కోసం బీజేపీతో పొత్తు కావాలనుకుంటే టెక్కలి నియోజకవర్గాన్నే ఆ పార్టీకి కేటాయించవచ్చుగా అని బగ్గు రమణమూర్తి వర్గం ప్రశ్నిస్తోంది. కింజరా పు కుటుంబం తమ నియోజకవర్గాలను పదిలంగా ఉంచుకుంటూ.. పార్టీ కోసం కష్టించిన ఇతర నేతలకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తోందని దుయ్యబడుతోంది. వాస్తవానికి టెక్కలి నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణలు టీడీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. కాళింగులు అత్యధికంగా ఉన్న టెక్కలి నుంచి వెలమ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు పోటీ చేయడం ఎంతవరకు సమంజసమని బగ్గు వర్గం ప్రశ్నిస్తోంది. దీనిపై తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తోంది.
జెండాపట్టేవారే లేరు.. టిక్కెట్టా?
నరసన్నపేటను బీజేపీకి కేటాయించారన్న సమాచారం టీడీపీలో కలకలం సృష్టించింది. అధినేత చంద్రబాబు నిర్ణయంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గమంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఈ విషయంపై ఫోన్లలో మంతనాలు సాగించిన నరసన్నపేట నియోజకవర్గ నేతలు రాత్రి అయ్యేసరికి తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఆ రాత్రే నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆకస్మికంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తితోపాటు నాలుగు మండలాల నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు. అధినేత చంద్రబాబు వైఖరిని నేతలు, కార్యకర్తలు తప్పుబట్టారు. ఒంటరిగా పోటీచేసే సాహసం తమ అధినేత చంద్రబాబుకు లేదని వారు ఎద్దేవా చేశారు. ‘ఇంత పిరికివాడు నాయకుడు కాలేడు... ఈయన్ని నమ్ముకుని మనం మునిగిపోతున్నాం’అని వారు ఒక దశలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జెండా పట్టుకునే పదిమంది లేని నరసన్నపేట నియోజకవర్గాన్ని ఆ పార్టీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అభీష్టంతో నిమిత్తంలేకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. నరసన్నపేట నుంచి టీడీపీయే పోటీచేసేలా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని కూడా ఒత్తిడి చేశారు. అందుకు తాము ఆయనకు ఆర్థికంగా కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బగ్గు రమణమూర్తి కూడా చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పార్టీ కోసం ఉపయోగించుకుని తీరా ఎన్నికల వేళ తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగాలి అనుకుంటున్నానని... కానీ కార్యకర్తల అభిప్రాయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్తాన్నారు. పార్టీ తీరు సరిగా లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిద్దామని చెప్పారు. నరసన్నపేట టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీని ఓ కుదుపు కుదపడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement