చంద్రబాబు, కేసీఆర్‌లకు భద్రత పెంపు
* సమీక్షించిన ఐఎస్‌డబ్ల్యూ,సిటీ పోలీసులు
* అధినేతలకు డీజీపీ,అదనపు డీజీపీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో రెండు పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ల భద్రతను పోలీసు విభాగం సమీక్షించింది. రాష్ట్ర నిఘా విభాగం అధీనంలోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ), హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఇద్దరినీ కలసి మాట్లాడారు. వారికి కల్పిస్తున్న భద్రతను శుక్రవారం పెంచారు. ప్రస్తుతం చంద్రబాబు ‘జెడ్ +’ కేటరిగీలో ఉండటంతో పాటు అదనంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) భద్రత కూడా ఉంది.
ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా అదనపు సిబ్బందిని కేటాయించారు. ‘జెడ్’ కేటగిరీలో ఉన్న కేసీఆర్‌కు ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి భద్రతాధికారిగా ఉన్నారు. ఈ స్థానంలో డీఎస్పీ ర్యాంక్ అధికారితో పాటు అదనంగా ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ఎస్కార్టు వాహనాలకు అదనంగా మరొకటి చేర్చారు. ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్ల ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో సాయుధుల సంఖ్యను పెంచారు. వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మరోసారి భద్రతను పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు.
డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) వీఎస్కే కౌముది, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీ అధినేతలను కలసి శుభాకాంక్షలు తెలిపారు. సీమాంధ్ర పోలీసు అధికారుల సంఘం కూడా శుక్రవారం చంద్రబాబును మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిసింది. సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యవర్గ సభ్యులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.